కాడెద్దుల పండుగ.. కనుల విందుగ..

7 Sep, 2021 15:22 IST|Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: ఏటా పొలాల అమావాస్య సందర్భంగా జరుపుకునే కాడెద్దుల పండుగను ఆదిలాబాద్‌ జిల్లాలో సోమవారం ఘనంగా నిర్వహించారు. వ్యవసాయ పనుల్లో తమకు తోడుగా నిలిచే ఎడ్లను ఉదయమే చెరువులు, వాగులు, నదుల వద్దకు తీసుకెళ్లి స్నానం చేయించారు. ఇంటికి వచ్చిన తర్వాత వాటిని నూతన వస్త్రాలు, అలంకరణ సామాగ్రితో అందంగా ముస్తాబు చేశారు. 

కుటుంబ సభ్యులంతా కలిసి పూజలు చేశారు. రోజంతా ఉపవాసం పాటించి తొమ్మిది రకాల నైవేద్యాలు తయారుచేసి పశువులకు తినిపించారు. అనంతరం ఉపవాసం విరమించారు. సాయంత్రం గ్రామదేవతల ఆలయాల వద్దకు ఎడ్లను తీసుకెళ్లి ఆలయాల చుట్టూ ప్రదక్షిణ చేయించారు. ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం పూసాయి గ్రామరైతులు ఎల్లమ్మ ఆలయం చుట్టూ ఎడ్లతో ప్రదక్షిణ చేశారు.  

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మివాడలోని మహాలక్ష్మి ఆలయం, అశోక్‌ రోడ్డులోని పోచమ్మ ఆలయం, డైట్‌ మైదానం సమీపంలోని ముత్యాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొన్ని గ్రామాల్లో ఎద్దులకు పోటీలు నిర్వహించారు.  కాడెద్దుల పండుగ సందర్భంగా పంచాయతీల ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో మామిడి తోరణాలు కట్టించారు. రంగు రంగుల బెలూన్లతో అలంకరించారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు