సరిహద్దుల్లో మావోల అలజడి.. పుంజుకోకముందే కట్టడి చేయాలని పోలీసుల అలర్ట్‌

2 Sep, 2022 02:05 IST|Sakshi

ఆదిలాబాద్, కొత్తగూడెంలో పుంజుకొనేందుకు మావోయిస్టుల సన్నాహాలు 

తిర్యాణి, మంగి ప్రాంతాల్లో 2011 తర్వాత మళ్లీ కదలికలు 

గ్రామ రక్షక దళాల పునర్నిర్మాణం దిశగా కసరత్తు 

చర్లలో ఇన్‌ఫార్మర్ల నెపంతో వరుసగా ఇద్దరి హత్య 

అప్రమత్తమైన రాష్ట్ర పోలీసు యంత్రాంగం 

రంగంలోకి దిగిన గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర సరిహద్దుల్లో కొన్నేళ్ల తర్వాత మళ్లీ మావోయిస్టు పార్టీ కదిలికలు కనిపిస్తుండటంతో నిఘా వర్గాలతోపాటు పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. మావోల కార్యకలాపాలు పుంజుకోకముందే వారిని నియత్రించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్‌ జిల్లాలోని మంగి, తిర్యాణి అటవీ ప్రాంతాల్లో గ్రామ రక్షక దళాలను పునర్నిర్మించే పనిలో స్థానిక దళాలు ఉన్నట్లు వార్తలు రావడం, కొత్తగూడెం జిల్లా చర్ల పరిధిలో ఇన్‌ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు తాజాగా ఇద్దరిని హతమార్చిన నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు నేరుగా రంగంలోకి దిగారు.

ఆదిలాబాద్‌ జిల్లా ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తూ స్థానికులతో సమావేశమై మావోయిస్టు పార్టీ వైపు ఎవరూ వెళ్లకూడదని, పార్టీకి సహకరించరాదని సూచిస్తున్నారు. అలాగే గ్రేహౌండ్స్‌ పార్టీలను కూంబింగ్‌లో నిమగ్నం చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. మరోవైపు కొత్తగూడెం జిల్లా చర్ల పరిధిలో ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు మీదుగా గోదావరి దాటి మావోయిస్టులు భారీగా సమీప అటవీ ప్రాంతాల్లోకి వచ్చారన్న సమాచారం నిఘా వర్గాలకు అందినట్లు తెలుస్తోంది.

పార్టీ కార్యకలాపాలను ఏకకాలంలో విస్తృతపరిచేందుకు మావోయిస్టులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారన్న అనుమానంతో ఈ మొత్తం సరిహద్దు ప్రాంతాల్లో గ్రేహౌండ్స్‌తోపాటు సీఆర్‌పీఎఫ్, కోబ్రా బలగాలను ఉన్నతాధికారులు కూంబింగ్‌లోకి దించినట్లు సమాచారం. 

మాజీల సహకారంపై అనుమానం 
వాస్తవానికి ఆదిలాబాద్‌లో 2011 వరకు మావోయిస్టు పార్టీ విస్తృతంగా కార్యకలాపాలు కొనసాగించింది. రాష్ట్ర స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో, గ్రేహౌండ్స్‌ సంయుక్త ఆపరేషన్లలో కీలక నేతలు ఎన్‌కౌంటర్లలో ప్రాణాలు కోల్పోవడంతో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లకు మకాం మార్చేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు పెద్దగా కదలికలు, కార్యకలాపాలు లేవు. గతంలో తిర్యాణి, మంగి ప్రాంతంలో ఐరీ దళం నాయకుడు శ్రీనివాస్‌ నాయకత్వం వహించాడు. తర్వాత దళం అంతరించిపోవడం, మిగతా సభ్యులంతా లొంగిపోవడంతో కార్యలాపాలు లేవు. అయితే అప్పుడు దళంలో పనిచేసిన పాత సభ్యులెవరైనా మావోయిస్టు పార్టీకి సహకరిస్తున్నారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. 

ఉన్నతాధికారుల ధీమా.. 
మావోయిస్టు పార్టీకి గతంలో మాదిరిగా రిక్రూట్‌మెంట్‌ జరిగే అవకాశమే లేదని, ప్రస్తుతమున్న టెక్నాలజీ యుగంలో ఎవరూ మావోయిస్టు పార్టీ వైపు అడుగులు వేయబోరని పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. పైగా ఎవరైనా అలా పార్టీలో చేరే ప్రయత్నం చేస్తే తమకున్న ‘నెట్‌వర్క్‌’ద్వారా గంటల వ్యవధిలోనే ఆ సమాచారం తెలుస్తుందని... అలాంటి వారిని వెనక్కి తెచ్చి కౌన్సెలింగ్‌ సైతం ఇస్తామని చెబుతున్నారు.   

మరిన్ని వార్తలు