మావోల తలలకు వెల..!

26 Jul, 2020 10:41 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

ఉమ్మడి జిల్లాలో  మళ్లీ మొదలైన మావోల అలజడి

సమాచారం మాకు.. బహుమతి మీకు అంటూ పోలీసుల ప్రచారం

వాల్‌పోస్టర్లు ఆవిష్కరించిన  ఉమ్మడి ఆదిలాబాద్‌ ఓఎస్డీ

సాక్షి, మంచిర్యాల: మావోయిస్టుల తలలకు పోలీస్‌ శాఖ వెల కట్టింది. సమాచారం అందించిన వారికి బహుమతి ఇస్తామని వాల్‌పోస్టర్ల ద్వారా పోలీస్‌ అధికారులు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇలాంటి తతంగం గతంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో సర్వసాధారణంగా ఉండేది. పదేళ్ల అనంతరం మావోయిస్టుల ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మళ్లీ మావోల అలజడి మొదలైంది. ఇటీవల ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి అటవీ ప్రాంతంలో రెండుసార్లు ఎదురుకాల్పులు కూడా జరిగాయి. దీంతో డీజీపీ మహేందర్‌రెడ్డి రంగంలోకి దిగి అటవీ ప్రాంతాల్లో పర్యవేక్షించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పోలీస్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మావోల ఏరివేతనా..? తరిమికొట్టడమా..? అంశంపై చర్చించారు. అదే సమయంలో మావోయిస్టులు పార్టీ పునర్మిర్మాణం చేసినట్లు రాష్ట్ర, జిల్లా, మండలాల వారీగా కమిటీలు ఏర్పాటు చేసి జాబితాను ఇటీవల విడుదల చేయడం గమనార్హం. మావోల అణచివేతకు పోలీస్‌ యంత్రాంగం స్పెషల్‌ పార్టీ, గ్రేహౌండ్స్, సివిల్‌ పోలీసులు వందలాది మందితో 24 గంటలపాటు అడవులను జల్లెడ పడుతున్నారు. పైగా ఉమ్మడి జిల్లా ఓఎస్‌డీగా మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్‌ రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు.

ఉమ్మడి జిల్లాలో నక్సల్స్‌ ప్రస్థానం
నక్సల్‌ ఉద్యమం ఉమ్మడి జిల్లాల్లో నాలుగు దశాబ్దాలు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఉద్య మం పుట్టింది శ్రీకాకుళంలోనే అయినా ఉద్యమానికి ఊపిరిపోసింది మాత్రం ఇక్కడే. బడిపంతులైన కొండపల్లి సీతరామయ్య ఆధ్వర్యంలో జన్నారం మండలం తపాలపూర్‌కు చెందిన పితంబర్‌రావు దొరగడిపై జరిగిన దాడులు.. వారి సోదరుల హత్యతో భీతిల్లి గుండెపోటుతో మరణించినప్పటి నుంచి ఉద్యమం ఇక్కడి అడవుల్లో వేళ్లూనుకుపోయింది. తరచూ పోలీస్, పీపుల్స్‌ మధ్య వార్‌ కొనసాగేది. అదే తరహాలో మవోయిజం తెరమీదికి వచ్చింది. 

సమాచారం మాకు.. బహుమతి మీకు..
మావోయిస్టుల సమాచారం ఇచ్చి సహకరించాలని, సమాచారం ఇచ్చినవారికి తగిన పారితోషికం అందిస్తామని ఓఎస్‌డీ ఆరుగురు మావోయిస్టుల ఫొటొలతో కూడిన వా ల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. వీరి తలలకు గతంలోనే వెల కట్టినా.. తాజాగా విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తామని వెల్లడించారు. ఆదిలాబాద్‌ ఎస్పీ 944079500, నిర్మల్‌ ఎస్పీ 8332811100, ఆసిఫాబాద్‌ ఎస్పీ 8332801100, మంచిర్యాల డీసీపీ 9440795003, ఆసిఫాబాద్‌ అదనపు ఎస్పీ 8333986921కు సమాచారం ఇవ్వాలన్నారు.

మరిన్ని వార్తలు