యాత్రకు బ్రేక్‌.. బండి సంజయ్‌ అరెస్ట్‌

24 Aug, 2022 02:13 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్‌/ జనగామ/ సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌/ కరీంనగర్‌ టౌన్‌: రాష్ట్ర రాజధానిలో బీజేపీ నేతలపై టీఆర్‌ఎస్‌ దాడి, పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ ‘ధర్మదీక్ష’ చేసేందుకు సిద్ధమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రజాసంగ్రామ యాత్రలో ఉన్న సంజయ్‌.. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం పాంనూరులో ఏర్పాటు చేసిన శిబిరం వద్ద మంగళవారం బస్సులో నుంచి కిందకు దిగుతున్న సమయంలో పోలీసులు ఆయన్ను చుట్టుముట్టారు. ప్రజాసంగ్రామ యాత్రకు అనుమతి లేదని, రెచ్చగొట్టే ప్రసంగాలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని, వీటితో పాటు ప్రస్తుత రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ముందుజాగ్రత్తగా అదుపులోకి తీసుకుంటున్నామని చెప్పారు.

పోలీసుల తీరుపై సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిర్వహిస్తున్న ప్రజాసంగ్రామ యాత్రను అడ్డుకోవడం ప్రజాస్వా మ్యానికే తీరని మచ్చ అని వ్యాఖ్యానించారు. బీజేపీ కార్యకర్తల తీవ్ర ప్రతిఘటనల మధ్య సంజయ్‌ను పోలీసులు బలవంతంగా తమ వాహనంలోకి ఎక్కించారు. పోలీసులతో జరిగిన తోపులాటలో జనగామ జిల్లా పరిషత్‌ చైర్మన్, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్‌రెడ్డి కాలికి గాయం అయ్యింది. బీజేపీ కార్యకర్తలు ఎక్కడికక్కడ అడ్డుపడుతున్నా.. వారిని పక్కకు తప్పిస్తూ సంజయ్‌ను నేరుగా కరీంనగర్‌కు తీసుకువెళ్లి గృహ నిర్బంధంలో ఉంచారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పాదయాత్రను ఆపే ప్రసక్తే లేదని, పోలీసులు ఎక్కడ పాదయాత్రను అడ్డుకున్నారో.. అక్కడి నుండే మళ్లీ మొదలుపెడతానని సంజయ్‌ కరీంనగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. బుధవారం నిరసనలకు పిలుపునిచ్చారు. 

ఇదీ నేపథ్యం..
హైదరాబాద్‌లోని ఎమ్మెల్సీ కవిత నివాసం వద్ద జరిగిన ఘటన నేపథ్యంలో బీజేపీ నేతలపై అక్రమ కేసులు, టీఆర్‌ఎస్‌ దాడిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. కేసీఆర్‌ కుటుంబం సాగిస్తున్న దమనకాండకు వ్యతిరేకంగా స్టేషన్‌ఘన్‌పూర్‌ శివారు పాంనూరు వద్ద ఏర్పాటుచేసిన శిబిరం వద్ద ధర్మదీక్ష చేయనున్నట్టు ప్రకటించారు. మరోవైపు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితపై వ్యక్తిగత విమర్శలు చేయడంతో పాటు మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా బండి ప్రసంగాలు చేశారంటూ టీఆర్‌ఎస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గం జాఫర్‌గఢ్‌ మండలం ఉప్పుగల్‌లో బీజేపీ యాత్రను అడ్డుకునేలా గులాబీ సేన ప్లాన్‌ చేసింది.

జెడ్పీ చైర్మన్, పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్‌రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, నన్నపనేని నరేందర్‌తో పాటు ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వెయ్యిమందికి పైగా టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు ఆ గ్రామంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో నల్ల బ్యాడ్జీలను ధరించి ఒక్కసారిగా రోడ్డెక్కారు. పాంనూరులోని ప్రజాసంగ్రామ యాత్ర శిబిరం వద్దకు టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు వస్తారనే ముందస్తు హెచ్చరికలతో పోలీసులు ఉప్పుగల్‌ శివారులోనే వారిని నిలువరించారు. కాగా విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తున్నారని, ముందస్తు సమాచారం లేకుండా ధర్మదీక్షకు పూనుకున్నారంటూ కేసు నమోదుచేసిన స్టేషన్‌ఘన్‌పూర్‌ పోలీసులు... ­బండిని అదుపులోకి తీసుకుని కరీంనగర్‌కు తీసుకువెళ్లారు.  

ఉప్పుగల్‌లో కొనసాగిన ఉద్రిక్తత
బండిని అరెస్టు చేసిన తర్వాత కూడా ఉప్పుగల్‌లో తీవ్ర ఉద్రిక్తత కొనసాగింది. టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ప్రధాన రోడ్డుపై బైఠాయించారు. కార్యకర్తలు కర్రలతో రోడ్డుపైకి చేరుకున్నారు. ఓ పొలం వద్ద వాటర్‌ బాటిల్స్‌ తీసుకెళ్తున్న అటోను బీజేపీదిగా భావించి దాడిచేశారు. మరోవైపు తమ ఫ్లెక్సీలను టీఆర్‌ఎస్‌ కార్య కర్తలు చించివేశారని తెలుసుకున్న బీజేపీ శ్రేణులు కర్రలు పట్టుకుని రోడ్డుపైకి వచ్చాయి. అటుగా వెళ్తున్న టీఆర్‌ఎస్‌ వాహనాల అద్దా లు ధ్వంసం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.పోలీసుల జోక్యంతో సద్దుమణిగింది.

కవితను సస్పెండ్‌ చేయాలి
ఎమ్మెల్సీ కవితపై లిక్కర్‌ స్కాంలో వచ్చిన ఆరోపణల నుంచి దృష్టి మరల్చేందుకు బీజేపీ ప్రజాసంగ్రామ యాత్రపై టీఆర్‌ఎస్‌ శ్రేణులు దాడులు చేస్తున్నాయని బండి సంజయ్‌ ఆరోపించారు.  కవితను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు