మహా జాదుగాళ్లు.. ఢిల్లీలో దొంగిలించి, హైదరాబాద్‌లో అమ్ముతారు.. 

30 Jul, 2022 16:02 IST|Sakshi
నిందితులు మహ్మద్‌ అజార్‌ జావీద్, మహ్మద్‌ జహీర్, మహ్మద్‌ అమన్‌ఖాన్‌  

సాక్షి, హైదరాబాద్‌: ఢిల్లీలో చోరీ చేసిన కార్లను హైదరాబాద్‌లో అమ్ముతున్న ముఠాను శంషాబాద్‌ ఎస్‌ఓటీ, రాజేంద్రనగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారని సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర పేర్కొన్నారు. శుక్రవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ కమిషనరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. అత్తాపూర్‌కు చెందిన అహ్మద్‌ అజార్‌ జావీద్‌ (35) ఖతర్‌ వెళ్లి సోదరి వద్ద ఉంటూ 2020 వరకు ప్రైవేట్‌ జాబ్‌ చేశాడు. తిరిగి వచ్చిన తర్వాత ఉద్యోగం లేక పోవడంతో ఓఎల్‌ఎక్స్‌లో సెకండ్‌ సేల్‌ కార్లుకొని అమ్మే వ్యాపారం చేయాలనుకున్నాడు.

ఈ క్రమంలో ఓఎల్‌ఎక్స్‌లో ఢిల్లీకి చెందిన గులామ్‌ నబీ పరిచయమయ్యాడు. అతని వద్ద కార్లు కొని అమ్ముతుండేవాడు. ఈ క్రమంలో ఓసారి ఫార్చునర్‌ కారును రూ.4 లక్షలకు కొనుగోలు చేశాడు. డాక్యుమెంట్లు ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చి అడగగా ఫార్చునర్‌ చోరీ చేసిందని గులామ్‌ నబీ చెప్పాడు. ఇలాంటి కార్లను అమ్మితేనే ఎక్కువ లాభం వస్తోందని చెప్పడంతో చోరీ చేసిన వాహనాలను హైదరాబాద్‌లో అమ్మేందుకు అజార్‌ జావీద్‌ మరో ఇద్దరు అత్తాపూర్‌కు చెందిన మహ్మద్‌ జహీర్‌(21), బండ్లగూడకు చెందిన అహ్మద్‌ అమన్‌ ఖాన్‌(23)ను జత చేసుకున్నాడు.

గులామ్‌ నబీ ఢిల్లీలో చోరీ చేసిన కార్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు అమ్ముతూ అజార్‌ సొమ్ము చేసుకుంటున్నాడు. కార్లను కొనుగోలు చేసిన వారు డాక్యుమెంట్లు అడిగితే బ్యాక్‌ యాక్షన్‌లో గొనుగోలు చేశామని ఆలస్యం అవుతుందని నమ్మిస్తున్నారు. గురువారం రాజేంద్రనగర్‌ పీఎస్‌ పరిధిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా నెంబర్‌ ప్లేట్‌లేని ఓ కారులో అజార్, జమీర్, అమన్‌ ఖాన్‌ వస్తున్నారు. తనిఖీలలో అనుమానం వచ్చి విచారించగా చోరీ కార్లు విక్రయిస్తున్నట్లు తెలుసుకున్నారు. వారి నుంచి 14 కార్లను స్వాధీనం చేసుకున్నారు.

కేసును ఛేదించిన శంషాబాద్‌ ఎస్‌వోటీ, రాజేంద్రనగర్‌ పోలీసులను సీపీ అభినందించారు. నిందితులు మహ్మద్‌ అజార్‌ జావీద్, మహ్మద్‌ జహీర్, మహ్మద్‌ అమన్‌ఖాన్‌లను చేసి రిమాండ్‌కు తరలించారు. ఢిల్లీ ఉండే మరో నిందితుడు గులామ్‌ నబీ పరారీలో ఉన్నాడు. ఈ సమావేశంలో శంషాబాద్‌ డీసీపీ జగదీశ్వర్‌ రెడ్డి, ఎస్‌వోటీ అడిషనల్‌ డీసీపీ నారాయణ, ఏసీపీ గంగాధర్, సీఐ పవన్, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు