శ్రీకాంత్‌ ఫ్రమ్‌ సీఎం పేషీ.. బీసీ కమిషన్‌ చైర్మన్‌ పోస్టు కావాలా? 

22 Jun, 2021 09:59 IST|Sakshi
బి.కమల్‌ కృష్ణ గౌడ్‌

ఈ పంథాలో మోసం చేస్తున్న వ్యక్తి అరెస్టు 

సాక్షి, హైదరాబాద్‌: ‘నేను ముఖ్యమంత్రి పేషీలో కార్యదర్శిగా పని చేస్తున్న శ్రీకాంత్‌ రావును, బీసీ కమిషన్‌ చైర్మన్‌ పోస్టు కావాలా?’ అంటూ ఎర వేసి, అందినకాడికి దండుకుని పలువురిని మోసం చేసిన ఘరానా మోసగాడిని నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇతడి బారినపడిన వారిలో పార్టీ కార్యకర్తలే ఎక్కువగా ఉన్నారని ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు సోమవారం వెల్లడించారు. కరీంనగర్‌ జిల్లా, ఇందుర్తికి చెందిన బి.కమల్‌ కృష్ణ గౌడ్‌ బీకాం మధ్యలో ఆపేశాడు. ఆపై కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లలో రిపోర్టర్‌గా పని చేశాడు. తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు ముఖ్యమంత్రి పేషీ కార్యదర్శి అవతారం ఎత్తాడు.

వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా పార్టీ కార్యకర్తల ఫోన్‌ నంబర్లు సంగ్రహించిన అతను బీసీ కమిషన్‌తో పాటు వివిధ కమిషన్లకు చైర్మన్, వైస్‌ చైర్మన్‌ పోస్టులు ఇప్పిస్తానంటూ ఫోన్లు చేశాడు. పలువురి నుంచి గరిష్టంగా రూ.2 లక్షల వరకు వసూలు చేసి నకిలీ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు ఇచ్చాడు. ఇతగాడిపై గోపాలపురంతో పాటు జవహర్‌నగర్‌ పీఎస్‌లలో మూడు కేసులు నమోదయ్యాయి. దర్యాప్తు చేపట్టిన నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వర్‌రావు నేతృత్వంలోని బృందం సోమవారం అతడిని అరెస్టు చేసింది.  

పవర్‌ ప్లాంట్‌ పనుల నిలిపివేత 
దుండిగల్‌:  దుండిగల్‌ తండా సమీపంలో చేపట్టిన రాంకీ పవర్‌ ప్లాంట్‌ నిర్మాణ పనులను మున్సిపల్‌ అధికారులు నిలిపి వేశారు. పవర్‌ ప్లాంట్‌కు ఎలాంటి అనుమతులు లేవని పేర్కొంటూ దుండిగల్‌ కమిషనర్‌ భోగీశ్వర్లు నేతృత్వంలో సోమవారం నిర్మాణ ప్రాంతానికి చేరుకున్న టౌన్‌ ప్లానింగ్‌ అధికారి, సిబ్బంది  జేసీబీతో బేస్‌మెంట్, పిల్లర్లను కూల్చివేయించారు.    

మరిన్ని వార్తలు