అర్థరాత్రి దుస్తులు విప్పేసి నడిరోడ్డుపై సెల్ఫీలు

8 Oct, 2020 19:46 IST|Sakshi

దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జిపై ఆగని పోకిరీల ఆగడాలు

సాక్షి, హైదరాబాద్‌ : దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై పోకిరీల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. పోలీసులు ఎంత కట్టడి చేసినా పోకిరీల అరాచకాలు ఆగడం లేదు. బ్రిడ్జీపై ఆగి సెల్ఫీలు దిగితే కేసులు పెడతామని హెచ్చరించినా పట్టించుకోవడం లేదు. పోలీసుసు హెచ్చరికలను భేఖాతరు చేస్తూ సెల్ఫీలు దిగుతున్నారు. దుర్గం చెరువు బ్రిడ్జిపై అర్థరాత్రి దుస్తులు విప్పేసీ సెల్ఫీలు దిగుతున్న ఇద్దరు వ్యక్తులను మాదాపూర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. లైవ్‌లో పోకిరీల ఆగడాలను చూసిన పోలీసులు.. ఇద్దరిని అదుపులోకి తీసుకొని మాదాపూర్‌ పోలీసు స్టేషన్‌కి తరలించారు. 

గతనెల 25న మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభమైంది. లాక్‌డౌన్‌ కాలంలో ఇంటికే పరిమితమైన చాలామందికి దుర్గంచెరువు మంచి పర్యటక కేంద్రంగా మారింది. ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున సదర్శిస్తోంది. సాయంకాల సమయంలో ఆకట్టుకునే లైటింగ్స్‌ వారిని ఎంతో ఆకర్షిస్తోంది. దీంతో ఫోటోలకు యువతతో పాటు పెద్దలూ పోటీపడుతున్నారు. అయితే వంతెన ప్రారంభయయ్యాక వాహనాలు సైతం పెద్ద ఎత్తున వంతెన మీదుగా వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే పర్యటకుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వంతెనపై వాహనాలు వేగంగా వేళ్తున్నా ఏమాత్రం లెక్కచేయకుండా ఫోటోలకు ఎగబడుతున్నారు.

మరీ ముఖ్యంగా వారంతంలో సందర్శకుల తాకిడి విపరీతంగా పెరుగుతోంది. రోడ్డుకు అడ్డంగా నిలబడి రాకపోకలకు ఆటంకం కలిగిస్తుండటంతో సెల్పీస్పాట్‌ ప్రమాదకరంగా మారింది. పోలీసులు హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకోవడంలేదు. ఈ క్రమంలో శని, ఆదివారాల్లో వాహనాలను అనుమతించకూడదని సైబరాబాద్‌ పోలీసులు నిర్ణయించారు. వీకెండ్స్‌లో అధిక సంఖ్యలో సందర్శకులు వస్తున్నందున ట్రాఫిక్ వల్ల ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

మరిన్ని వార్తలు