హైదరాబాద్‌లో హై టెన్షన్‌.. వీఆర్‌ఏల అసెంబ్లీ ముట్టడి యత్నం.. పోలీసుల లాఠీచార్జ్‌!

13 Sep, 2022 12:47 IST|Sakshi

సాక్షి, తెలంగాణ: అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి వీఆర్‌ఏలు ప్రయత్నించారు. వీఆర్‌ఏలు, పలు ప్రజాసంఘాలు అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో అసెంబ్లీ నుంచి ప్రగతిభవన్‌ రోడ్డును పోలీసులు మూసివేశారు. దీంతో, అప్రమత్తమైన పోలీసులు అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు. అక్కడున్న వ్యాపార సముదాయాలను సైతం పోలీసులు మూసివేయించారు. సీఎం కేసీఆర్‌ కాన్వాయ్‌ను అడ్డుకుంటారన్న సమాచారంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

ఇక, ఇందిరా పార్క్‌ నుంచి అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన వీఆర్‌ఏలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, పోలీసులు, వీఆర్‌ఏల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు.. వీఆర్‌ఏలపై లాఠీచార్జ్‌ చేశారు. కాగా, పెద్ద ఎత్తున​ జిల్లాల నుంచి వీఆర్‌ఏలు హైదరాబాద్‌కు తరలివచ్చినట్టు సమాచారం. అయితే, వీఆర్‌ఏల సమస్యలపై జిల్లాలో, గ్రామాల్లో వీఆర్‌ఏలు గత 50 రోజుల నుంచి నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడం వల్లే అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చినట్టు తెలిపారు.

ఇందిరా పార్క్‌, తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌ వద్ద నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. కాగా, పే స్కేల్‌ అమలు చేయాలంటూ వీఆర్‌ఏలు డిమాండ్‌ చేస్తున్నారు. రెడ్డి కార్పొరేషన్‌ కోసం రెడ్డి సంఘం ఆందోళనకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలని మత్య్సకారులు, సింగరేణి కార్మికులు నిరసనలు తెలిపారు. దీంతో ఎక్కడికక్కడ ఆందోళనకారులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్‌ చేశారు. 

మరోవైపు.. తెలంగాణ ప్రభుత్వం వెంటనే బదిలీలు, పదోన్నతుల అమలుకు జీవో జారీ చేయాలని ప్రభుత్వ ఉపాధ్యాయులు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో, అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇక, అసెంబ్లీ ముట్టడికి ఏడు సంఘాలు ప్రయత్నించినట్టు సమాచారం. 

మరిన్ని వార్తలు