పట్టుదలతో మావోలు.. పంతంతో పోలీసులు

24 Jul, 2020 09:17 IST|Sakshi

సాక్షి, బెల్లంపల్లి : వ్యూహ ప్రతి వ్యూహాలతో మావోయిస్టులు, పోలీసులు ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఒకప్పటి పట్టుకోసం మావోలు ప్రయత్నాలు చేస్తుండగా ఆ వ్యూహాన్ని ఆదిలోనే తిప్పికొట్టేందుకు బహుముఖ వ్యూహాలతో పోలీసులు పథక రచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మావోయిస్టుల ఎత్తుగడలను చిత్తు చేసేందుకు పోలీసు యంత్రాంగం అన్నిరకాలా సంసిద్ధమవుతోంది. ఆసిఫాబాద్‌ జిల్లా పరిధి తిర్యాణి అటవీప్రాంతం తొక్కిగూడ వద్ద ఇటీవల జరిగిన పరస్పర ఎదురు కాల్పుల ఘటనతో అటవీప్రాంతం అట్టుడుకుతోంది. మావోయిస్టులు తారసపడినట్లే పడి తృటిలో తప్పించుకోవడాన్ని పోలీసులు జీర్ణించుకోలేక పోతున్నట్లు తెలుస్తోంది. ఐదుగురు సభ్యులతో కూడిన దళం క్షణాల్లో తప్పించుకోవడం సంచలనమైంది. ఈ చర్యతో ఇరువర్గాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

చంద్రవెల్లిలో మావోల కుటుంబీకులను పరామర్శిస్తున్న ఏసీపీ (ఫైల్‌) 

గిరిజన యువతను ఆకట్టుకుని పట్టుసాధించాలనే తలంపులో మావోలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుండగా, ఎలాగైనా అడ్డుకుని మావోలపై పైచేయి సాధించాలనే కృత నిశ్చయంతో పోలీసు యంత్రాంగం వ్యవహరిస్తోంది. ఎదురు కాల్పుల ఘటన తర్వాత మావో లు కొత్తగా ఏర్పాటు చేసిన ఏరియా కమిటీలు ఒక్కసారిగా తెరమీదకు రావడం, పత్రికల్లో ప్రకటనలు రావడం మారిన పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. ఇదే క్రమంలో విప్లవ కవి వరవరరావు, ప్రొఫెసర్‌ సాయిబాబాలను జైలులో నుంచి విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 25న మావోయిస్టుపార్టీ రాష్ట్రబంద్‌కు పిలుపునివ్వడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈక్రమంలో ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో బంద్‌ ప్రభావం ఏమేరకు ఉంటుందనేది చర్చనీయాంశమైంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా