ఏటీఎం కేటుగాళ్లు.. మహా ముదురుగాళ్లు!

30 Mar, 2021 08:27 IST|Sakshi

ఏటీఎంల్లో పెట్టాల్సిన రూ.1.3 కోట్లు కాజేసిన కేసు

నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసులు

సంస్థాగత లోపాలను బయటపెట్టిన కృష్ణ, రాజశేఖర్

ఆ సంస్థకు లేఖ రాయనున్న సీసీఎస్‌ అధికారులు

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌కు చెందిన సెక్యూర్‌ వాల్యూ సంస్థలో కస్టోడియన్‌గా పని చేసిన కృష్ణకు ఏటీఎం కేంద్రాల్లో పెట్టాల్సిన రూ.1.3 కోట్లు కాజేయడానికి ఆ సంస్థలో ఉన్న లోపాలే కలిసి వచ్చాయని వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇతడితో పాటు మాజీ సహోద్యోగి రాజశేఖర్‌ను సైతం సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. న్యాయస్థానం అనుమతితో ఇరువురినీ కస్టడీలోకి తీసుకున్న అధికారులు లోతుగా విచారించారు. ఈ నేపథ్యంలోనే పలు వ్యవస్థాగత లోపాలు వెలుగులోకి వచ్చాయి. వీటిపై ఆ సంస్థకు లేఖ రాయాలని నిర్ణయించారు.  

► సెక్యూర్‌ వాల్యూ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ వివిధ బ్యాంకులకు చెందిన ఏటీఎం కేంద్రాల్లోని యంత్రాల్లో డబ్బు నింపే బాధ్యతల్ని చేపట్టింది. వరంగల్‌కు చెందిన రాపాక రాజశేఖర్‌రెడ్డి గతంలో ఈ సంస్థలో కస్టోడియన్‌గా పని చేశాడు. ఏటీఎం మెషిన్లలో పెట్టాల్సిన రూ.1.23 కోట్లు మరికొందరితో కలిసి కాజేసిన ఆరోపణలపై గతంలో అరెస్టు అయ్యాడు. ఉద్యోగం కూడా కోల్పోయాడు. ఇదే సంస్థలో కస్టోడియన్‌గా పని చేస్తున్న గండెల్లి కృష్ణకు ఓ రూట్‌ అప్పగించారు.

► సెక్యూర్‌ వాల్యూ సంస్థ ప్రతి నెలా కచ్చితంగా ఆడిటింగ్‌ నిర్వహించేది. అయితే ఆ రోజు ఏ ఏటీఎం కేంద్రానికి వెళ్లి ఆడిటింగ్‌ చేయనున్నారో ముందే సిబ్బందికి చెప్పేది. ఇలా విషయం తెలుసుకునే కృష్ణ మరో ఏటీఎం నుంచి డబ్బు తెచ్చి అందులో పెట్టేవాడు. మరోపక్క ఓ ఏటీఎం మిషన్‌ను తెరవడానికి రెండు పాస్‌వర్డ్స్‌ వినియోగించాల్సి ఉంటుంది. భద్రత నిబంధనల ప్రకారం ఒక్కో పాస్‌వర్డ్‌ ఒక్కో ఉద్యోగికి చెప్పి బాధ్యుడిని చేయాలి. అయితే సెక్యూర్‌ సంస్థ మాత్రం రెండింటినీ ఒకే కస్టోడియన్‌కు చెప్పేస్తోంది. 

► ఒక్కో పాస్‌వర్డ్‌ వ్యాలిడిటీ గడువు గరిష్టంగా 24 గంటల మాత్రమే. ఆ మరుసటి రోజు ఏ ఏటీఎంలో డబ్బు నింపాలో దానివే చెప్పాలి. అయితే సెక్యూర్‌ సంస్థ మాత్రం ఆయా రూట్లలో ఉన్న అన్ని ఏటీఎంలవీ కస్టోడియన్లకు వాట్సాప్‌ ద్వారా పంపించేస్తోంది. వీటిని తమకు అనుకూలంగా మార్చుకున్న కృష్ణ సంస్థ నిర్వాహకులకు అనుమానం రాకుండా వ్యవహరించాడు. మూడు నెలల కాలంలో ఏటీఎంల్లో నింపాల్సిన రూ.కోటి కాజేశాడు. ఏ ఒక్క ఏటీఎం నుంచీ మొత్తం డబ్బు కాజేయలేదు. ఒక్కో దాని నుంచి కొంత చొప్పున మాయం చేశాడు. 

► ఫలానా రోజు ఏ ఏటీఎంలో ఆడిటింగ్‌ జరుగుతుందో తెలుస్తుండటంతో.. మరో దాంట్లో నుంచి అవసరమైన మొత్తం తెచ్చి అందులో నింపి తప్పించుకునేవాడు. ఈ వ్యవహారాల్లో తన మాజీ సహోద్యోగి రాజశేఖర్‌ సలహాలు తీసుకుంటూ కొంత మొత్తం చెల్లించాడు. ఓ దశలో తన వ్యవహారం బయటపడుతుందని భావించిన కృష్ణ ఆ విషయం రాజశేఖర్‌కు చెప్పాడు. ఇద్దరూ కలిసి రూ.30 లక్షలు కాజేయాలని, ఆపై కృష్ణ పోలీసులకు లొంగిపోవాలని పథకం వేశారు. అనుకున్నట్లే కాజేసిన కృష్ణను తన వాహనంపై పికప్‌ చేసుకున్న రాజశేఖర్‌ తన ఇంటికి తీసుకువెళ్లాడు. అక్కడ తన వాటా తాను తీసుకుని ఉడాయించాడు. స్వాహా చేసిన డబ్బును కృష్ణ తన చెందిన వాటితో పాటు తన భార్య బ్యాంకు ఖాతాల్లోకి డిపాజిట్‌ చేశాడు. ఆపై ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో దాదాపు 90 శాతం కోల్పోయాడు.

చదవండి: కుషాయిగూడలో భారీ అగ్ని ప్రమాదం

మరిన్ని వార్తలు