పోలీసు జాగిలం ప్రత్యేకతలేంటో తెలుసా​?

17 Feb, 2021 08:52 IST|Sakshi

నేర దర్యాప్తులో వాటి సేవలు భేష్‌

పోలీసు జాగిలాల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో డీజీపీ 

హత్యలు, దోపిడీలు, పేలుడు పదార్థాలను గుర్తించడంలో మేటి

50 జాగిలాలు, 80 మంది హ్యాండ్లర్లకు శిక్షణ పూర్తి

సాక్షి, హైదరాబాద్‌: నేర దర్యాప్తు, విపత్తుల సమయంలో పోలీసు జాగిలాల సేవలు ఎంతో కీలకమని డీజీపీ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్‌ ఇంటెలిజెన్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో మంగళవారం జరిగిన 50 పోలీసు జాగిలాలు, 80 మంది జాగిలాల శిక్షకుల పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా మహేందర్‌రెడ్డి హాజరయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణ, సంక్లిష్టమైన కేసుల పరిశోధన, ఛేదనలో అత్యంత కీలక పాత్ర వహించేలా ప్రత్యేక శిక్షణ పొందిన పోలీసు జాగిలాలు విధుల్లో మరింత ప్రతిభ కనబరుస్తాయని ధీమా వ్యక్తం చేశారు. పోలీసు జాగిలాల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీసు జాగిలాలు, శిక్షకులతో కలసి ప్రదర్శించిన విన్యాసాలు, సాహస కృత్యాలు ఆకట్టుకున్నాయి. 

8 నెలల పాటు కఠోర శిక్షణ.. 
మొయినాబాద్‌ శిక్షణ కేంద్రంలో 50 జాగిలాలకు 8 నెలల పాటు 80 మంది హాండ్లర్స్‌ (శిక్షకులు) ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. 50 జాగిలాలలో ప్రధానంగా లాబ్రడార్, జర్మన్‌ షెపర్డ్, బెల్జియం మాలినాయిస్, కొకర్‌ స్పానియల్, గోల్డెన్‌ రిట్రీవర్‌ జాతులకు చెందినవి ఉన్నాయి. హోం శాఖకు చెందిన పీఎం డివిజన్‌ పోలీస్‌ కె–9 డివిజన్‌ కన్సల్టింగ్‌ డైరెక్టర్‌ పీకే ఛుగ్‌ ఈ బ్యాచ్‌ తుది పరీక్షకు ఎగ్జామినర్‌గా హాజరయ్యారు.

12 జాతుల వినియోగం..  
ప్రపంచవ్యాప్తంగా 435 రకాల జాతులు ఉన్నాయి. ప్రధానంగా 12 జాతులకు చెందిన జాగిలాలను పోలీసు శాఖ తమ నేర పరిశోధనల అవసరాలకు వినియోగించుకుంటోంది. మన రాష్ట్రంలో లాబ్రడార్, డాబర్‌మన్, ఆల్సీషియన్, గోల్డెన్‌ రిట్రీవర్, డాల్మేషన్, జర్మన్‌ షెపర్డ్‌ జాతుల జాగిలాల సేవలను మాత్రమే వినియోగించుకుంటున్నారు. ఎయిర్‌పోర్టులో తనిఖీల కోసం చిన్నగా ఉండే కొకర్‌ స్పానియల్‌ జాతి కుక్కలను పోలీసులు వినియోగిస్తున్నారు. కాగా, అకాడమీలో బిహార్‌కు చెందిన 20 జాగిలాలకు అక్రమ మద్యం గుర్తించేందుకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ కేంద్రంలో ఇప్పటివరకు 669 జాగిలాలు, 965 హ్యాండ్లర్లు శిక్షణ పొందారు. కార్యక్రమంలో ఏడీజీ (లా అండ్‌ ఆర్డర్‌) జితేందర్, ఇంటెలిజెన్స్‌ ఐజీ ప్రభాకర్‌రావు, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ పాల్గొన్నారు.

జాగిలాల ప్రత్యేకతలివే.. 
శునకాలకు ఘ్రాణ శక్తి 40 రెట్లు, వినికిడి శక్తి 20 రెట్లు, కంటి చూపు 10 రెట్లు అధికం. పోలీసు శాఖకు నేర పరిశోధనలో ఇవి కీలకంగా మారుతున్నాయి. హత్యలు, దోపిడీలు, దొంగతనాలు జరిగిన సమయంలో నిందితులను పట్టించడం, సంఘ విద్రోహులు అమర్చే పేలుడు పదార్థాలను గుర్తించి భారీ ప్రాణ, ఆస్తి నష్టం నివారించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి.

చదవండి:  డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు వ్యాఖ్య 
చదవండి:  అయ్యా నీకో దండం.. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు