PM Modi Hyderabad Visit Updates: మోదీ హైదరాబాద్‌ పర్యటన.. పోలీసుల అదుపులో మాజిద్‌ అట్టర్‌

30 Jun, 2022 09:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు హైదరాబాద్‌కు రానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఇందులో భాగంగా పాతబస్తీలో మాజిద్‌ అట్టర్‌ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

అయితే, నుపుర్‌ శర్మ ఘటనపై అట్టర్‌.. ఫేసుబుక్‌లో పోస్ట్‌ పెట్టడం కలకలం సృష్టించింది. నుపుర్‌ శర్మ వ్యాఖ్యలకు ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ క్షమాపణలు చెప్పాలని మాజిద్‌ డిమాండ్‌ చేశాడు. లేకపోతే నిరసనలకు ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని సోషల్‌ మీడియా పోస్టులో రాసుకొచ్చాడు. దీంతో, రంగంలోకి దిగిన మొఘల్‌పురా పోలీసులు మాజిద్‌ అట్లర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో పోస్టులపై పోలీసులు నిఘా పెట్టినట్టు పేర్కొన్నారు.

ఇక, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఆంక్షలు విధించారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నట్టు తెలిపారు. నోవాటెల్‌, పరేడ్‌ గ్రౌండ్‌, రాజ్‌భవన్‌ పరిసరాల్లో నో ఫ్లైయింగ్‌ జోన్‌గా పోలీసులు ప్రకటించారు. రిమోట్‌ కంట్రోల్‌ డ్రోన్స్‌, మైక్రో లైట్‌ ఎయిర్‌క్రాఫ్ట్స్‌పై నిషేధం విధించారు. 

ఇదిలా ఉండగా.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ప్రధాని మోదీ హాజరవుతున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోదీ జూలై 2న సాయంత్రం ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో నేరుగా సమావేశం జరిగే హెచ్‌ఐసీసీ ప్రాంగణానికి వస్తారు. సమావేశం తర్వాత పక్కనే ఉన్న నోవాటెల్‌ హోటల్‌లో బసచేస్తారు. బీజేపీ కార్యవర్గ సమావేశాల కోసం 1వ తేదీ నుంచి 3వ తేదీ దాకా ఈ హోటల్‌ మొత్తాన్ని బుక్‌ చేశారని హోటల్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు.  

ఇది కూడా చదవండి: నోవాటెల్‌లోనే మోదీ బస!

మరిన్ని వార్తలు