నిఘా నేత్రాలకు ‘ప్రజా భద్రత’ 

18 Aug, 2022 01:07 IST|Sakshi

సీసీటీవీ కెమెరాల నిర్వహణకు ప్రత్యేక విభాగం 

తెలంగాణ పబ్లిక్‌ సేఫ్టీ సొసైటీ ఏర్పాటుకు నిర్ణయం 

సీఎస్సార్‌ కింద నిధుల సమీకరణ 

విరాళాలు ఇచ్చే వారికి ఆదాయ పన్నులో మినహాయింపు  

టీపీఎస్‌ఎస్‌కు మార్గదర్శకాలు రూపొందించే పనిలో పోలీసులు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సీసీటీవీ కెమెరాల నిర్వహణకు ప్రత్యేకంగా ఓ విభాగం ఏర్పాటు కానుంది. ప్రజలకు రక్షణ కవచంలా నిలుస్తూ.. నేరాల దర్యాప్తులో కీలకంగా మారిన సీసీటీవీ కెమెరాల నిర్వహణ బాధ్యతల కోసం పటిష్టమైన విభాగం ఉండాలని పోలీసు ఉన్నతాధికారులు భావి­స్తు­న్నా­రు. ఇందులో భాగంగా తెలంగాణ పబ్లిక్‌ సేఫ్టీ సొసైటీ (టీపీఎస్‌ఎస్‌)ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సొసైటీ నిబంధనలు, మార్గదర్శకాలు రూపొందించిన అనంతరం సొసైటీల చట్టం కింద దీనిని రిజిస్ట్రేషన్‌ చేయనున్నారు. 

టీపీఎస్‌ఎస్‌ ఎందుకంటే? 
ప్రస్తుతం కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్సార్‌) కిందే సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. కానీ, వాటి నిర్వహణ బాధ్యతలు ఎవరు చూడాలనే ప్రశ్న తలె­త్తు­తోంది. కొన్ని సందర్భాలలో కేసు దర్యాప్తులో భాగం­­గా సీసీకెమెరాల ఫుటేజీలను సేకరించేందుకు ప్రయ­త్నిస్తే అవి పాడైపోయి లేదా కెమెరాలు పనిచేయకపోవటం వంటి స్థితిలో కనిపిస్తున్నా­యి. ఎండా, వానల కారణంగా కెమె­­రాలు దెబ్బ­తి­నడంతోపాటు నిర్వహణ సరిగాలేక కొన్ని ప్రాంతాలలో కెమెరాలు అ­లంకారప్రా­యంగా మారాయి. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే సీసీ కెమె­రాల రక్షణకు టీపీసీసీ లాంటి విభాగం అవసరమని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. 

ఎలా పనిచేస్తుందంటే? 
రాష్ట్రం, కమిషనరేట్, జిల్లా, డివిజన్, పోలీసు స్టేష­న్ల వారీగా టీపీఎస్‌ఎస్‌ పనిచేస్తుంది. సీఎస్సా­­ర్‌ కింద రాష్ట్రవ్యాప్తంగా సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, నిర్వహణ కోసం నిధులను సమీకరించి, వినియోగిస్తారు. ప్రతి యూనిట్‌ సొసైటీకి ప్రత్యేకంగా బ్యాంక్‌ ఖాతా ఉంటుంది. వీటి ద్వారానే ఆయా నిధుల వి­ని­యోగం జరుగుతుంది. సీసీటీవీ కెమెరాల నిర్వహణ, రిపేరు కోసం స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ (ఎస్‌హెచ్‌ఓ) యూనిట్‌ ఆఫీసర్‌కు అభ్యర్థన లేఖ పంపిస్తాడు. వెంట­నే ఖాతా నుంచి నిధులు విడుదల అవుతా­యి. సొసైటీ ఏర్పాటుతో నిధుల సమీకరణ, వినియోగంలో పారదర్శకతతో పాటు జవాబుదారీతనం ఏర్పడుతుంది.

ఐటీ మినహాయింపు కూడా.. 
సీఎస్సార్‌లో భాగంగా సంస్థలతో పాటు వ్యక్తులు కూడా స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వొచ్చు. టీపీఎస్‌ఎస్‌కు విరాళాలు ఇచ్చే సంస్థలకు, వ్యక్తులకు ఆదాయపన్ను (ఐటీ)లో మినహాయింపు ఉంటుంది. ఈ మేరకు పోలీసు ఉన్నతాధి­కారులు ఐటీ శాఖకు లేఖ రాసినట్లు తెలిసింది. గతేడాది వార్షిక నివేదిక గణాంకాల ప్రకారం.. హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో 4,40,299 కెమెరాలు, సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 1,59,117, రాచకొండలో 1.50 లక్షలకు పైగానే కెమెరాలున్నాయి. 

మరిన్ని వార్తలు