మావోయిస్టుల కదలికలు: అడవిలో అలర్ట్‌ !

15 Sep, 2020 12:19 IST|Sakshi

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఐదు రాష్ట్రాల సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలు వేగవంతమయ్యాయనే సమాచారంతో ఆయా రాష్ట్రాల పోలీసు బలగాలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. తెలంగాణలోని ఏజెన్సీ జిల్లాల అటవీ ప్రాంతాల్లోనూ పక్కా ప్రణాళికలతో సెర్చ్‌ ఆపరేషన్లు చేపడుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల సమాంతర ప్రభుత్వం ఉండడంతో అక్కడ నిరంతరం పోరు నడుస్తుండగా, తెలంగాణలో గత ఎనిమిది నెలలుగా ఆ పార్టీ కార్యకలాపాలు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తాజాగా ఏఓబీ (ఆంధ్రా–ఒడిశా సరిహద్దు)లో మావోయిస్టుల అలజడి మరింత పెరగడంతో సరిహద్దు రాష్ట్రాల బలగాలు అలర్ట్‌ అయ్యాయి.

ఏఓబీ పరిధిలోని కొంథమాల్‌–కలహండి జిల్లాలోని భండరంగి సిర్కి అటవీ ప్రాంతంలో ఈనెల 10న జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందగా, ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. దీంతో ఉన్నతాధికారులు ఏఓబీ పరిధిలోని ఒడిశా రాష్ట్రం చిత్రకొండ ఠాణా పరిధిలోని అల్లూరికోట, పప్పులూరు, కప్పతొట్టి, కుర్మనూరు, ఆంధ్రప్రదేశ్‌లోని గుమ్మిరేవుల, పాతకోట, సీలేరు, గూడెంకొత్తవీధి ఏజెన్సీ అటవీ ప్రాంతాల్లో ఈ నెల 11న హెలీకాప్టర్‌ ద్వారా ఏరియల్‌ సర్వే నిర్వహించారు. మరోవైపు విశాఖ జిల్లా గూడెంకొత్తవీధి మండలంలోని మారుమూల ఏజెన్సీలో మావోయిస్టుల డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కాగా.. తెలంగాణలోని సరిహద్దు ఏజెన్సీ జిల్లాల్లో డీజీపీ మహేందర్‌రెడ్డి గత రెండు నెలల్లో పలుమార్లు ఏరియల్‌ సర్వే చేపట్టారు. భద్రాద్రి, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో వరుసగా రెండు మూడు విడతలు  పర్యటించారు. ఆసిఫాబాద్‌లో ఐదు రోజుల పాటు మకాం వేశారు. ఈ క్రమంలో ఈనెల 3న గుండాల మండలం దేవళ్లగూడెం వద్ద ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ఇక్కడ ఒక మావోయిస్టు మృతిచెందాడు. ఈ ఘటనకు  వ్యతిరేకంగా ఈనెల 6న మావోయిస్టులు తలపెట్టిన బంద్‌ సక్సెస్‌ కాలేదు.

ఆ తర్వాత ఈనెల 7న చర్ల మండలం పూసుగుప్ప వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఇదిలా ఉండగా దుమ్ముగూడెం మండలం పెద్దనల్లబెల్లి గ్రామానికి సమీపంలోని ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సుక్మా జిల్లా కిష్టారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గల పాలోడి అటవీ ప్రాంతంలో భారీ సంఖ్యలో మావోయిస్టులు వాగు దాటుతుండగా పోలీసుల డ్రోన్‌ కెమెరాలు వీడియోలు, ఫొటోలు తీశాయి. ఒకేసారి ఇంతమంది మావోయిస్టులు రాష్ట్రం వైపు కదులుతున్నారనే అంశం సంచలనంగా మారింది. 

ఏఓబీ నుంచి గడ్చిరోలి సరిహద్దు దాకా.. 
ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలోని అబూజ్‌మడ్‌ కేంద్రంగా బీజాపూర్, దంతెవాడ, సుక్మా, నారాయణపూర్, కాంకేర్, బస్తర్‌ జిల్లాల్లో సమాంతర ప్రభుత్వం నడుపుతున్న మావోయిస్టు పార్టీ.. ఇతర రాష్ట్రాలకూ విస్తరించాలని ప్రయత్నాలు చేస్తోంది. పార్టీ కేంద్ర కమిటీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే అగ్రనేతలుగా ఉన్నారు. దీంతో ఈ రాష్ట్రాలపై ఎక్కువగా దృష్టి పెట్టారు. 

మరిన్ని వార్తలు