దండకారణ్యంలో యుద్ధ మేఘాలు.. పోలీసు బలగాల కూంబింగ్‌..

2 Aug, 2021 21:14 IST|Sakshi

సాక్షి,చర్ల(ఖమ్మం): దండకారణ్యంలో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. జూలై 28 నుంచి ఆగష్టు 3 వరకు మావోయిస్టులు పార్టీ అమరులకు నివాళులర్పించేందుకు వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో పోలీసులు సరిహద్దు ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసుశాఖ భారీగా బలగాలను తరలించింది. ఈ క్రమంలో కొనసాగుతున్న కూంబింగ్‌ ఆపరేషన్‌లో ఆదివారం ఉదయం చర్ల మండల శివారు అటవీ ప్రాంత గ్రామమమైన బోదనెల్లి–కొండెవాడ గ్రామాల మధ్యలోని కామరాజుగుట్ట సమీపంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు.

సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌ అటవీ ప్రాంతంలోని బీజాపూర్, సుకుమా జిల్లాలతో పాటు దంతెవాడ జిల్లాలోని అటవీ ప్రాంతాలలోకి భారీగా చేరుకున్న సీఆర్‌పీఎఫ్, స్పెషల్‌ పార్టీ, గ్రేహౌండ్స్, కోబ్రా బలగాలు దండకారణ్య ప్రాంతంలో అణువణువునా గాలిస్తున్నారు. పెద్ద ఎత్తున దండకారణ్య ప్రాంతాలలోని గ్రామాలలో కూంబింగ్‌ ఆపరేషన్‌ కొనసాగుతుండడంతో ఏ క్షణంలో ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనని సరిహద్దు ప్రాంతంలోని ఆదివాసీ ప్రజానీకం బిక్కుబిక్కుమంటున్నారు.

సరిహద్దుల్లోని కొండెవాయి, బక్కచింతలపాడు, బోదనెల్లి, ఎర్రబోరు, కుర్నపల్లి, పులిగుండాల, నిమ్మలగూడెం, బత్తినపల్లి, ఎర్రంపాడు, చెన్నాపురం, రామచంద్రాపురం, కిష్ట్రారంపాడు, పూసుగుప్ప, దర్మపేట, ఎలకనగూడెం, డోకుపాడు, కర్రిగుండం, తెట్టెమడుగు, పాలచెలిమ, బీమారంపాడు, దర్మారం, యాంపురం, జెరుపల్లి తదితర గ్రామాలకు చెందిన కొంతమంది ఆదివాసీలు భయంతో ఇప్పటికే ఇళ్లను వదిలి వెళ్లారు. ఉన్న కొద్దిమంది కూడా తాజాగా బోదనెల్లి సమీపంలో జరిగిన ఎదురుకాల్పుల ఘటనతో భయంతో ఇతర ప్రాంతాలకు వెళ్తేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. గత నెల 28న ప్రారంభమైన వారోత్సవాలు రేపటితో (ఆగష్టు 3) ముగియనున్న నేపధ్యంలో ఆగష్టు 3వ తేదీ ఎప్పుడు వెళ్లి పోతుందా అని ఆదివాసీలు ఎదురుచూస్తున్నారు.  

మరిన్ని వార్తలు