లింగ నిర్ధారణ కేసులో కూపీ లాగుతున్న పోలీసులు 

17 Jul, 2021 10:06 IST|Sakshi

ఆస్పత్రి యజమానిపై ఇప్పటికే కేసు నమోదు

వైద్యులు, సిబ్బంది పాత్రపై ఆరా

సాక్షి, కామారెడ్డి: పిండ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ చిక్కిన కౌసల్య ఆస్పత్రి నిర్వాహకులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు ఇందులో ఎవరి పాత్ర ఎంత అన్నదానిపై ఆరా తీస్తున్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్‌ కాలనీలో కౌసల్య మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంతో పాటు అబార్షన్లు చేస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఆధారాలతో సహా ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గత గురువారం ‘డెకాయ్‌ ఆపరేషన్‌’ నిర్వహించారు.

ఈ సందర్భంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేసి ఆడ, మగ అన్నది వెల్లడించగా నిర్వాహకుడిని పట్టుకున్నారు. ఆస్పత్రిలో స్కానింగ్‌ సెంటర్‌కు ఎలాంటి అనుమతులు లేకపోవడం, అర్హతలు లేని వ్యక్తి స్కానింగ్‌ చేయడం, లింగ నిర్ధారణ పరీక్షలు జరపడం వంటి వాటిని గుర్తించిన అధికారులు ఆస్పత్రి యజమానిపై పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ, పోలీసు అధికారుల సమక్షంలో ఆస్పత్రిని సీజ్‌ చేసిన విష యం తెలిసిందే. పట్టణ పోలీసులు ఆస్పత్రి నిర్వాహకుడు సిద్ధిరాములుపై 312, 420, పీసీ అండ్‌ పీఎన్‌డీటీ యాక్ట్‌(గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్ష) తదితర సెక్షన్ల కింద కేసునమోదు చేశారు.

అధికారుల సీరియస్‌
ఆస్పత్రిలో విధులు నిర్వహించే వైద్యులు, సిబ్బంది లింగ నిర్ధారణ పరీక్షల్లో ఏ మేరకు భాగమయ్యారన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. చట్ట వ్యతిరేకంగా పరీక్షలు చేయడే కాకుండా అబార్షన్లు కూడా నిర్వహించడాన్ని వైద్య ఆరోగ్యశాఖ సీరియస్‌గా పరిగణిస్తోంది. దీనిపై ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వైద్యులు, సిబ్బంది పాత్రపై కూపీ లాగుతున్నారు. ఎంత మందికి లింగ నిర్ధారణ పరీక్షలు జరిపారు ? ఎన్ని అబార్షన్లు చేశారన్నదానిపై లోతైన దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది. కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాలతో పాటు మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల నుంచి చాలా మంది పరీక్షల కోసం ఇక్కడికి వచ్చి వెళ్లినట్టు అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా పిండ లింగ నిర్ధారణ పరీక్షలు చేయడంతో పాటు అబార్షన్లు కూడా నిర్వహించినా ఇంతకాలం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం విస్మయం కలిగిస్తోంది.

తప్పించుకునే యత్నం
ఆస్పత్రి యాజమాన్యం కేసులో నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. కేసులో అరెస్టు కా కుండా ఉండి, కేసు తీవ్రతను తగ్గింపజేసుకోవడం ద్వారా కేసులో నుంచి బయటపడాలని ప్రయతి్నస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆస్పత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేయడానికి వైద్యు లు, సిబ్బంది సహకారం కచ్చితంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వారి పాత్రను గుర్తించే పనిలో పోలీసులు ఉండగా, వారిని తప్పించేందుకు యాజమాన్యం ప్రయతి్నస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ఆస్పత్రి యజమానిపై కేసులు నమోదు చేసి విచారణ జరుపుతు న్నామని సీఐ మధుసూదన్‌ ‘సాక్షి’తో పేర్కొన్నారు. ఎవరి పాత్ర ఎంతన్నదానిపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. 

మరిన్ని వార్తలు