త్వరలోనే పోలీసు ఉద్యోగ ఉచిత శిక్షణ

18 Mar, 2022 02:17 IST|Sakshi

రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో ఏర్పాటుకు సన్నాహాలు

మహిళా గస్తీ సేవలు కూడా.. శాంతి భద్రతల్లో ఏఆర్‌ పోలీస్‌ సేవలు కీలకం

అంబర్‌పేట సీఏఆర్‌లో డాగ్స్‌ కెన్నెల్, మెటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీస్‌ ప్రారంభం

రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో త్వరలో పోలీసు రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిరుద్యోగ యువతకు రాచ కొండ పోలీస్‌ కమిషనరేట్‌ తరుఫున ప్రీ రిక్రూట్‌మెంట్‌ ఉచిత శిక్షణను ప్రారంభించ నున్నట్లు రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పోలీసు ఉద్యోగం సాధించాలన్నారు.

గురువారం ఆయన అంబర్‌పేటలోని సీఏఆర్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో డాగ్స్‌ కెన్నెల్, మెటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులకు సహకరిస్తూ సమాజంలో శాంతి భద్రతలను కాపాడటంలో సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ (ఏఆర్‌) పోలీసుల పాత్ర కీలకమైనదని, వారి సంక్షేమమే తొలి ప్రాధాన్యమన్నారు.

పీఎస్‌ఓ డ్యూటీలు, బందోబస్త్, వీఐపీ సెక్యూరిటీ తదితర అంతర్గత భద్రతలో వీరి పాత్ర కీలకమని పేర్కొన్నారు. విధుల పట్ల నిబద్ధతతతో ఉంటూ శారీరక, మానసిక ధృడత్వాన్ని పెంచుకోవాలని సూచించారు. ఏఆర్‌ విభాగంలో ఎక్కువ సంఖ్యలో మహిళలు చేరడం అభినందనీయమన్నారు. వివిధ విభాగాల్లో మహిళా సిబ్బంది తమ సామర్థ్యాలను ప్రదర్శించేందుకు తగిన సహకారాన్ని అందిస్తామని, త్వరలోనే మహిళా పెట్రోలింగ్‌ బృందాలను ప్రవేశపెట్టనున్నామని ఈ సందర్భంగా సీపీ వెల్లడించారు.

అనంతరం 15 రోజులుగా కొనసాగతున్న వార్షిక డీ–మొబిలైజేషన్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ సీపీ సుధీర్‌ బాబు, డీసీపీ క్రైమ్స్‌ యాదగిరి, డీసీపీలు సన్‌ప్రీత్‌ సింగ్, రక్షిత కే మూర్తి, సలీమా, అడిషనల్‌ డీసీపీలు ఎం శ్రీనివాస్, షమీర్‌ తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు