న్యాయవాద దంపతుల హత్య: బిట్టు శ్రీను ఏం చెప్పాడు? 

22 Feb, 2021 01:36 IST|Sakshi
హత్యా స్థలంలో క్లూస్‌ టీం ఆధారాలు సేకరిస్తుండటంతో రోడ్డుపై నిలిచిన ట్రాఫిక్‌ 

న్యాయవాద దంపతుల హత్య కేసులో పురోగతి 

విచారణలో కీలక విషయాలు రాబట్టిన పోలీసులు? 

నేడు బిట్టు శ్రీనును కోర్టులో హాజరుపరిచే అవకాశం

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు–నాగమణి హత్యల కేసులో కొంత పురోగతి వచ్చినట్టు తెలిసింది. దేశవ్యాప్తంగా బార్‌ కౌన్సిళ్లన్నీ ఈ జంటహత్యలపై ఆందోళన వ్యక్తం చేయడం, హైకోర్టు సీరియస్‌ కావడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాలతో ఐజీ నాగిరెడ్డి, డీఐజీ ప్రమోద్‌కుమార్‌ స్వయంగా ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. రామగుండం కమిషనర్‌ వి.సత్యనారాయణ, డీసీపీ (అడ్మిన్‌) అశోక్‌కుమార్‌ దర్యాప్తును వేగవంతం చేశారు. పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీను ఈ కేసులో కీలకంగా మారాడు. ఈనెల 19న అతడిని అదుపులోకి తీసుకున్న రామగుండం కమిషనరేట్‌ అధికారులు.. నిజాలు రాబట్టే పనిలో పడ్డారు. ప్రధాన నిందితుడు కుంట శ్రీనివాస్‌కు కారు, కత్తులు, డ్రైవర్‌ను ఎందుకు ఇచ్చాడనే విషయంలో స్పష్టత వచ్చినట్లు సమాచారం.  

బిట్టు శ్రీనుకు వామన్‌రావుపై కక్ష ఎందుకు? 
గుంజపడుగు గ్రామ గొడవల కారణంగా వామన్‌రావుపై కుంట శ్రీనివాస్‌ కక్ష పెంచుకున్నారనే విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. కానీ మధు మేనల్లుడు బిట్టు శ్రీనుకు వామనరావుపై పగ ఎందుకు అనే కోణంలో పోలీసులు విచారణ జరిపినట్టు తెలిసింది. బిట్టు శ్రీనుకు గతంలో చెప్పుకోదగ్గ నేరచరిత్ర లేదు. వామన్‌రావుతో నేరుగా గొడవలు జరిగిన దాఖలాల్లేవు. వామనరావు జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధుపైనే దావాలు వేశారు. బిట్టు శ్రీనును ఆయన ఎక్కడా టార్గెట్‌ చేయలేదు. ఈ నేపథ్యంలో వామన్‌రావును చంపాలనుకున్న కుంట శ్రీనివాస్‌కు బిట్టు శ్రీను ఎందుకు సహకరిం చాడనే అంశంపైనే పోలీసుల విచారణ సాగినట్లు సమాచారం. హత్యలు పథకం ప్రకారం జరిగాయా లేక అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయమా అనే వాటిపైనా సమాధానాలు రాబట్టినట్లు తెలుస్తోంది. వామన్‌రావు హత్యకు సహకరించాలని శ్రీనును ఎవరు ప్రోత్సహించారు? ఏం జరిగినా చూసుకుంటామనే అభయం ఇచ్చి పంపారా? అనే కోణాల్లో ప్రశ్నించినట్టు తెలిసింది.

నిందితులను కస్టడీకి తీసుకునే యోచన 
బిట్టు శ్రీనును అరెస్టు చేసి తమ అదుపులో ఉంచుకొని విచారణ జరిపిన పోలీసులకు కొంత సమాచారం లభించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పుట్ట మధు మేనల్లుడిగా ఆయనకు సంబంధం లేకుండా హత్యలో ఎందుకు పాలుపంచుకోవలసి వచ్చిందనే విషయంలో బిట్టు శ్రీను తన వాదన వినిపించినట్లు తెలుస్తోంది. సోమవారం అతడిని కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. అలాగే బిట్టు శ్రీను విచారణలో చెప్పిన విషయాలను సరి చూసుకునేందుకు ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న నిందితులు కుంట శ్రీనివాస్, చిరంజీవి, కుమార్‌ను పోలీస్‌ కస్టడీకి తీసుకోవాలని రామగుండం పోలీసులు భావిస్తున్నారు. కస్టడీలో ఆ ముగ్గురూ ఇచ్చే సమాచారంతో పోలీసులు కేసుపై ఓ నిర్ణయానికి రానున్నారు. కాగా, కోర్టు దగ్గర వామన్‌రావు కదలికల గురించి కుంట శ్రీనుకు ఫోన్‌లో తెలియజేసిన లచ్చయ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు హత్య జరిగిన స్థలంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఆధ్వర్యంలో క్లూస్‌ టీం ఆదివారం సాయంత్రం ఆధారాలు సేకరించింది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు