ఉద్రిక్తతల నడుమ ‘చలో రాజ్‌భవన్‌’ 

8 Dec, 2022 02:33 IST|Sakshi
సీపీఐ నాయకులను అరెస్టు చేస్తున్న పోలీసులు 

సీపీఐ నేతలను అడ్డుకున్న పోలీసులు 

పంజగుట్ట: గవర్నర్‌ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం సీపీఐ చేపట్టిన ‘చలో రాజ్‌భవన్‌’తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. వందలాదిగా సీపీఐ కార్యకర్తలు ఖైరతాబాద్‌ కూడలి వద్దకు చేరుకోగా అప్పటికే అక్కడ భారీ గా మోహరించిన పోలీసులు బ్యారికేడ్లు వేసి వారిని అక్కడే అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.

కొంతమంది కార్యకర్తలు మక్తా రైల్వేగేటు మీదుగా రాజ్‌భవన్‌ ముట్టడికి యత్నించగా వారిని కూడా అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఖైరతాబాద్‌ కూడలివద్ద ఆందోళనకారులు సేవ్‌ డెమోక్రసీ, సేవ్‌ ఫెడరల్‌ సిస్టం, గవర్నర్‌ వ్యవస్థను రద్దుచేయాలి అని నినాదాలు చేస్తూ బైఠాయించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఇతర నేతలు అజీజ్‌ పాషా, చాడా వెంకట్‌రెడ్డి, పశ్య పద్మ, ఎన్‌.బాలమల్లేశ్‌తో పాటు పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని నగరంలోని వివిధ పోలీస్‌స్టేషన్‌లకు తరలించారు.

ఈ సందర్భంగా కూనంనేని  మాట్లాడుతూ ...గవర్నర్‌  పదవిని అడ్డంపెట్టుకుని కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే దానికి వ్యతిరేక పార్టీలను నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహంవ్యక్తం చేశారు. ఎన్‌టీఆర్‌లేని సమయంలో అప్పటి గవర్నర్‌ రాంలాల్‌ ప్రభుత్వాన్ని రద్దు చేశారని గుర్తుచేశారు. ఇటీవల మహారాష్ట్రలో, గోవాలో అలానే జరిగిందన్నారు. ఈ నెల 29న అన్ని రాష్ట్రా ల్లో గవర్నర్‌ వ్యవస్థను రద్దు చేయాలన్న డిమాండ్‌తో రాజ్‌భవన్‌ల ముట్టడి కార్యక్రమం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు