రాష్ట్ర సరిహద్దుల్లో పోలీస్‌ బాస్‌

5 Oct, 2020 01:56 IST|Sakshi
వెంకటాపురంలో పర్యటిస్తున్న డీజీపీ మహేందర్‌రెడ్డి, పక్కన సీఆర్‌పీఎఫ్‌ డీజీపీ ఏపీ మహేశ్వరీ

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ పోలీసు ఉన్నతాధికారుల భేటీ

మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా జరిగిన సమీక్ష

సమన్వయంగా పనిచేయాలని నిర్ణయం 

ములుగు/వెంకటాపురం(కె)/చర్ల/సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ–ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దుల్లోని ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండల కేంద్రంలో ఆదివారం తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ పోలీసు ఉన్నతాధికారులు, కేంద్ర సాయుధ బలగాల అధికారులు భేటీ అయ్యారు. కేంద్ర హోంశాఖ సీనియర్‌ సెక్యూరిటీ అడ్వైజర్‌ విజయ్‌కుమార్, తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఎస్పీలు డాక్టర్‌ సంగ్రాంసింగ్‌ పాటిల్, సునీల్‌దత్, సీఆర్‌పీఎఫ్‌ డీజీపీ ఏపీ మహేశ్వరి, ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఎస్‌డీజీ (నక్సల్‌) అశోక్‌ జునేజా, డీఐజీ బస్తర్‌ సుందర్‌రాజ్, సీఆర్‌పీఎఫ్‌ డీఐజీ సాజారొద్దీన్, ఛత్తీస్‌గఢ్‌ సీఆర్‌పీఎఫ్‌ ఆపరేషన్స్‌ డీఐజీ ప్రకాశ్‌ పాల్గొన్నారు. ఉదయం 10.39 గంటలకు ఛత్తీస్‌గఢ్, మధ్యాహ్నం 2.36 గంటలకు తెలంగాణ తరఫున ప్రత్యేక హెలికాప్టర్లు వెంకటాపురం(కె) మండల కేంద్రానికి చేరుకున్నాయి. ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఇటీవల కొంతమంది మావోయిస్టులు తెలంగాణలోకి చొరబడ్డారని వచ్చిన వార్తల నేపథ్యంలో సరిహద్దుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. ఇరు రాష్ట్రాల నిఘా విభాగం సమన్వయంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఈ భేటీ జరిగినట్లు తెలిసింది. ఇరు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు హాజరైన సమీక్షకు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. సర్కిల్‌ పోలీస్‌ స్టేషన్‌కు చుట్టూ కిలోమీటరు దూరం వరకు సివిల్, సీఆర్‌పీఎఫ్‌ బలగాలు మోహరించాయి. పోలీస్‌బాస్‌లు వెళ్లే వరకు స్థానికులెవరినీ ఈ ప్రాంతానికి అనుమతివ్వలేదు. ఇరు రాష్ట్రాల బలగాలతోపాటు కేంద్ర బలగాల సహాయ సహకారాలతో మావోయిస్టులను కట్టడి చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఆ జిల్లాలపై ప్రత్యేక దృష్టి: సెప్టెంబరులో జరిగిన నాలుగు ఎన్‌కౌంటర్లలో ఎనిమిది మంది మావోయిస్టులు మరణించడం తెలంగాణలో తిరిగి మొదలైన మావోయిస్టుల కార్యకలాపాలను చాటిచెప్పాయి. రాష్ట్రంలోకి వారు ప్రవేశించేందుకు, పారిపోయేందుకు ముఖ ద్వారాలుగా ఉన్న ఆసిఫాబాద్, ములుగు, కొత్తగూడెం జిల్లాలపై పోలీసులు – సీఆర్‌పీఎఫ్‌ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి తాజాగా భేటీ అయ్యారు. క్షేత్రస్థాయి సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతోపాటు సాంకేతికను పూర్తిస్థాయిలో వినియోగించుకుని మావోల ఆనుపానులు పసిగట్టాలన్న అభిప్రాయాన్ని పలువురు అధికారులు వ్యక్తపరిచారని తెలిసింది.

ఆధునిక సాంకేతికతతో నిలువరిద్దాం..
ఆపరేషన్‌ ప్రహార్‌ పేరుతో కేంద్ర బలగాలు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలో మొదలుపెట్టిన ఏరివేతతో దండకారణ్యంలోని మావోయిస్టులు ఈ ఏడాది జనవరిలోనే మెల్లిగా తెలంగాణలోకి వచ్చేశారు. అదే క్రమంలో కరోనా కలకలం, లాక్‌డౌన్, ఇతర కార్యకలాపాల్లో పోలీసులు మునగడంతో మావోలు సులువుగా రాష్ట్రంలోకి ప్రవేశించారు. దీంతో మావోల ప్రయత్నాలకు ఆదిలోనే గండికొట్టాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. ముప్పేట దాడితో మావోలు ఉక్కిరిబిక్కిరి అవుతారనేది అధికారుల వ్యూహంగా తెలుస్తోంది. ప్రాణహిత, గోదావరి నదులపై డ్రోన్లతో నిరంతర పర్యవేక్షణ ఉండాలని, మానవ కదలికల గుర్తింపునకు ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌(ఏఐ) సాంకేతికతను కూడా వినియోగించుకోవాలన్న ప్రతిపాదన వచ్చినట్లు సమాచారం. దట్టమైన దండకారణ్యంలో పగలు సూర్యకిరణాలే నేలకు చేరవు, చీకటిగా ఉంటుంది. అలాంటి ప్రాంతాల్లో కూంబింగ్‌ చేయడం సవాలుతో కూడుకున్నది. అందుకే, హ్యూమన్‌ టెంపరేచర్‌ ఆధారంగా మానవుల కదలికల్ని పసిగట్టే కెమెరాలు, నైట్‌ విజన్‌ గాగుల్స్‌ వినియోగంపైనా చర్చించారు.

మరిన్ని వార్తలు