ప్రాణాల మీదికి ‘పదోన్నతి’.. శిక్షగా మారుతున్న ప్రీ/పోస్టు ప్రమోషనల్‌ ట్రైనింగ్‌

22 Feb, 2023 07:48 IST|Sakshi

కానిస్టేబుళ్లకు దశాబ్దాల సర్వీసు తర్వాతే దక్కుతున్న పదోన్నతి 

ఆ వయసులోనూ డీటీసీ, పీటీసీల్లో శిక్షణ తప్పనిసరి 

వరంగల్‌లో శిక్షణ పొందుతూ కన్నుమూసిన హెడ్‌కానిస్టేబుల్‌ 

ఈ ‘శిక్ష’ణకు ఆరేళ్లలో ఐదుగురు బలి..  పదుల సంఖ్యలో అస్వస్థత 

కానిస్టేబుల్‌ నుంచి హెడ్‌కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందేందుకు, పొందిన... ప్రీ/పోస్టు ప్రమోషనల్‌ శిక్షణలో హఠాన్మరణం చెందిన వారి జాబితా ఇది. గత ఆరేళ్ల కాలంలో ఈ ‘శిక్ష’ణ ఐదుగురిని బలిగొనగా.. పదుల సంఖ్యలో సిబ్బందిని అస్వస్థతకు గురిచేసింది. సరీ్వసులో చేరిన పాతికేళ్ల తర్వాత, యాభై ఏళ్ల పైబడిన వయసులో ఇచ్చే ఈ ట్రైనింగ్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అప్పటికే పోలీసు విభాగంలో సుదీర్ఘకాలం పని చేసిన, నామమాత్రపు దర్యాప్తు అధికారులుగా వ్యవహరించే ఈ సిబ్బందికి ఇప్పుడు కొత్తగా నేర్పేది ఏమిటన్నది సర్వత్రా ఎదురవుతున్న ప్రశ్న. 

 సాక్షి, హైదరాబాద్‌: కానిస్టేబుల్‌ స్థాయి వారికి కెరీర్‌లో ఒక్కసారి వచ్చే పదోన్నతి వారి ప్రాణాల మీదికి తెస్తోంది. పోలీసు విభాగంలో ఎస్సైగా అడుగుపెట్టిన అధికారి పదవీ విరమణ చేసే నాటికి కనిష్టంగా రెండు, డీఎస్పీగా చేరిన వారికి నాలుగు, ఎస్పీ హోదాలో రిపోర్టు చేసిన ఐపీఎస్‌ అధికారికి నాలుగు నుంచి ఐదు వరకు పదోన్నతులు దక్కుతాయి. కానిస్టేబుళ్ల వద్దకు వచ్చేసరికి ఇలాంటి పరిస్థితులుండవు. 1996లో కానిస్టేబుల్‌గా పోలీసు విభాగంలో అడుగుపెట్టి, ప్రస్తుతం 50 ఏళ్లకు అటు ఇటు ఉన్న వాళ్లు ఇటీవలే ఒక్క మెట్టు ఎక్కి హెడ్‌కానిస్టేబుళ్లు అయ్యారు.

పై స్థాయిలో ఉండే అధికారుల సంఖ్య తక్కువ కావడం, కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుళ్లే 80 శాతానికి పైగా ఉండటమూ ఈ పదోన్నతుల ఆలస్యానికి ఒక కారణం. ఫలితంగా కానిస్టేబుల్‌ స్థాయి వారిలో 95 శాతం వరకు పదోన్నతి పొందకుండానే పదవీ విరమణ చేస్తుంటారు. ఉన్నతాధికారులు, ప్రభుత్వం ఎన్ని హామీలిచి్చనా ఇది మారకుండా.. పరిష్కారానికి నోచుకోకుండా ఉంటోంది. 

వీళ్లు కొత్తగా నేర్చుకునేది శూన్యం 
పోలీసు విభాగంలో అడుగుపెట్టి దాదాపు రెండు దశాబ్దాలపాటు పనిచేసిన కానిస్టేబుళ్లు కేసుల దర్యాప్తు, సమాచారం సేకరణ, కోర్టు వ్యవహారాలు, నిందితుల వేట తదితర అంశాల్లో కీలకపాత్ర పోషించి ఆయా అంశాల్లో నిష్ణాతులుగానే ఉంటారు. ఎస్సై, ఆపై స్థాయి అధికారులు సైతం తమ ఠాణాల్లో సీనియర్‌ కానిస్టేబుళ్లకే ప్రాధాన్యత ఇస్తుంటారు.

ఇలాంటి సీనియర్‌ అధికారులకు పదోన్నతులు ఇస్తున్నామనో, ఇచ్చామనో శిక్షణకు పిలిచి కొత్తగా నేర్పేది ఏమిటన్నది ఏళ్లుగా ఎదురవుతున్న ప్రశ్న. ఎస్సై నుంచి ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొందిన వారికి లేని ఈ శిక్షణ తమకే ఎందుకని కానిస్టేబుళ్లు ప్రశి్నస్తున్నారు. పదోన్నతి శిక్షణ తీసుకున్నప్పటికీ తాము నిర్వర్తించేది రొటీన్‌ విధులేనని అంటున్నారు.  

అనారోగ్యాలకు కేరాఫ్‌ 
ఇతర వాటితో పోలిస్తే వృత్తిపరమైన అనారోగ్యాలు పోలీసు విభాగంలో అధికం. దాదాపు 70% మంది ఊబకాయం, బీపీ, షుగర్, హృద్రోగంతోపాటు ఆస్తమా, ఇతర వ్యాధులతో బాధపడుతుంటారు. సర్వకాల సర్వావస్థల్లోనూ అందుబాటులో ఉండాల్సి రావడం, వేళాపాళా లేని తిండి, నిద్ర కారణంగా ఈ రుగ్మతలు వీరికి తప్పట్లేదు. 50 ఏళ్లకు దగ్గరగా ఉన్న వారికి ఈ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి.  

అలాంటి వారిని శిక్షణ పేరుతో పని చేస్తున్న ప్రాంతానికి దూరంగా పంపడం, తెల్లవారుజాము 4.30 గంటల వరకు స్వల్ప విరామాలతో ఇండోర్, ఔట్‌డోర్‌ శిక్షణ ప్రాణాల మీదికి తెస్తోంది. ఒకప్పుడు ఈ శిక్షణ 3 నెలలు ఉండగా... తర్వాత దాన్ని 45 రోజులకు కుదించారు. అయితే ఇదంతా కాకుండా వీరికి కేవలం చట్టం, ఇతర కీలకాంశాలు బోధించడానికి వారం రోజుల రిఫ్రెష్‌మెంట్‌ క్లాసులు సరిపోతాయని మాజీ పోలీసు అధికారులు చెబుతున్నారు. 

డ్రిల్స్‌ పునరుద్ధరిస్తే ఉత్తమం
కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుల్‌ విధుల్లో వ్యత్యాసం ఉంటుంది. ఈ కారణంగానే పదోన్నతి సమయంలో శిక్షణ అనివార్యం. నిబంధనల ప్రకారం ప్రతి పోలీసుస్టేషన్‌లోనూ వారంలో రెండుసార్లు (ఒకసారి సాధారణ, మరోసారి ఆయుధాలతో) డ్రిల్‌ చే­యా­లి. బందోబస్తు భా­రం, పని ఒత్తిడితోపాటు ఇతర కారణాలతో ఇవి జరగట్లేదు. కేవలం ఇన్‌స్పెక్షన్లు ఉన్నప్పుడు మాత్రమే ఓ వారం ముందు నుంచి డ్రిల్స్‌ చేస్తున్నారు. ఈ కారణంగా శారీరక వ్యాయామానికి పోలీసులు పూర్తిగా దూరమవుతున్నారు. అందువల్ల డ్రిల్స్‌ను పునరుద్ధరిస్తే శిక్షణకు వెళ్లినప్పుడు ఇలాంటి అపశ్రుతులను నివారించవచ్చు. 
– బి.రెడ్డన్న, రిటైర్డ్‌ ఎస్పీ   

ఆరోగ్యంపై అశ్రద్ధ వద్దు
పోలీసు విభాగంలో అనేక మంది వివిధ రకాలైన అనారోగ్యాల బారినపడతారు. కొందరికి దీర్ఘకాలిక సమస్యలుంటాయి. దైనందిన విధులతో ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించడం కూడా దీనికి కారణమే. నిర్లక్ష్యానికి తావు లేకుండా అనునిత్యం వ్యాయా­మం చేయడం, ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకుని డాక్టర్‌ సలహా తీసుకుంటే ఇలాంటి ఉదంతాలకు తావుండదు. 
– ఎన్‌.ప్రకాష్, వైద్యుడు
చదవండి: విశ్వనగరానికి వీధికుక్కల బెడద.. మూడు రెట్లు పెరిగిన ఘటనలు 

మరిన్ని వార్తలు