IND vs NZ 1st ODI: హైదరాబాద్‌లో క్రికెట్‌ మ్యాచ్‌.. 2,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు.. సెల్‌ఫోన్లకు మాత్రమే అనుమతి!

18 Jan, 2023 11:02 IST|Sakshi

సాక్షి, ఉప్పల్‌: ఉప్పల్‌ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో బుధవారం భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌కు రాచకొండ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు రాచకొండ సీపీ దేవేందర్‌ సింగ్‌ చౌహాన్‌ వెల్లడించారు. మంగళవారం ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియంలో మల్కాజిగిరి డీసీపీ రక్షితా కె.మూర్తి, ట్రాఫిక్‌ డీసీపీ శ్రీనివాస్‌ గుప్తా, మల్కాజిగిరి ఏసీపీ నరేష్‌ రెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. 


వివరాలు Ðð ల్లడిస్తున్న రాచకొండ సీపీ డీఎస్‌ చౌహాన్‌   

► 2,500 మంది పోలీసులు, 250 మందితో సెక్యూరిటీ వింగ్‌ , 403 మంది ట్రాఫిక్‌ సిబ్బంది, 1091 మంది లా అండ్‌ ఆర్డర్, నాలుగు ప్లాటూన్ల టీఎస్‌ఎస్‌పీ బృందాలు, ఆరు ప్లటూన్ల ఆర్మ్‌డ్‌ సిబ్బంది, రెండు ఆక్టోపస్‌ టీంలు, మౌంటెడ్‌ పోలీస్, వజ్రా తదితర సిబ్బందితో భారీ బందోబస్తు.  

►అలాగే ఎస్‌బీ, సీసీఎస్, ఎస్‌ఓటీ, రెండు ఫైర్‌ ఇంజిన్లు, అంబులెన్స్‌లు అందుబాటులో ఉంటాయి. స్టేడియం పరిసర  ప్రాంతాలు, స్డేడియంలో, ప్రేక్షకులు కూర్చునే చోటు, వాహనాల పార్కింగ్‌ ప్రాంతాల్లో కలిసి మొత్తం 300 సీసీ కెమెరాలు ఉంటాయి. 

సీసీ టీవీలతో గస్తీ.. 
►సీసీ టీవీల దృశ్యాలను ఎప్పటికప్పుడు వీక్షించేలా కమాండ్‌ కంట్రోల్‌ రూం. బాంబు స్క్వాడ్, డాగ్‌ స్క్వాడ్‌తో నిరంతర గస్తీ.  
►పేలుడు పదార్థాలను గుర్తించేలా ప్రత్యేక టీంల ఏర్పాటు. బ్లాక్‌ టికెట్లను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. బెట్టింగ్‌లకు పాల్పడుతున్నవారిపై ఇప్పటికే 4 కేసులు బుక్‌ చేశాం.  
చదవండి: హైదరాబాద్‌లో న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. అన్నింటా భారత్‌దే పైచేయి

ఎక్కడ మహిళలుంటే అక్కడ షీ టీం 
►ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియంలోకి వచ్చే మహిళల భద్రతకు ప్రాధాన్యం. ఎక్కడ మహిళలు ఉంటే అక్కడ షీటీంలు అందుబాటులో ఉంటాయి.   

వీఐపీలకే గేట్‌ నంబర్‌ వన్‌..  
ఈసారి గేట్‌ నంబర్‌ వన్‌ను వీఐపీలకే అనుమతి ఉంటుంది. 12 నంబర్‌ గేట్‌ను గేట్‌ 1ఏగా గుర్తించి.. దాని ద్వారా జనరల్‌ పబ్లిక్‌ను అనుమతి ఇవ్వనున్నాం.  

భారీ వాహనాల దారి మళ్లింపు 
►బుధవారం ఉదయం నుంచే ట్రాఫిక్‌ మళ్లింపు ఉంటుంది. వరంగల్‌ నుంచి సికింద్రాబాద్‌ వైపు, సికింద్రాబాద్‌ నుంచి ఉప్పల్‌ వైపు, ఎల్‌బీనగర్‌ నుంచి ఉప్పల్, సికింద్రాబాద్‌ వైపు వెళ్లే అన్ని భారీ వాహనాలను దారి మళ్లిస్తాం.  
►వరంగల్‌ నుంచి ఉప్పల్‌ వైపు వచ్చే వాహనాలను చెంగిచెర్ల, మల్లాపూర్‌ల మీదుగా దారి మళ్లిస్తాం.  

సెల్‌ఫోన్లకు మాత్రమే అనుమతి 
ప్రేక్షకులు కేవలం సెల్‌ఫోన్లు తప్ప మరే ఇతర వస్తువులను స్టేడియంలోకి అనుమతి ఉండదు.  
►తాగునీరు, తినుబండారాల విక్రయం  
►తిను బండారాలు, తాగునీరు.. అన్ని రకాల ఆహార పదార్థాలను హెచ్‌సీఏ ద్వారా స్టేడియంలో విక్రయిస్తారు.  
►సూచించిన రేట్లకే స్టాల్స్‌ నిర్వాహకులు వీటిని విక్రయించాలి. లేనిపక్షంలో పోలీసులు చర్యలు తీసుకుంటారు.  

సూచించిన స్థలాల్లోనే పార్కింగ్‌.. 
►హబ్సిగూడ చౌరస్తా నుంచి ఉప్పల్‌ చౌరస్తా వరకు, రామంతాపూర్‌ విశాల్‌ మార్ట్‌ నుంచి ఉప్పల్‌ రింగ్‌ రోడ్డు వరకు రోడ్డుకిరువైపులా ఎలాంటి వాహనాలను పార్క్‌ చేయొద్దు.  
►కేటాయించిన స్థలాల్లోనే పార్కు చేయాల్సి ఉంటుంది. క్రికెట్‌ మ్యాచ్‌ చూసేందుకు వచ్చినవారు టీఎస్‌ఐఐసీ స్థలంలోనే వాహనాలను పార్కు చేయాలి. ఏ వాహనాలను ఎక్కడ పార్కింగ్‌ చేయాలో సూచించే బోర్డులను ఏర్పాటు చేశాం.   

మరిన్ని వార్తలు