ప్రియాంక ఫిర్యాదు.. పోలీసుల అదుపులో తీన్మార్‌ మల్లన్న

4 Aug, 2021 03:26 IST|Sakshi
మల్లన్నను అదుపులోకి తీసుకుంటున్న పోలీసు అధికారి 

క్యూ న్యూస్‌ కార్యాలయంపై దాడి.. హార్డ్‌డిస్క్‌లు సీజ్‌ 

ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు 

సాక్షి, హైదరాబాద్‌: యూ ట్యూబ్‌ చానల్‌ క్యూ న్యూస్‌ వ్యవస్థాపకుడు చింతపండు నవీన్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్నను హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ప్రియాంక అనే యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మల్లన్నతో పాటు క్యూ న్యూస్‌ చానల్‌పై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే సైబర్‌ క్రైమ్‌ పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌ బృందం, స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ (ఎస్వోటీ) అధికారులతో పాటు స్థానిక పోలీసులు రాత్రి క్యూ న్యూస్‌ కార్యాలయంపై దాడి చేశారు. మల్లన్నను అదుపులోకి తీసుకోవడంతో పాటు ఆ సంస్థ కార్యాలయం నుంచి కొన్ని హార్డ్‌ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని రోజులుగా క్యూ న్యూస్‌ మాజీ విలేకరి చిలుక ప్రవీణ్, తీన్మార్‌ మల్లన్న మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో రెండు రోజుల కిందట విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన ప్రవీణ్‌ అందులో మల్లన్నపై అవినీతితోపాటు పలు ఆరోపణలు చేశారు. దీనికి కౌంటర్‌గా మల్లన్న ఆదివారం న్యూస్‌లో కొన్ని ప్రత్యారోపణలు చేశారు.
 
సైబర్‌ క్రైమ్‌ ఏసీపీకి ప్రియాంక ఫిర్యాదు.. 
ఈ నేపథ్యంలోనే మల్లన్న.. ప్రవీణ్‌తో కలసి ఉన్న కొందరు యువతుల ఫొటోలు, వీడియోలను ప్రదర్శిస్తూ అభ్యంతరకరంగా వ్యాఖ్యానించారు. వాటిలో ప్రియాంక ఫొటోలు కూడా ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్న ఆమె మంగళవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. తాను ప్రవీణ్‌ స్నేహితురాలినని.. స్నేహపూర్వకంగా దిగిన ఫొటోలను చూపిస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆమె పేర్కొన్నారు. క్యూ న్యూస్‌లో మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యల వల్ల తన వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినడంతో పాటు తీవ్ర మనోవేదనకు గురయ్యానంటూ ప్రియాంక ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు సోమవారం ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేశారు.

మల్లన్న వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను సంగ్రహించారు. వీటి ఆధారంగా బుధవారం రాత్రి క్యూ న్యూస్‌ కార్యాలయంపై ప్రత్యేక బృందాలు దాడి చేశాయి. సైబర్‌ క్రైమ్‌ పోలీసులు మల్లన్నను అదుపులోకి తీసుకోవడంతో పాటు హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. అతన్ని విచారిస్తామని, ఆపై అరెస్టు చేయాలా? నోటీసులు జారీ చేయాలా? అనేది నిర్ణయిస్తామని అధికారులు పేర్కొన్నారు. అదుపులోకి తీసుకునే సమయంలో కొందరు మల్లన్న అభిమానులు క్యూ న్యూస్‌ కార్యాలయానికి చేరుకొని పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో అక్కడ గందరగోళం నెలకొంది.

 

మరిన్ని వార్తలు