మాజీ డీజీపీ ‘సారూ’ దొరికింది

16 Jan, 2021 19:07 IST|Sakshi

బంజారాహిల్స్‌:  మాజీ డీజీపీ అప్పారావు ఇంటి ముందు పెంచుకుంటున్న ఖరీదైన, అరుదైన బోన్సాయ్‌ మొక్కను దొంగిలించిన కేసులో నిందితుడిని జూబ్లీహిల్స్‌ క్రైం పోలీసులు అరెస్ట్‌ చేసి మొక్కను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 18 లో నివసించే మాజీ డీజీపీ అప్పారావు, శ్రీదేవి దంపతులకు బోన్సాయ్‌ మొక్కల పెంపకంపై ఆసక్తి. కొన్నేళ్లుగా వీరు తమ ఇంటి ఆవరణలో అరుదైన బోన్సాయ్‌ మొక్కలను పెంచుకుంటున్నారు.

ఇదిలా ఉండగా ఎస్పీఆర్‌హిల్స్, ఓంనగర్‌కు చెందిన గొల్లపూడి ప్రసన్నాంజనేయులు తరచూ వాటిని చూస్తుండేవాడు. వీటి ప్రత్యేకతను తెలుసుకున్న అతను ఖరీదైన వాటిని అమ్ముకుంటే డబ్బులు వస్తాయని ఆశించాడు. ఈ నేపథ్యంలో తన స్నేహితుడు అభిషేక్‌తో కలిసి గతంలో రెండుసార్లు ఇంటి ముందున్న బోన్సాయ్‌ మొక్కలను దొంగిలించి అమ్ముకున్నాడు. ఒక్కో మొక్క రూ. 25 వేల వరకు ధర పలికాయి. దీంతో వారు మరోసారి ఇంకో మొక్కను దొంగి లించి అమ్ముకోవాలని పథకం వేశారు. ఇందులో భాగంగా ఈ నెల 10న ఉదయం ఇద్దరూ బైక్‌పై వచ్చి ‘సారూ’ జాతికి చెందిన బోన్సాయ్‌ మొక్కను దొంగిలించారు.(చదవండి: జ్యువెలరీ షాపులో భారీ చోరీ)

దీంతో ఉదయం మొక్క కనిపించకపోవడంతో అప్పారావు భార్య శ్రీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు కృష్ణానగర్, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లోని సీసీ టీవీలను పరిశీలించారు. ఈ క్రమంలో యూసుఫ్‌గూడ వైపు నుంచి బైక్‌పై మొక్క తీసుకుని వెళ్తున్న నిందితులను గుర్తించారు. రెండు రోజుల గాలింపు అనంతరం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆంజనేయులు గతంలోను ఇక్కడ బోన్సాయ్‌ మొక్కలు చోరీ చేసినట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి మొక్కను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడు అభిషేక్‌ను శుక్రవారం రాత్రి అరెస్ట్‌ చేసినట్లు డీఐ రమేష్‌ తెలిపారు.   

>
మరిన్ని వార్తలు