దుబ్బాక రాజకీయం.. నోట్లకట్టల లొల్లి

27 Oct, 2020 01:56 IST|Sakshi
అంజన్‌రావు ఇంటి ఆవరణలో పోలీసులు, బీజేపీ కార్యకర్తలకు మధ్య జరిగిన తోపులాటలో కిందపడ్డ నోట్లకట్టలు

సిద్దిపేటలో హైడ్రామా

మూడు చోట్ల పోలీసుల సోదాలు.. 

అంజన్‌రావు ఇంట్లో రూ. 18.67 లక్షలు స్వాధీనం

పోలీసులే డబ్బు తెచ్చి పెట్టారని బీజేపీ ఆందోళన

పోలీసుల నుంచి నోట్లకట్టలను గుంజుకున్న పలువురు

సిద్దిపేట శివారులో బండి సంజయ్‌ అడ్డగింపు

ఆ డబ్బుతో నాకు సంబంధం లేదు: రఘునందన్‌రావు

డబ్బు రాజకీయాలు చేస్తున్న బీజేపీ: హరీశ్‌రావు

అంజన్‌రావు ఇంట్లోనే దొరికాయి: పోలీస్‌ కమిషనర్‌

సాక్షి, సిద్దిపేట/ సిద్దిపేట కమాన్‌: సిద్దిపేట పట్టణంలో సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు నోట్ల కట్టలపై హైడ్రామా కొనసాగింది. పోలీసుల సోదాలు, బీజేపీ కార్యకర్తల హల్‌చల్, తోపులాట, డబ్బులు లూటీ, పోలీసుల లాఠీచార్జి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అడ్డగింపుతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల కోడ్‌ సందర్భంగా అక్రమంగా నిల్వ ఉంచిన డబ్బులను సోదాచేసి పట్టుకున్నామని పోలీసులు చెప్పగా.. పోలీసులే డబ్బులు తెచ్చిపెట్టి సోదాల్లో దొరికాయని చెబుతున్నారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. విమర్శలు, ప్రతివిమర్శలు, నినాదాలతో సిద్ది్దపేట పట్టణం హోరెత్తింది. దుబ్బాక ఉప ఎన్నికలు వేడెక్కుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం సిద్దిపేటలోని లెక్చరర్స్‌ కాలనీ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు మామ సురభి రాంగోపాల్‌రావు, పక్కనే ఉన్న సురభి అంజన్‌రావు ఇంటిలో సిద్దిపేట అర్బన్‌ తహసీల్దార్‌ (ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ట్రేట్‌) ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేశారు.

నోట్ల కట్టలతో ఉన్న బ్యాగుతో పోలీసు
ఈ సందర్భంగా అంజన్‌రావు ఇంట్లో రూ.18.67 లక్షలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ డబ్బులు పోలీసులే తీసుకొచ్చి అక్కడ పెట్టి డబ్బులు దొరికాయని ప్రచారం చేస్తున్నారంటూ... బీజేపీకి చెందిన పలువురు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ వార్త సోషల్‌ మీడియాలో ప్రచారం కావడంతో వందలాది మంది కార్యకర్తలు వచ్చి అంజన్‌రావు ఇంట్లోకి వెళ్లారు. అక్కడ పోలీసుల వద్ద ఉన్న డబ్బులను బలవంతంగా లాక్కొని ఈ డబ్బు పోలీసులే తీసుకువచ్చారని ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ డబ్బుతో తమకు సంబంధం లేదని రఘునందన్‌రావు, అంజన్‌రావు, రాంగోపాల్‌రావులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అదనపు పోలీసు బలగాలు అక్కడికి చేరుకొని లాఠీచార్జి చేసి బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది. గొడవ విషయం తెలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిì సంజయ్‌ కరీంనగర్‌ నుంచి బయలుదేరి వస్తుండగా... సిద్దిపేట శివారులో పోలీసులు అడ్డుకున్నారు. పక్కనే ఉన్న కార్యకర్తలు పోలీసులతో వాగ్వావాదానికి దిగారు. అనంతరం సంజయ్‌ని తిరిగి కరీంనగర్‌ పంపించారు.

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి పరిస్థితిని వివరిస్తున్న రఘునందన్‌రావు, ఆయన సతీమణి
నాకు సంబంధం లేదు: రఘునందన్‌రావు
మా అత్తగారి ఇంటిపక్కనే ఉన్న ఇంట్లో డబ్బులు దొరికితే తనకేం సంబంధమని దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు అన్నారు. దసరా సందర్భంగా తన భార్య, కూతురు, మనువరాలు అత్తగారి ఇంటికి వచ్చారని చెప్పారు. ప్రచారంలో ఉన్న తాను మధ్యాహ్నం భార్యకు ఫోన్‌ చేశానని, తీయకపోవడంతో అనుమానం వచ్చి సిద్దిపేటకు రాగా పోలీసుల సందడి కనిపించిందని చెప్పారు. మహిళలు, చిన్న పిల్లలు అని కూడా చూడకుండా పోలీసులు ఇల్లంతా చిందరవందర చేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్దంగా ప్రచారం చేసుకుంటున్న తనపై తప్పుడు కేసులు పెట్టేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు.

అంజన్‌రావు ఇంట్లో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట
తనిఖీల్లో డబ్బు దొరికింది: పోలీస్‌ కమిషనర్‌
దుబ్బాక ఉపఎన్నికల్లో నిబంధనలకు విరుద్దంగా డబ్బులు ఖర్చు చేసేందుకు సిద్దిపేటలో డబ్బు నిల్వ చేస్తున్నారనే సమాచారం మేరకు సోమవారం మూడు చోట్ల సోదాలు నిర్వహించగా డబ్బులు దొరికాయని సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ విలేకరుల సమావేశంలో తెలిపారు. సిద్దిపేట ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ట్రేట్‌ విజయ్‌ సాగర్, పోలీసు సిబ్బంది కలిసి... మున్సిపల్‌ చైర్మన్‌ కడవెర్గు రాజనర్సుతోపాటు రఘునందన్‌రావు బంధువులు సురుభి అంజన్‌రావు, సురభి రాంగోపాల్‌రావు ఇళ్లలో సోదాలు చేశామని చెప్పారు. ఈ సందర్భంగా అంజన్‌రావు ఇంట్లో రూ. 18.67 లక్షలు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. ఈ సోదాల్లో ప్రతీది రికార్డు చేశామన్నారు. అయితే విషయం తెలుసుకున్న దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు 250 మంది అనుచరులతో పోలీసులపై దాడి చేసి రూ. 12.80 లక్షలు తీసుకెళ్లారని చెప్పారు. వీడియో ఫుటేజీల ద్వారా వీరిని గుర్తించి రికవరీ చేస్తామని, నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. డబ్బు విషయంపై ప్రశ్నించగా జితేందర్‌రావు డ్రైవర్‌ తెచ్చి ఇచ్చాడని, ఈ డబ్బులను కొద్దికొద్దిగా దుబ్బాకకు పంపించేందుకు ఇక్కడ పెట్టామని స్వయంగా అంజన్‌రావు చెప్పిన వాగ్మూలం రికార్డు చేశామని సీపీ జోయల్‌ డేవిస్‌ వివరించారు.

లెక్చరర్స్‌ కాలనీలోని రఘునందన్‌రావు మామ ఇంటి పక్కన ఉన్న అంజన్‌రావు నుంచి వాంగ్మూలం రికార్డు చేస్తున్న సిద్దిపేట ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ విజయ్‌ సాగర్, సీపీ జోయల్‌
బీజేపీ గుండాగిరీ: హరీశ్‌రావు
దుబ్బాక ఉపఎన్నికల్లో గెలువలేమని తెలుసుకున్న బీజేపీ నాయకులు అడ్డదారిలో వెళ్లి ప్రజల సానుభూతి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలో డబ్బుల లొల్లిపై దుబ్బాక ప్రచారంలో ఉన్న ఆయన మాట్లాడారు. బీజేపీ అసత్య ప్రచారానికి దిగుతోందని ఆరోపించారు. మొన్నటికి మొన్న శామీర్‌పేట సమీపంలో బీజేపీ నాయకుల దగ్గర డబ్బులు దొరికాయన్నారు. అనుమానంతో సోమవారం రఘునందన్‌రావు బంధువు ఇంటిని తనిఖీ చేశారని, డబ్బు దొరికితే తమ తప్పులు బయటపడతాయనే ఆలోచనతో బీజేపీ కార్యకర్తలు గుండాల్లా ప్రవర్తించి పోలీసుల వద్దనున్న డబ్బులు గుంజుకపోయారన్నారు. దౌర్జన్యం చేసి, ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారన్నారు. 

అమిత్‌ షా ఆరా..
సాక్షి, హైదరాబాద్‌: సిద్దిపేట ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆరా తీశారు. ఎంపీ బండి సంజయ్‌ని ఫోన్‌లో వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన గొంతు పట్టుకొని వాహనంలో కుక్కారని అమిత్‌ షాకు సంజయ్‌ వివరించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. బీజేపీ అభ్యర్థి ఇల్లు, బంధువుల ఇళ్లలో సోదాల గురించి వివరించినట్లు తెలిపాయి.

కమలం పార్టీది కపట నాటకం 

  • ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు 

సిద్దిపేటజోన్‌: గత రెండు పర్యాయాలు ఎన్నికల్లో డిపాజిట్‌ కోల్పోయిన బీజేపీ గోబెల్స్‌ ప్రచారం, అభూత కల్పనలతో రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. అందులో భాగంగానే పట్టుబడిన డబ్బుల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కమలం పార్టీ నానా యాగీ చేస్తూ కపట నాటకం ఆడుతోందన్నా రు. సిద్దిపేటలో జరిగిన పరిణామాలపై సోమ వారం రాత్రి హరీశ్‌ స్పందించారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బంధువు ఇంట్లో రెడ్‌హ్యాండెడ్‌గా, తహసీల్దార్‌ సమక్షంలో వీడి యో చిత్రీకరణల మధ్య డబ్బులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులే స్పష్టం చేశారన్నారు. సోమవారం బీజేపీకి సంబంధించిన ఇద్దరి ఇళ్లతో పాటు టీఆర్‌ఎస్‌కు చెందిన సిద్ది పేట మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, చేగుంట మండలంలో టీఆర్‌ఎస్‌ నేత ఇంట్లో కూడా సోదాలు జరిగాయన్నారు. రఘునందన్‌ ఎన్ని కల్లో ఖర్చు చేసేందుకే డబ్బు నిల్వ చేశామని బంధువు ఇచ్చిన వాంగ్మూలం వీడియో రికా ర్డు ఉందన్నారు. దీన్ని ఎన్నికల అధికారులు బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. ఇలా దిగజారుడు రాజకీయాలు చేస్తున్న బీజేపీకి ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలన్నారు. వాస్తవాలు తెలియకుండా బండి సంజయ్, కిషన్‌రెడ్డిలు ట్రాప్‌లో పడ్డారన్నారు.

>
మరిన్ని వార్తలు