పబ్‌ వ్యవహారం: ‘జాబితా’పై హైడ్రామా! 

4 Apr, 2022 04:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  సినీ–వ్యాపార ప్రముఖులు, రాజకీయ నేతల పిల్లలు పట్టుబడిన ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ వ్యవహారంలో హైడ్రామా చోటు చేసుకుంది. పబ్‌లో పట్టుబడిన అందరినీ ఆదివారం తెల్లవారుజామునే బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సినీ నటుడు నాగబాబు కుమార్తె కొణిదెల నిహారిక, బిగ్‌బాస్‌ సీజన్‌–3 విజేత రాహుల్‌ సిప్లిగంజ్, తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్‌ కుమారుడు సిద్ధార్థ్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యాపార, పారిశ్రామిక, రాజకీయవేత్తల కుమారులు, కుమార్తెలు అందులో ఉన్నారు. పోలీసులు ఉదయం 8.30–9.00 గంటల మధ్య వీరందరికీ నోటీసులు జారీచేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.

ఉదయం 8.30 గంటల సమయంలో రాహుల్‌ సిప్లిగంజ్‌ స్టేషన్‌ నుంచి వెళ్లిపోయారు. అప్పటికే మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఇది చూసిన నిహారిక బయటికి రాకుండా మధ్యాహ్నం వరకు లోపలే ఉండిపోయారు. చివరికి 12 గంటల సమయంలో బయటికి వచ్చారు. మీడియా ప్రతినిధులు చుట్టుముట్టినా.. తనఫోన్‌లో మాట్లాడుకుంటూ కారు ఎక్కి వెళ్లిపోయారు. అయితే పోలీసులు పబ్‌లో 142 మందిని అదుపులోకి తీసుకున్నట్టుగా మధ్యాహ్నం అనధికారిక లిస్టును విడుదల చేశారు.

అందులో నిహారిక పేరు లేకపోవడంతో.. ఆమెను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనితో సాయంత్రం అనధికారికంగానే మరో ప్రకటన చేసిన పోలీసులు.. నిహారికతోపాటు మరో ఐదుగురి పేర్లను కూడా జోడించారు. దీనితో మొదట చెప్పిన జాబితా 142 నుంచి 148కి పెరిగింది. పబ్‌లో అదుపులోకి తీసుకున్నవారిలో ఓ పోలీసు ఉన్నతాధికారి కుమార్తె సైతం ఉన్నట్టు ప్రచారం జరిగింది. కానీ జాబితాలో ఆ పేరు కనిపించలేదు. కాగా.. పబ్‌ వ్యవహారంలో తనకేం సంబంధం లేకున్నా ఓ చానల్‌ వాళ్లు తన పేరును ప్రచారం చేస్తున్నారంటూ సినీ నటి హేమ బంజారాహిల్స్‌ పోలీసుస్టేషన్‌ వద్ద హల్‌చల్‌ చేశారు.

మరిన్ని వార్తలు