ఆటోలో మందిని చూసి షాకైన పోలీసులు

18 Dec, 2020 16:26 IST|Sakshi
ఆటోలో నుంచి బయటకొచ్చిన ప్రయాణికులు

సాక్షి, హైదరాబాద్‌: అమాయకుల అవసరాలే పెట్టుబడిగా ఆటో డ్రైవరన్నలు సాహసాలు చేస్తున్నారు. పరిమితికి మించి అనేకంటే అంతకు మించి ప్రయాణికులతో బండి లాగించేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రతియేడు లక్షా 50 వేలకు పైగా ప్రజలు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని ఓ వైపు గణాంకాలు హెచ్చరిస్తున్నా అటు ప్యాసెంజర్‌ వాహనాలు, ఇటు ప్రజల నిర్లక్ష్య వైఖరి మారడం లేదు. పైన కనిపిస్తున్న ఫొటోనే ఇందుకు నిదర్శనం. బాలానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 17 మందితో వెళ్తున్న ఈ ఆటో ‘విన్యాసం’ బయటపడింది. మహబూబ్‌నగర్‌ పోలీసులు ఈ ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా.. తెలంగాణ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ స్పందించింది. 

‘ఏందన్నా..! అది ఆటో నా ? మినీ బస్సా ? 7 సీటరా లేక 14 సీటరా ? ఆటో నీది !, ప్రాణం ఆ అమాయకులది !, మరి ఆటోలో ప్రయాణించే సమయంలో వారి ప్రాణాలకు భరోసా ఎవరిది ?’ అంటూ కామెంట్‌ చేసింది. ఈ ఫొటోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు డ్రైవర్‌ తీరుపై విస్మయం వ్యక్తం చేయగా.. మరికొందరు ఆటో ఎక్కే ప్రయాణికులకు కూడా సోయి ఉండాలి కదా అని విమర్శిస్తున్నారు. మరికొందరేమో ప్రభుత్వం సరిపడా రవాణా సదుపాయాలు కల్పిస్తే ప్రజలెందుకు ప్రాణాలకు తెగించి మరి ఇలా ఎందుకు వెళ్తారని అంటున్నారు. అన్ని రూట్లలో బస్సులు నడపొచ్చుగా అని సూచనలు ఇస్తున్నారు.

మరిన్ని వార్తలు