‘ప్రగతిభవన్‌’ పాదయాత్ర భగ్నం

28 Jun, 2022 03:02 IST|Sakshi
రామన్నగూడెం నుంచి ప్రగతి భవన్‌కు పాదయాత్రగా బయలుదేరిన గిరిజనులు 

గిరిజనులు, పోలీసుల మధ్య వాగ్వాదం, ఉద్రిక్తత

మహిళలపై లాఠీచార్జ్‌.. ఆందోళనకారుల అరెస్టు 

అదనపు కలెక్టర్‌ హామీతో ఆందోళన విరమణ

అశ్వారావుపేటరూరల్‌/ములకలపల్లి: ఏళ్ల తరబడి తాము ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం కేసీఆర్‌కు చెప్పుకునేందుకు ప్రగతిభవన్‌కు పాదయాత్రగా బయలుదేరిన గిరిజనులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామన్నగూడెం గిరిజనులు.. పాత పట్టాదారు పాసు పుస్తకాలున్న వారందరికీ డిజిటల్‌ పాసుబుక్కులు ఇవ్వాలని, హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం సర్వే నంబర్లు 30, 36, 39లోని పట్టాభూములను రైతులకు అప్పగించాలని, వెంకమ్మ చెరువు వరద కాలువ నిర్వాసితులకు ఎకరానికి రూ.8లక్షల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఎంతకీ సమస్య పరిష్కారం కాకపోవడంతో ప్రగతిభవన్‌కు పాదయాత్రగా వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలవాలని నిర్ణయించారు. పోలీసులు, అధికారులు, టీఆర్‌ఎస్‌ నేతలు ఆదివారం రాత్రినుంచే నచ్చజెప్పచూసినా గిరిజనులు ఒప్పుకోలేదు. 120 మంది గ్రామస్తులు సోమవారం తెల్లవారుజామున పాదయాత్రను ప్రారంభించారు. రామన్నగూడెం నుంచి గంగారం చేరుకునేలోగా అశ్వారావుపేట సీఐ బాలకృష్ణ ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో పోలీసులు వచ్చారు.

పాదయాత్ర విరమించాలని సూచించారు. గిరిజనులు వినకపోవడంతో అదుపులోకి తీసుకుంటుండగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. పరస్పర దాడులతో ఆ ప్రాంతం రణరంగమైంది. ఘర్షణను అదుపు చేసేందుకు పోలీసులు గిరిజన మహిళలపై లాఠీచార్జ్‌ చేశారు. రెండు డీసీఎం వ్యాన్లలో ఆందోళనకారులను బలవంతంగా ఎక్కించి ములకలపల్లి, కిన్నెరసాని పోలీస్‌స్టేషన్లకు తరలించారు.

‘చంటి బిడ్డతో ఉన్నానని చూడకుండా పోలీసులు నన్ను బలవంతంగా డీసీఎం వ్యాన్‌ ఎక్కించారు’ అని రామన్నగూడెం సర్పంచ్‌ మడకం స్వరూప బోరున విలపించారు. ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఎంపీపీ శ్రీరామ్మూర్తిలు తమపైకి పోలీసులను ఉసిగొల్పారని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నాయకుడు తాటి వెంకటేశ్వర్లు ఆందోళనకారులకు మద్దతుగా నిలిచారు.

ములకలపల్లి పోలీస్‌స్టేషన్‌ ఎదుట నాలుగు గంటల పాటు రాస్తారోకో చేశారు. కాగా, అదనపు కలెక్టర్‌ కర్నాటి వెంకటేశ్వర్లు.. అటవీ, రెవెన్యూ సిబ్బందితో జాయింట్‌ సర్వే చేయించి, వారంలో సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీనివ్వడంతో ఆందోళన విరమించారు. అరెస్టయిన వారందరినీ పోలీసులు సాయంత్రానికి విడుదల చేశారు.

మరిన్ని వార్తలు