బోర్డర్‌లో ‘బూడిద’ లొల్లి! 400 లారీల నిలుపుదల.. ఎమ్మెల్యే డబ్బులు డిమాండ్‌ చేశారా?

29 Jan, 2022 03:24 IST|Sakshi
రాష్ట్ర సరిహద్దులో నిలిపి వేసిన బూడిద లారీలు 

కర్ణాటక సరిహద్దులో బూడిద లారీలను ఆపిన పోలీసులు 

రెండు రోజులుగా 400కుపైగా లారీల నిలిపివేత.. డ్రైవర్ల ఆందోళన 

ఓ ఎమ్మెల్యే డబ్బులు డిమాండ్‌ చేసినట్టు సోషల్‌ మీడియాలో ప్రచారం 

తర్వాత వెలుగులోకి మరో ఎమ్మెల్యే ఆడియో 

అధిక లోడ్‌తో వెళ్తుండడంతో ఆపామన్న పోలీసులు 

బీజేపీ నేతల ఆందోళనతో వదిలేసిన వైనం 

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: తెలంగాణ–కర్ణాటక సరిహద్దులో బూడిద లారీలను నిలిపివేయడం ఆందోళనకు దారితీసింది. రెండు రోజులుగా  400కుపైగా లారీలను ఆపేయడం.. డ్రైవర్ల నిరసనతో ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంది. లారీలను వదలాలంటే  డబ్బులు చెల్లించాలని ఓ ఎమ్మెల్యే డిమాండ్‌ చేసినట్టు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం చర్చనీయాంశమైంది. ఓవర్‌ లోడ్‌తో వెళ్తుండటంతో ఆపేశామని పోలీసులు చెప్తుండటంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. నిబంధనల ప్రకారం జరిమానా వేసి వదిలేయాల్సి ఉన్నా.. రెండ్రోజులు ఆపడం, డ్రైవర్లు నిరసనకు దిగేవరకూ చూడడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అసలేం జరిగింది? 
రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా కృష్ణా మండలానికి కర్ణాటకతో సరిహద్దు ఉంది. ఆ రాష్ట్రంలోని కర్ణాటక పవర్‌ కార్పొరేషన్‌ (కేపీసీ) విద్యుత్‌ కేంద్రంలో వెలువడిన బూడిద (యాష్‌).. ఈ సరిహద్దు మీదుగానే రాష్ట్రంలోని ఇటుక బట్టీలకు సరఫరా అవుతుంది. నారాయణపేట, మహబూబ్‌నగర్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఇటుక బట్టీల్లో లైట్‌ వెయిట్‌ బ్రిక్స్‌ తయారీకి ఈ బూడిదను వినియోగిస్తారు. అయితే ఈ బూడిదను రవాణాచేసే లారీలను కృష్ణా చెక్‌పోస్టు వద్ద రవాణా, పోలీస్‌ అధికారులు గురువారం నుంచి నిలిపివేశారు.

సుమారు 400కుపైగా వాహనాలు రెండు రోజులుగా రోడ్డు పక్కనే నిలిచిపోయాయి. లారీలను పంపాలని, తిండికి కూడా ఇబ్బంది పడుతున్నామని డ్రైవర్లు శుక్రవారం ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు అక్కడికి చేరుకుని.. వారికి మద్దతుగా రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ఓవర్‌లోడ్‌తో వస్తే జరిమానా వేసి, మరోసారి ఓవర్‌ లోడ్‌తో రావొద్దని చెప్పాలే తప్ప.. ఇలా నిలిపేసి ఇబ్బంది పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. దీనితో పోలీసు, రవాణా అధికారులు లారీలను వదిలేశారు. 

ముందు ఓ ఎమ్మెల్యే.. తర్వాత మరో ఎమ్మెల్యే.. 
బూడిద లారీలను వదిలేయాలంటే ఒక్కోలారీకి రూ.10వేలు ఇవ్వాలని నారాయణపేట జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే డిమాండ్‌ చేసినట్టుగా శుక్రవారం ఉదయం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఆ తర్వాత ఓ డ్రైవర్‌ అదే జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యేతో ఫోన్‌లో మాట్లాడిన సంభాషణలు వెలుగులోకి వచ్చాయి. ‘‘మిమ్మల్ని తిప్పలు పెట్టాలని కాదు. ఓవర్‌ లోడ్‌తో రోడ్లు దెబ్బతింటున్నయ్‌.. లెక్క ప్రకారం బూడిదను ట్యాంకర్‌ వాహనాల ద్వారా సరఫరా చేయాలి.

ఓపెన్‌ లారీల్లో లెవల్‌కు మించి వేయడంతో గాలికి లేచి కళ్లల్లో పడుతోంది. పరిగికి చెందిన ఓ నాయకుడిది ఓవర్‌ లోడై ఉంది. అక్కడి పోలీస్‌ నాటకం చేస్తున్నడు. పైసలు తీసుకుని వదిలిపెడ్తున్నడు. చూస్తున్నా.. ఖతం పెట్టాలని చూస్తున్నా. మీరు దందా చేసి బతకాలి.. నాది గట్లే ఉంటది.. కొంచెం సిస్టంగా రావాలని చూస్తున్నా..’’ అని సంభాషణలో ఉండటం చర్చనీయాంశంగా మారింది. లారీల విషయంలో ఇలా ఇద్దరు ఎమ్మెల్యేల జోక్యం, ఆరోపణలపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

మరిన్ని వార్తలు