3 నిమిషాల ముందు వెళ్లి.. 5 నిమిషాల్లో హత్య చేసి..

24 Feb, 2021 03:30 IST|Sakshi

నిందితుల కారు వెనుకే న్యాయవాద దంపతుల కారు

3 నిమిషాల ముందు వెళ్లి.. 5 నిమిషాల్లో హత్య చేసి పరారీ

రిమాండ్‌ కేస్‌ డైరీలో పోలీసులు

సాక్షి, కరీంనగర్‌: న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, నాగమణి హత్యలకు నిందితులు రెండు గంటల్లోనే ప్లాన్‌ చేసి అమలు చేసినట్లు పోలీసులు తేల్చారు. హత్యకు ముందు, తర్వాత జరిగిన పరిణామాలను నిందితుల ‘రిమాండ్‌ కేస్‌ డైరీ’లో వివరించారు. వామన్‌రావు దంపతుల కన్నా 3 నిమిషాల ముందు మాత్రమే నిందితులు కుంట శ్రీనివాస్, చిరంజీవి నల్ల బ్రీజా కారులో వెళ్లి కల్వచర్ల వద్ద మాటు వేసినట్లు వీడియో ఫుటేజీల్లో రికార్డు అయిన సమయాన్ని విశ్లేషిస్తే తెలుస్తోంది. హత్యాకాండను ఐదారు నిమిషాల్లోనే పూర్తిచేసి తిరిగి మంథని వైపు వెళ్లినట్టు తేలింది.

2.26 గంటల నుంచి...
హత్య జరిగిన 17వ తేదీ మధ్యాహ్నం 2:26.38 గంటలకు నిందితులు ఉపయో గించిన నంబర్‌ లేని బ్రీజా కారు పొన్నూరు క్రాస్‌రోడ్స్‌లో కనిపించింది. 2:27 గంటలకు సెంటినరీ కాలనీలోని తెలంగాణ చౌరస్తా వద్దకు వచ్చింది. వీరి వెనుకే గట్టు వామన్‌రావు దంపతులు ప్రయాణిస్తున్న క్రెటా కారు 2:29 గంటలకు పొన్నూరు క్రాస్‌రోడ్స్‌ వద్ద పెద్దపల్లి వైపు వెళ్లగా 2:30.09 గంటలకు తెలంగాణ చౌరస్తా వద్ద క్రాస్‌ అయింది. అంటే, నిందితుల కారుకు, న్యాయవాద దంపతుల కారుకు మధ్య నున్న సమయ వ్యత్యాసం 3 నిమిషాలే. తెలంగాణ చౌరస్తా నుంచి హత్య జరిగిన ప్రాంతానికి రెండున్నర కి.మీ. దూరం ఉండగా కారులో 2 నిమిషాల్లోనే చేరుకునే అవకాశం ఉంది. దీనిని బట్టి హత్య 2:32 గంటల సమయంలో జరిగినట్లు తెలుస్తోంది. ఐదారు నిమిషాల్లోనే హత్యలు చేసి నిందితులు తిరుగు ప్రయాణమై సీసీటీవీ ఫుటేజీల్లో చిక్కారు. 2:41 గంటలకు హత్యకు వాడిన బ్రీజా కారు తెలంగాణ చౌరస్తాలోకి చేరుకోగా, వీరిని వెంబడించిన కుంట శ్రీనివాస్‌కు చెందిన వైట్‌ క్రెటా కారు కూడా 2:42 గంటలకే తెలంగాణ చౌరస్తాలో కనిపించింది.

బిట్టు శ్రీనుకు కుంట శ్రీను కాల్‌..
వామన్‌రావు దంపతులు మంథని కోర్టుకు రావడాన్ని కుంట శ్రీనివాస్‌ 17న  మధ్యాహ్నం 12:45 గంటలకు బిట్టు శ్రీనుకు చెప్పినట్టు ఫోన్‌కాల్‌డేటాను బట్టి తెలుస్తోంది. దీన్ని నిర్ధారించుకోమని బిట్టు శ్రీను అనడంతో కుంట శ్రీనివాస్‌.. పూదరి లచ్చయ్యకి కాల్‌ చేసి వామన్‌రావు వచ్చాడో లేదో చెప్పాలన్నాడు. దీంతో 12:47 గంటలకు లచ్చయ్య కాల్‌ చేసి వామన్‌రావు రాకను నిర్ధారించాడు. అప్పుడు కుంట శ్రీనివాస్‌ మంథని లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం లొకేషన్‌ నుంచి మాట్లాడినట్టు కాల్‌డేటా ఆధారంగా గుర్తించారు. అప్పటి నుంచి ఫోన్‌ కాల్స్‌ ద్వారానే కుంట శ్రీనివాస్‌(ఏ1), బిట్టు శ్రీను(ఏ4), పూదరి లచ్చయ్య(ఏ5), చిరంజీవి (ఏ2), కుమార్‌ (ఏ3)లు మాట్లాడుకుంటూ ఉన్నారు. హత్యకు ముందు 2:15 గంటలకు చిరంజీవికి చివరి ఫోన్‌కాల్‌ చేసిన కుంట శ్రీనివాస్‌.. అతడిని తీసుకుని కారులో 17 నిమిషాల్లోనే స్పాట్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది. 

గుంజపడుగులో పోలీసుల విచారణ..
హత్యకు గ్రామంలోని కక్షలే కారణమని నిందితులు పేర్కొనడంతో మంథని మం డలం గుంజపడుగులో పోలీసులు విచారణ చేపట్టారు. హత్యకు ఉపయోగించిన కత్తులు తయారు చేసిన బాబు, రఘు, శ్రీనులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కరీంనగర్‌ జైలులో ఉన్న నిందితులు కుంట శ్రీనివాస్, శివందుల చిరంజీవి, అక్కపాక కుమార్‌లను భద్రతా పరమైన కారణాల నేపథ్యంలో వరంగల్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు.  

మరిన్ని వార్తలు