గంజాయి రవాణాపై ఉక్కుపాదం  

22 Oct, 2021 03:23 IST|Sakshi
దుమ్ముగూడెం మండలంలోని కొత్తపల్లి వద్ద అంతర్రాష్ట్ర రహదారి

సరిహద్దుపై డేగకన్ను

ఉమ్మడి ఖమ్మం జిల్లా పోలీసు యంత్రాంగం కసరత్తు 

సీఎం ఆదేశాల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు 

దండకారణ్యంలో జోరుగా గంజాయి సాగు 

ఇక్కడి నుంచే పలు రాష్ట్రాలకు గంజాయి సరఫరా 

ఉమ్మడి జిల్లాలో 78 హాట్‌స్పాట్లు గుర్తింపు 

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: గంజాయి సాగు, రవాణా, అమ్మకాలపై ఉక్కుపాదం మోపేలా ఉమ్మడి ఖమ్మం జిల్లా పోలీసు యంత్రాంగం కసరత్తు చేస్తోంది. చత్తీస్‌గఢ్, ఏఓబీలోని దండకారణ్యం నుంచి గంజాయి ఉమ్మడి ఖమ్మం జిల్లా మీదుగా పలు రాష్ట్రాలకు సరఫరా అవుతున్నట్లు తేలింది. దీంతో సరిహద్దులో నిఘా కట్టుదిట్టం చేసి, నిత్యం తనిఖీలతో పాటు తీసుకోవాల్సిన చర్యలపై ఉమ్మడి జిల్లా పోలీసులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 78 హాట్‌స్పాట్లను గుర్తించిన పోలీసులు ఆ ప్రాంతాల్లో డేగ కన్నుతో నిఘా వేయనున్నారు. ఇక్కడ గంజాయి రవాణాకు బ్రేక్‌ వేయడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మత్తు దందాకు చెక్‌ పెట్టనున్నారు. 

ఇక తనిఖీలు ముమ్మరం 
ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో పట్టుబడిన గంజాయి అక్రమ రవాణా కేసుల్లో మహారాష్ట్ర, ఎంపీ, కర్ణాటకలకు చెందిన వ్యక్తులు కూడా ఉన్నారు. ప్రస్తుతం గంజాయి దందా రూ.కోట్లకు చేరింది. బుధవారం గంజాయిపై జరిగిన సమీక్షలో సీఎం ఆదేశాల మేరకు భద్రాచలం, చర్ల, చింతూరు, బూర్గంపాడు దారిలో, పాల్వంచ, కొత్తగూడెం, అశ్వారావుపేట, ఇల్లందు, మణుగూరు, మధిర, సత్తుపల్లి, బోనకల్, కామేపల్లి మండలాల్లో ఇకపై  నిత్యం తనిఖీలు చేపట్టనున్నారు. 

దండకారణ్యం గంజాయి వనం 
ఉమ్మడి ఖమ్మం జిల్లా సరిహద్దులోని చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లోని సుక్మా, దంతెవాడ, ఖాంఖేడ్, బీజాపూర్, మల్కాన్‌గిరి జిల్లాల్లో భారీగా గంజాయి సాగవుతోంది. అత్యధికంగా మల్కాన్‌గిరి జిల్లాలోనే గంజాయి సాగు ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇక్కడి ఆదివాసీలతో దళారులు కొన్నేళ్లుగా గంజాయి సాగు చేయిస్తున్నారు. గత రెండేళ్లుగా ఇది మరింత పెరిగింది. ఇక్కడ సాగు చేసిన గంజాయి ఎండబెట్టిన తర్వాత ప్యాకింగ్‌ చేసి మల్కాన్‌గిరి నుంచి సీలేరు, మోతుగూడెం, చింతూరు మీదుగా భద్రాచలం చేరుస్తారు. అలాగే దంతెవాడ, బీజాపూర్, సుక్‌మా జిల్లాల నుంచి కుంట మీదుగా భద్రాచలానికి సరఫరా అవుతుంది. 

24 గంటలు తనిఖీలు.. 
గంజాయి రవాణా, అమ్మకాలు, సాగుపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం ఉన్న చెక్‌పోస్టులకు తోడు పలు ప్రాంతాల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరికొన్ని చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తాం. హాట్‌స్పాట్లలో నిరంతర నిఘా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో 24 గంటలు తనిఖీలు ఉంటాయి.        –విష్ణు ఎస్‌.వారియర్, పోలీస్‌ కమిషనర్, ఖమ్మం

మరిన్ని వార్తలు