చెప్పిన కథనంలో అనుమానాలు.. అసలేం జరిగింది..?

20 Apr, 2021 13:39 IST|Sakshi

క్షేమంగా ఇంటికి చేరిన రాజేశం, మల్లయ్య

అదుపులోకి తీసుకున్న పోలీసులు 

సాక్షి, రామగిరి(మంథని): రామగిరి మండలం లద్నాపూర్‌కు చెందిన చిప్ప రాజేశం, ఉడుత మల్లయ్యలు భూమి రిజిస్ట్రేషన్‌ కోసం రూ.50 లక్షలతో శనివారం ఇంటి నుంచి బయలుదేరి అదృశ్యమయ్యారు. సోమవారం తెల్లవారు జామున ఇంటికి చేరుకున్నారు. అయితే తమను కొంతమంది కిడ్నాప్‌ చేసి డబ్బులు కాజేశారని చెబుతున్న తీరు పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. ఈ ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకొని సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేసి పలు కోణాల్లో విచారణ చేపడుతున్నారు. బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. భూ రిజిస్ట్రేషన్‌ కోసం రాజేశం, మల్లయ్య శనివారం రూ.50 లక్షలతో ద్విచక్ర వాహనంపై కాటారం బయలుదేరారు. మార్గమధ్యలో బట్టుపల్లి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి ద్విచక్రవాహనాన్ని ఆపి, మాస్క్‌ పెట్టుకోకుండా ఎక్కడి వెళ్తున్నారని ప్రశ్నించి వివరాలు నోట్‌ చేసుకున్నాడు.

అయితే ద్విచక్ర వాహనాన్ని ఆపింది పోలీసు అనుకొని వీరు భయపడ్డారు. అంతలోనే మరో వ్యక్తి అక్కడికి వచ్చి రాజేశం సెల్‌ఫోన్‌ లాక్కొని స్విచ్‌ఆఫ్‌ చేసి, ఇద్దరి కళ్లకు గంతలు కట్టి దాదాపు అరగంట కారులో ప్రయాణించిన తర్వాత ఒక ఇంట్లో బంధించారు. ఆదివారం అర్ధరాత్రి మళ్లీ కళ్లకు గంతలు కట్టి కారులో తీసుకువచ్చి రాజాపూర్‌ శివారు ఎల్‌–7 ఎస్సారెస్పీ కాలువ వద్ద వదిలిపెట్టడంతో ప్రాణ భయంతో పరుగెత్తుకుంటూ ఇంటికి చేరినట్లు వెల్లడించారు. వారు చెప్పిన కథనంలో అనుమానాలు రేకెత్తిస్తుండడంతో రామగిరి ఎస్సై మహేందర్‌ ఆధ్వర్యంలో పోలీసులు పలు కోణాల్లో విచారణ చేపడుతున్నారు. అసలు ఏం జరిగిందో, బాధితులు చెప్పే కథనంలో ఎంతవరకు వాస్తవం ఉందో పోలీసుల విచారణలో తేటతెల్లం కానుంది.

మరిన్ని వార్తలు