కొడంగల్‌లో వేడెక్కుతున్న రాజకీయం

1 Feb, 2023 12:04 IST|Sakshi

అధికార పార్టీలో ఇంటిపోరు జిల్లా మొత్తానికి పాకింది. గతంలో తాండూరు, వికారాబాద్‌కే పరిమితమైన గ్రూపు రాజకీయాలు.. నెమ్మదిగా పరిగి, కొడంగల్‌కు విస్తరించాయి. ఈసారి బీఆర్‌ఎస్‌ టికెట్‌ తమకే ఇవ్వాలని కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, ఆయన మద్దతుదారులు పట్టుబడుతున్నారు. కాదు.. కూడదూ..అంటే ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటామనే సంకేతాలిస్తున్నారు.  

వికారాబాద్‌: కొడంగల్‌లో గులాబీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.. మెల్లమెల్లగా కారులో చిచ్చు రగులుతోంది. అధికార పార్టీలో ఇప్పటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు.. మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి కార్యచరణ ప్రకటనతో బహిర్గతమైంది. దీంతో తాండూరు, పరిగి, వికారాబాద్‌ నియోజకవర్గాలకే పరిమితమైన ఇంటిపోరు కొడంగల్‌కు సైతం పాకినట్లయింది. త్వరలోనే మండలాల వారీగా తమ అనుచరులతో సమావేశమై వారి అభిప్రాయాల మేరకు భవిష్యత్‌ ప్రణాళికను ప్రకటించేందుకు గురునాథ్‌రెడ్డి సిద్ధమవుతున్నారు. ఈ నెల 3న మీటింగ్‌ ఏర్పాటుకు నిర్ణయించగా.. కేటీఆర్‌ నుంచి వచి్చన పిలుపు మేరకు తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. గత సోమవారమే గురునాథ్‌రెడ్డి.. మంత్రి కేటీఆర్‌తో భేటీ కావాల్సి ఉండగా అనివార్య కారణాలతో మీటింగ్‌ రద్దయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మరో రెండుమూడు రోజుల పాటు వేచిచూసి తమ నిర్ణయం వెల్లడిస్తారని తెలుస్తోంది. 

మా పరిస్థితి ఏంటి..? 
ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఉమ్మడి ఏపీలో కార్పొరేషన్‌ చైర్మన్‌గా పనిచేసిన గురునాథ్‌రెడ్డి కొడంగల్‌ గడ్డపై ఓ వెలుగు వెలిగిన నేత. 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యరి్థగా పోటీ చేసి 7వేల ఓట్ల తేడాతో, 2014లో టీఆర్‌ఎస్‌ నుంచి బరిలో దిగి 15 వేల ఓట్లతో రేవంత్‌రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. దీంతో కొడంగల్‌ గడ్డపై రేవంత్‌రెడ్డిని ఎలాగైనా ఓడించాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. ఇందులో భాగంగా నియోజకవర్గంపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. ఈ క్రమంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పట్నం ఫ్యామిలీ నుంచి నరేందర్‌రెడ్డిని బరిలోకి దింపింది. మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ వంటి హేమాహేమీలకు ప్రచార, గెలుపు బాధ్యతలను అప్పగించారు. ఈ క్రమంలో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన నరేందర్‌రెడ్డి కొడంగల్‌లో పాతుకుపోయే పనిలో నిమగ్నమయ్యారు. ఫలితంగా దశాబ్దాలుగా తిరుగులేని శక్తిగా కొనసాగిన గురునాథ్‌రెడ్డి రాజకీయంగా వెనుకబాటును ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తింది. 

టికెట్‌ ఇస్తేనే కొనసాగుతాం.. 
ఒక్క చాన్స్‌ అంటూ కొడంగల్‌లో అడుగుపెట్టిన నరేందర్‌రెడ్డి ఏకు మేకై కూర్చున్నారు.అధికార పార్టీ తరఫున ఈసారి కూడా ఆయనే బరిలో ఉంటారనే ఊహాగానాల నేపథ్యంలోబీఆర్‌ఎస్‌తో తాడోపేడో తేల్చుకునేందుకు గురునాథ్‌రెడ్డి మద్దతుదారులు రెడీ అవుతున్నారు. అప్పట్లో పార్టీ నిర్ణయానికి కట్టుబడి నరేందర్‌రెడ్డికి అవకాశం ఇచ్చామని, ప్రతీసారి ఆయనే పోటీ చేస్తారంటే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈసారి తన కుమారుడు, మున్సిపల్‌ చైర్మన్‌ జగదీశ్వర్‌రెడ్డిని రంగంలో దింపాలని గురునాథ్‌రెడ్డి భావిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇస్తేనే పార్టీలో కొనసాగుతామని, లేదంటే స్వతంత్రఅభ్యరి్థగా పోటీ చేస్తామనే సంకేతాలు ఇస్తున్నారు. 2018లో తాము నిస్వార్థంగా నరేందర్‌రెడ్డికి సపోర్ట్‌ చేశామని, ఇప్పుడు ఆయన తమకు మద్దతివ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.   

కేసీఆర్‌ మాటను గౌరవించాం 
గత ఎన్నికల్లో నరేందర్‌రెడ్డికి అవకాశం ఇవ్వాలని పెద్దలు కేసీఆర్‌ చెప్పిన మాటను గౌరవించాం. నరేందర్‌రెడ్డి గెలుపుకోసం కృషిచేశాం. కొడంగల్‌లో కేసీఆర్‌ గౌరవాన్ని నిలబెట్టినం. ఆయన ఈ తూరిగూడ నాకే ఎమ్మెల్యే టికెట్‌ కావాలంటే మేమెట్ల ఒప్పుకుంటం. స్థానికులకే టికెట్‌ ఇవ్వాలని లోకల్‌ క్యాడర్‌ కోరుతోంది. ఇచ్చిన మాట ప్రకారం ఈసారి మాకే టికెట్‌ ఇవ్వాలి. ఎట్టి పరిస్థితిలోనూ మేము ఎమ్మెల్యే బరిలో ఉంటాం.  
– గురునాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, కొడంగల్‌   

మరిన్ని వార్తలు