నేను సీఎం కేసీఆర్‌ నిర్ణయాలకు కట్టుబడి ఉంటా..

3 Apr, 2023 12:26 IST|Sakshi

నేను సీఎం కేసీఆర్‌ నిర్ణయాలకు కట్టుబడి ఉంటా.. ఆత్మీయ సమావేశాలకు నియోజకవర్గాలకు ఎమ్మెల్సీలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇన్‌చార్‌్జలుగా నియమించారు.. నల్గొండకు ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి ఇన్‌చార్జ్‌ బాధ్యతలు ఇవ్వడం వల్లే పిలవడం లేదు. నియోజకవర్గానికి చెందిన రాష్ట్రస్థాయి, ఇతర పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులను ఒక్కో సమావేశానికి అతిథులుగా పిలుస్తున్నాము. 4వ తేదీ స్టేషన్‌ఘన్‌పూర్‌లో జరిగే క్లస్టర్‌–1 ఆత్మీయ సమావేశానికి కడియం శ్రీహరిని ఆహ్వానిస్తున్నాం. 
– డాక్టర్‌ టి.రాజయ్య, ఎమ్మెల్యే స్టేషన్‌ఘన్‌పూర్‌

సీఎం ఆదేశాలను స్థానిక నాయకత్వం ఖాతరుచేయడంలేదు. ఎన్నికల్లో నాకు సహాయం చేయమని ఎమ్మెల్యే రాజయ్య అనడంతో పార్టీ నిర్ణయానికి కట్టుబడి సొంత డబ్బు పెట్టి పని చేశాను. పల్లా్ల రాజేశ్వర్‌రెడ్డి కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా మీరు ఒక్కరే నా ఎన్నికలకు పని చేశారని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు, పెద్ద పెద్ద సభలు, సమావేశాలు ఉన్నప్పుడు సహాయం తీసుకుని ప్రభుత్వ కార్యక్రమాలు, ఆత్మీయ సమావేశాలకు నన్ను ఆహ్వానించడం లేదు. ఇప్పటికైనా ఆత్మీయ సమావేశాలకు సమాచారం ఇవ్వాలి.
– కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ

సాక్షిప్రతినిధి, వరంగల్‌: జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే డాక్టర్‌ టి.రాజయ్యల మధ్య మాటల మంటలు చల్లారడం లేదు. మాజీ ఉప ముఖ్యమంత్రుల మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు. దాదాపు మూడేళ్ల క్రితం మొదలైన ఆధిపత్య పోరు రోజురోజుకూ రాజుకుంటోంది. హైకమాండ్‌ పలుమార్లు కలుగజేసుకుని ఇద్దరు నేతలతో సంప్రదింపులు జరిపినా తాత్కాలికమే అయ్యింది. ఇటీవల స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో షోడషపల్లిలో కేటీఆర్‌ సభ తర్వాత అంతా సద్దుమణిగిందని అందరూ భావించారు. అయితే ఆదివారం స్టేషన్‌ఘన్‌పూర్‌ మండల కేంద్రంలో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ సందర్భంగా కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ముఖ్యమంత్రి ఆదేశాలను స్థానిక నాయకత్వం ఖాతరుచేయడంలేదు.. స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గం ఆత్మీయ సమావేశాలకు నాకు సమాచారం ఇవ్వడం లేదు’ అంటూ పరోక్షంగా ఎమ్మెల్యే రాజయ్యను ఉద్దేశించిన వ్యాఖ్యలు మళ్లీ వివాదాలకు తెర లేపాయి. 

మూడేళ్లుగా ‘స్టేషన్‌’లో ఆధిపత్యపోరు..
ఒకే పార్టీలో స్టేషన్‌ఘన్‌పూర్‌లో రెండు గ్రూపుల ప్రతినిధులవుతున్న కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్యలు మొదటి నుంచి ప్రత్యర్థులే. కడియం శ్రీహరి టీడీపీ నుంచి స్టేషన్‌ఘన్‌పూర్‌లో మూడు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ హయంలో మంత్రిగా సైతం పని చేశారు. అదే నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి తాటికొండ రాజయ్య ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజయ్య తర్వాత టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో రాజయ్య, శ్రీహరి ప్రత్యర్థులుగా పోటీ చేయగా రాజయ్య విజయం సాధించారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీలో ఉన్న శ్రీహరి ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇద్ద రు ఒకే పార్టీలో కొనసాగుతున్నా.. దాదాపు మూడేళ్లుగా ఆధిపత్యపోరు నడుస్తోంది. 

2014 ఎన్నికల తర్వాత తాటికొండ రాజయ్య డిప్యూటీ సీఎం కావడం.. ఆరు నెలల తర్వాత పలు ఆరోపణల నేపథ్యంలో  రాజయ్య డిప్యూటీ సీఎం పదవిని పొగొట్టుకోగా, సీఎం కేసీఆర్‌ కడియం శ్రీహరికి కట్టబెట్టడం అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది. అధిష్టానమే ఈ కీలక నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఈ నియామకంతో ఈ ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. 2018లో జరిగిన ఎన్నికల తర్వాత కేటీఆర్‌ జోక్యం చేసుకుని రాజయ్య, శ్రీహరిల మధ్య రాజీ కుదిర్చారు. అది కూడా కొద్ది రోజులే కాగా.. మూడేళ్లుగా ఈ ఇద్దరు నేతల గ్రూపుల పోరు యధాతధంగా సాగుతోంది. 

హైకమాండ్‌ సీరియస్‌.. త్వరలోనే నిర్ణయం
కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్యల వివాదంపై బీఆర్‌ఎస్‌ అధిష్టానం సైతం సీరియస్‌గానే ఆలోచిస్తున్నదన్న చర్చ పార్టీ నేతల్లో సాగుతోంది. ఉప ముఖ్యమంత్రులుగా పని చేసిన ఇద్దరు నేతల మధ్య నెలకొన్న వివాదం మొత్తం పార్టీ ఇమేజ్‌పైన ప్రభావం చూపే అవకాశం ఉందన్న ఆలోచనకు వచ్చినట్లు చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్‌లో అక్కడక్కడా బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధుల మధ్యన ఉన్న చిన్న చిన్న విభేదాలను ‘స్టేషన్‌ఘన్‌పూర్‌’ పాలిటిక్స్‌ ప్రభావితం చేసే అవకాశం కూడా లేకపోలేదన్న ఇంటిలిజెన్స్‌ సూచనలను హైకమాండ్‌ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అధిష్టానానికి తలనొప్పిగా మారిన స్టేషన్‌ఘన్‌పూర్‌ రాజకీయాలను కట్టడి చేసేందుకు త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నామని ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. ఇంటలిజెన్స్‌ రిపోర్టుతో పాటు ఐదుగురు సీనియర్‌ ప్రజాప్రతినిధులతో ఓ కమిటీ వేసి నివేదిక తెప్పించే యోచనలో కూడా అధిష్టానం ఉన్నట్లు సమాచారం.    

మరిన్ని వార్తలు