రాజకీయాలు చేయను: తమిళిసై

13 Feb, 2021 01:49 IST|Sakshi

ప్రజలకు నష్టం జరిగితే ఊరుకోను

అంశాల వారీగా ప్రభుత్వంతో సంబంధాలు.. సర్కార్‌కు అనుకూలం కాదు.. వ్యతిరేకమూ కాదు

త్వరలో గిరిజన ప్రాంతాల్లో ‘గవర్నర్‌ అన్నం’ కార్యక్రమం

మీడియాతో గవర్నర్‌ తమిళిసై

సాక్షి, హైదరాబాద్‌: గవర్నర్‌గా రాజకీయాలు చేయబోనని, అలాగని ప్రజలకు నష్టం జరుగుతుంటే ప్రభుత్వంతో రాజీపడే ప్రసక్తే లేదని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వంతో వివాదాస్పదంగా కాకుండా నిర్మాణా త్మకంగా వ్యవహరిస్తానని చెప్పారు. ముఖ్యమంత్రితో తన సంబంధాలు అంశాల వారీగా ఆధారపడి ఉంటాయన్నారు. ప్రభుత్వానికి తాను అనుకూలమో లేదా వ్యతిరేకమో కాదని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా గవర్నర్‌ పదవికి న్యాయం చేస్తానని చెప్పారు. రాజకీయ నేతలు గవర్నర్‌గా రావొచ్చని, అయితే రాజకీయాలు చేయరాదన్నది తన అభిమతమన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటా నని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కూడా అలాగే వ్యవహరిస్తానని చెప్పారు.

గవర్నర్‌ పదవి చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా రూపొందించిన ‘తొలి ఏడాది స్మృతులతో మున్ముందుకు’ ఫొటోఫీచర్‌ పుస్తకాన్ని తమిళిసై శుక్రవారం రాజ్‌భవన్‌లో ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘నా దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలను ప్రభుత్వానికి పంపిస్తూ.. అవి పరిష్కారమయ్యేలా చూస్తా. అందుకోసం రాజ్‌భవన్‌లో ఈ–ఆఫీసు ఏర్పాటు చేశా. ప్రజా సమస్యలు స్వీకరిస్తా. వాటిని ప్రభుత్వానికి పంపి పరిష్కారమయ్యేలా చూస్తా. నాకు ఇష్టమైన విద్య, వైద్య, గిరిజన రంగాలపై ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇస్తా. వాటి అమలుకు కృషి చేస్తా. గవర్నర్‌గా వచ్చిన మొదట్లో నేను చేసిన సూచనలపై స్పందించడానికి ప్రభుత్వం సంశయించినా, తర్వాత స్పందిస్తోంది. ఒక రాజకీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలిగా ఐదున్నరేళ్లు ఉన్నా. గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించాక తెలంగాణ ప్రజల సేవకే అంకితం’అని గవర్నర్‌ పేర్కొన్నారు. 
చదవండి: మీ పదవులు కేసీఆర్‌ భిక్షమే: కేటీఆర్‌

గిరిజనుల కోసం పర్యటన..
విశ్వవిద్యాలయాల్లో పరిపాలన, బోధన తదితర అంశాలపై 14 యూనివర్సిటీల రిజిస్ట్రార్లతో సమీక్ష నిర్వహించి అక్కడున్న లోటుపాట్లు, ఖాళీలు, వీసీల నియమాకానికి సంబంధించి సమగ్ర వివరాలతో ప్రభుత్వానికి నివేదిక పంపిచానని, ఇప్పుడు ప్రభుత్వం అందుకు అనుగుణంగా స్పందిస్తోందని గవర్నర్‌ తమిళిసై చెప్పారు. నెలరోజుల్లోగా యూనివర్సీటీలకు వీసీలను నియమిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. కరోనా సమయంలో విశ్వవిద్యాలయాల్లో ఆన్‌లైన్‌ తరగతులు మొదట తెలంగాణలోనే ప్రారంభం అయ్యాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగుపర్చాలని, తమిళనాడు తరహాలో రూ.100కే ప్రైవేటు వార్డు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎంకు సూచిస్తే.. అందుకు ఆయన అంగీకరించారని చెప్పారు.

గిరిజనుల సమస్యలు తెలుసుకోవడానికి త్వరలో సుదీర్ఘ పర్యటనలు చేస్తానని ప్రకటించారు. ‘కోవిడ్‌ సమయంలో ప్రోటోకాల్స్‌ పక్కనపెట్టి నిమ్స్‌ ఆసుపత్రి సందర్శించి అక్కడి వారియర్స్‌కు మనోధైర్యం కల్పించాను. డెంగీ నివారణకు 15 అంశాలను ప్రభుత్వానికి నివేదించా. కోవిడ్‌ తర్వాత గిరిజనుల్లో పౌష్టికాహారం అందించడానికి గవర్నర్‌ అన్నం కార్యక్రమం ప్రారంభిస్తా.. అందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నా. రెండు వ్యాన్లు, 25 ఎలక్ట్రిక్‌ స్కూటర్లతో ఒక్కో సెంటర్‌లో 100 నుంచి 150 మందికి ప్రతిరోజు అన్నం అందించే ఏర్పాటు చేస్తా. ఇది గవర్నర్‌ విచక్షణ నిధి నుంచి ఖర్చు చేస్తా’అని గవర్నర్‌ వివరించారు.

త్వరలో ప్రజాదర్బార్‌..
తెలంగాణ ఏర్పాటు, తన పుట్టిన రోజు జూన్‌ 2వ తేదీ కావడం యాదృచ్ఛికమని గవర్నర్‌ తమిళిసై పేర్కొన్నారు. యువ గవర్నర్‌గా, ఒక గైనకాలజిస్ట్‌గా కొత్త ఏర్పాటైన తెలంగాణ బిడ్డను ఎలా అభివృద్ధి చేయాలో, కాపాడుకోవాలో తెలుసని వ్యాఖ్యానించారు. తమిళ, తెలంగాణ మహిళల ఆచార, సంప్రదాయ వ్యవహారాలు ఒకేలా ఉంటాయని చెప్పారు. తాను సాధారణ మహిళనని, ప్రజలతో మమేకమవుతానని, త్వరలోనే ప్రజా దర్బార్‌ నిర్వహిస్తూ.. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుంటానని వెల్లడించారు.

కరోనా కారణంగా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ మరణించినప్పుడు చాలా బాధపడినట్లు తెలిపారు. హైదరాబాద్‌ వ్యాక్సిన్‌కు అనుమతి వచ్చినప్పుడు చాలా ఆనందపడ్డానని చెప్పారు. కోవిడ్‌ వ్యాక్సిన్‌ దేశంలోనే తయారు కావడం ప్రధాని ఆత్మనిర్భర్‌ నినాదానికి ఊతమిచ్చేదేనని వ్యాఖ్యానించారు. పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యపై ప్రభుత్వంతో చర్చిస్తానని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో తెలియదని, ఇప్పటికైతే గవర్నర్‌ మాత్రమేనని తెలిపారు.

మహిళా సాధికారత పెరుగుతోంది..
గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించినప్పుడు మంత్రి మండలిలో ఒక్క మహిళ కూడా లేరని, తాను వచ్చాక ఇద్దరు మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించానని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు జీహెచ్‌ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్‌గా ఇద్దరు మహిళలు ఎన్నిక కావడం తెలంగాణలో మహిళా సాధికారత పెరుగుతోందనేందుకు నిదర్శనమని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు