​​​​​​​రెండేళ్ల కింద హడావుడి.. తరలింపు అంతా కాగితాల్లోనే

20 Apr, 2021 09:56 IST|Sakshi

లిస్టులో గ్రేటర్‌ పరిధిలోని 500 రెడ్, ఆరంజ్‌ కేటగిరీ పరిశ్రమలు

వీటిని వికారాబాద్, జహీరాబాద్‌లకు మార్చాలని గతంలోనే నిర్ణయం

మరో 600 ఫార్మా పరిశ్రమలు ముచ్చర్ల ఫార్మాసిటీకి..

తరలింపుపై రెండేళ్లుగా కాలయాపనే...

పీసీబీ, టీఎస్‌ఐఐసీ, పరిశ్రమల శాఖల నిర్లక్ష్యం

కాలుష్యంతో సతమతమవుతున్న జనం

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను సిటీ బయటికి తరలించాలన్న నిర్ణయం కాగితాలకే పరిమితం అవుతోంది. పొల్యూషన్‌ కంట్రోల్‌ బో ర్డు, పరిశ్రమల శాఖ, టీఎస్‌ఐఐసీ విభాగాల మధ్య సమన్వయ లోపంతో తీవ్రంగా జాప్యం జరుగుతోంది. ఇదే సమయంలో పరిశ్రమలున్న ప్రాంతా లు, ఆ చుట్టుపక్కల నివసించే లక్షలాది మంది కాలుష్యంతో తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. 

రెండేళ్ల కింద హడావుడి
హైదరాబాద్‌ సిటీలో ఉన్న కాలుష్య పరిశ్రమలను దశల వారీగా ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి 30 కిలోమీటర్ల అవతలి ప్రాంతాలకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణ యం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ) రెండేళ్ల కింద హడావుడి చేసింది. రెడ్, ఆరంజ్‌ కేటగిరీల కిందికి వచ్చే అత్యంత కాలుష్య కారక 500 కంపెనీలను వికారాబాద్, జహీరాబాద్‌ తదితర ప్రాంతాలకు తరలించాలని.. మరో 600 బల్‌్కడ్రగ్, ఫార్మా, అనుబంధ కంపెనీలను ముచ్చర్లలో ఏర్పాటుచేస్తు న్న ఫార్మాసిటీకి మార్చాలని నిర్ణయించింది. ఏడాది కింద జహీరాబాద్, వికారాబాద్‌ ప్రాంతాలకు పరిశ్రమల తరలిం పు కోసం అవసరమైన స్థలాలను గుర్తించినట్లు టీఎస్‌ఐఐసీ వర్గాలు ప్రకటించాయి. కానీ అడుగు ముందుకుపడలేదు.

ఏయే ప్రాంతాల్లో..
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కాటేదాన్, జీడిమెట్ల, మల్లాపూర్, బాలానగర్, ఉప్పల్, పాశమైలారం తదితర పారిశ్రామిక వాడలున్నాయి. వీటిలో ప్రధానంగా బల్క్‌ డ్రగ్, ఆయిల్, ఇంటరీ్మడియెట్స్, ఆయిల్, ప్లాస్టిక్, రబ్బర్, ప్లాస్టిక్‌ విడిభాగాలు, స్టీలు విడిభాగాల తయారీ వంటి పరిశ్రమలు ఉన్నాయి. ఆయా పారిశ్రామిక వాడల నుంచి వ్యర్థజలాలను శుద్ధి చేయకుండానే బహిరంగ నాలాలు, కాల్వలు, చెరువులు, కుంటల్లోకి వదులుతుండటంతో జల వనరులన్నీ కాలుష్య కాసారంగా మారాయి. సిటీ పరిధిలో సుమారు 100 చెరువులు ప్రమాదకర స్థాయికి చేరినట్టు అంచనా. ఈ నేపథ్యంలోనే తొలుత ఆయా పారిశ్రామికవాడల్లోని కాలుష్య కారక కంపెనీలను తరలించాలని నిర్ణయించారు.

పరిశ్రమ వర్గాల అభ్యంతరాలివే..
ప్రభుత్వం తరలించాలని నిర్ణయించిన సుమారు 1,100 కంపెనీల్లో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలే ఎక్కువగా ఉన్నాయని.. వాటిల్లో సమీప ప్రాంతాలకు చెందిన వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారని పారిశ్రామిక వర్గాలు అంటున్నాయి. వాటిని ఒకేసారి నగరానికి దూరంగా తరలిస్తే.. కార్మికులకు ఉపాధి దూరమవుతుందని, అటు పరిశ్రమలకు పెనుభారంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తరలింపును మధ్యతరహా, భారీ పరిశ్రమలకే వర్తింపజేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

కాలుష్యం పెరిగిపోతోంది
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఉన్న కాలుష్య కారక పరిశ్రమలు జన జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిశ్రమల వల్ల గాలి, నీళ్లు, భూమి అన్నీ కలుషితం అవుతున్నాయి. పరిశ్రమల నుంచి వెలువడుతున్న కార్బన్, సల్ఫర్‌ ఉద్గారాలతో కొన్ని ప్రాంతాల్లో ఊపిరాడని పరిస్థితి నెలకొంటోంది. అదే సమయంలో సిటీలోని వందల చెరువులు, కుంటలు విషపూరిత రసాయనాలతో ప్రమాదకరంగా మారాయి. మరోవైపు పలు పరిశ్రమల నుంచి వెలువడుతున్న ఘన, ద్రవరూప వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడేస్తుండడంతో మెర్క్యురీ, లెడ్, ఆర్సెనిక్‌ వంటి భార లోహాలు, మూలకాలు, విషపూరిత రసాయనాలు నేలలోకి చేరుతున్నాయి. భూగర్భ జలాలు సైతం కాలుష్యకాసారంగా మారుతున్నాయి.

కాలుష్యానికి కళ్లెం వేసేదిలా?

  • పరిశ్రమల కలుషితాలను నియంత్రించేందు కు పలు నిబంధనలు ఉన్నాయి. వాటిని తప్పనిసరిగా పాటించాలి. దీనిపై పర్యావరణ నిపుణులు కూడా పలు సూచనలు చేశారు.
  • పారిశ్రామిక వ్యర్థాలను ఆరు బయట, నాలాలు, చెరువులు, కుంటల్లో పారబోస్తే క్రిమినల్‌ కేసులు పెట్టాలి. సంబంధిత పరిశ్రమలను మూసేసేందుకు ఆదేశాలివ్వాలి.
  • కొత్తగా ఏర్పాటు చేసే పరిశ్రమలు వ్యర్థాలను శుద్ధి చేసేందుకు తప్పనిసరిగా ఎఫ్లూయెంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు నిర్మించేలా చర్యలు తీసుకోవాలి. వాటిని ఏర్పాటు చేయకుంటే అనుమతులు ఇవ్వొద్దు.
  • పీసీబీ, టీఎస్‌ఐఐసీ, రెవెన్యూ, పోలీస్‌ తదితర శాఖలకు చెందిన అధికారులతో కలిసి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి కాలుష్య ఉద్గారాల కట్టడికి చర్యలు తీసుకోవాలి.
  • నాలాలు, చెరువులు, మూసీ పరీవాహక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి.. వాటిని పీసీబీ, జీహెచ్‌ఎంసీ, పోలీసు కమిషనర్‌ కార్యాలయాలకు అనుసంధానించి నిఘా పెట్టాలి. 

హైదరాబాద్‌ సిటీలో కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమలను కట్టడి చేసేందుకు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నాం. మార్గదర్శకాల ప్రకారం నడుచుకోని కంపెనీల మూసివేతకు ఆదేశాలిస్తున్నాం.
– పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు మాట ఇదీ..

సిటీ నుంచి కాలుష్య పరిశ్రమలను వికారాబాద్, జహీరాబాద్, ముచ్చర్ల ఫార్మా సిటీ ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. మరో ఏడాదిలోగా ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నాం.
– పరిశ్రమలశాఖ వాదన ఇదీ..

పరిశ్రమలను తరలించేందుకు ఆయా ప్రాంతాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నాం. త్వరలోనే తరలింపు పూర్తవుతుంది.    
– టీఎస్‌ఐఐసీ అభిప్రాయమిదీ.. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు