పాలిసెట్‌ ఫలితాలు విడుదల

11 Sep, 2020 01:31 IST|Sakshi

రేపట్నుంచి పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ప్రవేశాల రిజిస్ట్రేషన్‌..

ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌లో 81.14%.. 

అగ్రికల్చర్‌లో 81.34% మందికి అర్హత

కళాశాల విద్యా కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: పాలిసెట్‌–2020 ఫలితాలు విడుదలయ్యాయి. పాలిసెట్‌ పరీక్ష రాసేందుకు 72,920 మంది విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకోగా, ఈనెల 2న జరిగిన పరీక్షకు 56,945 మంది హాజరయ్యారు. అందులో ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌లో 46,207 మంది (81.14 శాతం) అర్హత సాధించగా, అగ్రికల్చర్‌ స్ట్రీమ్‌లో 46,318 మంది (81.34 శాతం) అర్హత సాధించినట్లు (ఒకే విద్యార్థికి రెండు కేటగిరీల్లో ర్యాంకులు) కళాశాల విద్యా కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ వెల్లడించారు. సాంకేతిక విద్యాభవన్‌లో గురువారం పాలిసెట్‌ ఫలితాలను నవీన్‌ మిట్టల్‌ విడుదల చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇందులో 120 మార్కులకు గాను 30 శాతం (36 మార్కులు) మార్కులను కనీస అర్హత మార్కులుగా నిర్ణయించినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు ఒక మార్కును కనీస అర్హత మార్కులుగా నిర్ణయించామని, పరీక్షకు హాజరైన 9,510 మంది ఎస్సీ విద్యార్థుల్లో 9,508 మందికి, పరీక్షకు హాజరైన 4,715 మంది ఎస్టీ విద్యార్థులకు ర్యాంకులను కేటాయించినట్లు వెల్లడించారు. విద్యార్థుల ర్యాంకుల ఆధారంగా ఇంజనీరింగ్‌ పాలిటెక్నిక్, అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌లలో సీట్లను కేటాయిస్తామని వివరించారు. విద్యార్థులు ఈనెల 12 నుంచి రిజిస్టర్‌ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సాంకేతిక విద్యా శిక్షణ మండలి కార్యదర్శి డాక్టర్‌ శ్రీనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.  

>
మరిన్ని వార్తలు