ఇదీ చెరువుల ‘రియాల్టీ’!

2 Nov, 2020 02:15 IST|Sakshi
2000 నుంచి 2020..

చెరువులు, కుంటల్లోనే 500 కాలనీలు.. లేక్‌వ్యూ కమ్యూనిటీలు, ఆకాశహర్మ్యాలు 

రియల్‌ చెరలో 87 చెరువులు.. ఆనవాళ్లు కోల్పోయిన గొలుసుకట్టు తలాబ్‌లు

ఒక్కొక్క చెరువుది... ఒక్కొక్క కథ.. అక్రమాలు నిలువరించని దైన్యం

మహానగరికి... కొత్తపాఠం చెప్పిన అక్టోబర్‌ వరదలు

ఒకప్పుడు సాహెబ్‌నగర్‌ పంచాయతీ పరిధిలో ఆరుతడి పంటలకు నీరందించిన కప్రాయి చెరువు (కప్పల చెరువు) మొత్తం 71 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. ఇప్పుడు మిగిలింది 18 ఎకరాలు మాత్రమే. ఫలితంగా ఇటీవలి వర్షాలకు కట్ట తెగుతుందని ఎల్బీనగర్‌ ఏరియా గజగజ వణికింది. 1996లో హుడా అనుమతితో ఓ స్టార్‌ హోటల్‌ అధినేత చెరువు శిఖం భూమిలోనే వెంచర్‌ వేసి... హరిహరాపురం కాలనీ పేరుతో 627 ప్లాట్లు విక్రయించారు. ఇటీవల కురిసిన వర్షంతో హరిహరాపురం మొత్తం ఫస్ట్‌ఫ్లోర్‌ వరకు మునిగి పది రోజులు వరద నీటిలో విలవిలలాడింది.

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌... ఒకప్పుడు బాగ్‌లు (వనాలు), తలాబ్‌(చెరువులు)లతో అలరారిన మహానగరం. కానీ ఇప్పుడు చెరువు శిఖం భూము లతో పాటు తూములు, అలుగులు, నాలాలపై భారీ నిర్మాణాలతో వరదనీరు పోయే దారిలేక... చేజేతులా ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఒకటా రెండా... జీహెచ్‌ఎంసీ పరిధిలో ఏకంగా ఎనభై ఏడు చెరువులకు అధికార యంత్రాంగం కను సన్నల్లో రాజకీయ నాయకులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఉరిపోసి.. ఉసురు తీశారు. చెరువు లను చెరపట్టి... ఐదువందల కాలనీలు ఏర్పాటు చేసి అమాయకంగా కొనుగోలు చేసిన జనాన్ని, ఇటు నగరాన్ని నిండా ముంచేశారు. నగరానికి తలాపున ఉన్న శాతంచెరువు 70 ఎకరాలకు గానూ ఇప్పుడు మిగిలింది కేవలం పది ఎకరాలే. ఉస్మానియా యూనివర్సిటీ మీదుగా వచ్చే వరదతో నిండే, రామంతాపూర్‌ ప్రగతినగర్‌లో పంటలకు నీళ్లందించిన 26 ఎకరాల పెద్దచెరువు కుత్తుక వరకు నిర్మాణాలకు జీహెచ్‌ఎంసీ అనుమతులిచ్చేసింది. ఫలితంగా ఇటీవలి భారీ వర్షాలకు ఐదు కాలనీలను 12 ఫీట్ల వరద ముంచెత్తి... వాస్తవ ఎఫ్‌టీఎల్‌ (ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌) హద్దులు ఏవో తేల్చిచెప్పింది. మిషన్‌ కాకతీయ పేరుతో నిర్ణయించిన పూర్తి జలాశయ హద్దులు (ఎఫ్‌టీఎల్‌) కూడా సరి కావని ప్రకృతి నిర్ధారించినట్లయింది.

రెండు దశాబ్దాలుగా కాలయాపన
హైదరాబాద్‌ మహానగర అభివృద్ధి సంస్థ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ –మల్కాజిగిరి పరిధిలో 1,728 చెరువులను గుర్తించిన యంత్రాంగం పూర్తి హద్దులు నిర్ణయించేందుకు రెండు దశాబ్దాలుగా కాలయాపన చేస్తూనే ఉంది. ఇప్పటివరకు కేవలం 192 చెరువులనే నోటిఫై చేసి చేతులు దులుపుకుంది. మిషన్‌ కాకతీయతో మళ్లీ నగర చెరువులకు ప్రాణం పోయాలన్న సర్కారు ప్రయత్నం ఆరేళ్లుగా కార్యరూపం దాల్చనే లేదు. మూసాపేట మైసమ్మ చెరువు భూముల్లో ఏకంగా ఆకాశహర్మ్యాలే లేచాయి. శేరిలింగంపల్లిలోని దేవునికుంట, సున్నంచెరువు, మంగలికుంటలు సైతం ప్రైవేటు చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఒకప్పుడు గోల్కొండ రాజులకు మంచినీరందించిన దుర్గంచెరువు సైతం అన్యాక్రాంతం నుండి తప్పించుకోలేకపోయింది. 125 ఎకరాల విస్తీర్ణంలో 25 ఎకరాల్లో గార్డెన్‌లు వెలిశాయి. దుర్గుం చెరువు నుండి కఠోరాహౌజ్‌కు నీరందించే గొట్టపుమార్గంపైన కూడా అక్రమ నిర్మాణాలు వచ్చేశాయి.

నిధులు, నివేదికలు... బుట్టదాఖలు 
2000 సంవత్సరంలో హైదరాబాద్‌ను వరదలు ముంచెత్తిన తర్వాత... కారణాలు, నివారణ మార్గాల కోసం 2003లో ప్రభుత్వం కిర్లోస్కర్‌ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీతో సర్వే చేయించింది. తొలుత ఓల్డ్‌ ఎంసీహెచ్‌ (హైదరాబాద్‌ జిల్లా), రెండవ దఫాలో జీహెచ్‌ఎంసీలో వరద నీటి పారుదల, కాలువల ఆధునీకరణ ప్రాజెక్ట్‌ను కిర్లోస్కర్‌ కమిటీ రూపొందించింది. దీనికి కోసం 6,247 కోట్ల నిధులు అవసరమవుతాయని నిర్ధారించారు. అయితే అత్యవసరంగా మేజర్‌ నాలాలను విస్తరించేందుకు 2008లో జేఎన్‌యూఆర్‌ఎం కింద రూ.300 కోట్ల నిధులు మంజూరు కాగా వాటిలో కేవలం రూ.120 కోట్లనే ఖర్చు చేశారు. మిగిలిన రూ.180 కోట్లు సకాలంలో ఖర్చు చేయక మురగబెట్టారు.

రామంతాపూర్‌లో..పెద్ద విషాదం
రామంతాపూర్‌ పెద్ద చెరువు విస్తీర్ణం 26 ఎకరాలు కాగా..ఇప్పుడు మిగిలింది కేవలం 12 ఎకరాలే. అలుగు, తూము ఆనవాళ్లే లేకుండా నిండా నిర్మాణాలు వచ్చేశాయి. అధికారులే ఆక్రమణలు నిజమేనని సమాచారహక్కు చట్టం కింద తేల్చేసి చేతులు దులుపుకున్న ఫలితంగా ఇటీవలి వరదతో సాయిచిత్రనగర్, మహేశ్వరినగర్, రవీంద్రనగర్‌ నిండా మునిగాయి.

మునుగుతాయని తెలిసినా... పేదలకు పట్టాలు
472 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఫాక్స్‌సాగర్‌లో 120 ఎకరాలు.. అన్యాక్రాంతమైపోయింది. ఇక్కడ ఒక ఎకరం ఖరీదు రూ.3 కోట్ల పైమాటే.. ఎఫ్‌టీఎల్‌లోనే భారీ నిర్మాణాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రసాయన గోదాములున్నాయి. 2003లో అప్పటి ప్రభుత్వం సైతం 11 ఎకరాల్లో 642 మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలిచ్చింది. అక్కడ ఉమామహేశ్వరినగర్‌ వెలిసింది. ఫాక్స్‌సాగర్‌కు వరద వచ్చిన ప్రతిసారీ ఉమామహేశ్వరి నగర్‌ నిండా మునగటం పరిపాటి అయింది. 

ఆపద తొలగని అంబీర్‌చెరువు
ఇక ప్రగతినగర్, శంశీగూడల మధ్య ఒకప్పుడు పంటపొలాలకు నీరందించిన అంబీర్‌చెరువు సర్వేనెంబర్‌ 103లో 154.34 ఎకరాల విస్తీర్ణం ఉన్నట్లు కాగితాల్లో చూపుతున్నా... అక్కడ 54 ఎకరాలకు పైగా నిర్మాణాలు వచ్చేశాయి. ప్రగతినగర్‌–శంశీగూడల సర్వేనెంబర్ల ఓవర్‌ల్యాపింగ్‌ను ఆసరాగా చేసుకున్న నాయకులు, వ్యాపారులు ఏకంగా జీహెచ్‌ఎంసీ అనుమతితోనే భారీ నిర్మాణాలు చేశారు. హైటెక్‌ సిటీకి చేరువగా ఉండటంతో కోట్లు గడించారు.

ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండాలి
సాహీ ఎన్జీఓ సంస్థ కొండాపూర్‌ మజీద్‌బండలో ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలోని కుడికుంటకు మూడేళ్లలో కొత్త ఊపిరి పోసింది. ఆక్రమణలు లేకుండా చెత్త, డ్రైనేజీ నీటిని డైవర్ట్‌ చేసి వందేళ్ల క్రితం నాటి వైభవాన్ని తెచ్చింది. ఈ కుంటపై తీసిన ‘లాస్ట్‌ మైల్‌ ఫర్‌ వాటర్‌’అనే షార్ట్‌ ఫిలిం ఐక్యరాజ్య సమితి బెస్ట్‌ సిటీస్‌పై నిర్వహించిన కాంపిటీషన్‌లో స్థానం సంపాదించింది. ఈ విషయమై సాహి సభ్యురాలు కల్పనా రమేష్‌ మాట్లాడుతూ వ్యక్తులుగానే మేం కుడికుంటకు పునర్జీవం పోశాం. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే నగరమంతటా చేయవచ్చని పేర్కొన్నారు.

2000
శాతం చెరువు పరిస్థితి ఇదీ..

2020
ఈ పాపం అందరిదీ: లుబ్మా సర్వత్, సేవ్‌ అవర్‌ లేక్‌ సొసైటీ
నగరంలో చెరువు, కుంటలు మాయమై వరద నీటిలో బతికే దుస్థితికి అన్ని వ్యవస్థలూ కారణమే. ఇది వ్యవస్థీకృత నేరంగా చెప్పొచ్చు. రాజకీయనాయకులు, అధికారులు, ఇతర రాజ్యాంగ వ్యవస్థలు బాధ్యతతో వ్యవహరిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు. హైదరాబాద్‌ మహానగరం వాస్తవ పరిస్థితి ఏమిటో ఇటీవలి వరదలు చూపెట్టాయి. ప్రభుత్వం ఇప్పటికైనా కఠిన నిర్ణయాలతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది.

మరిన్ని వార్తలు