ఖమ్మం బీఆర్‌ఎస్‌కు ఒకేసారి భారీ షాకులు?.. తుమ్మలతో పాటు పొంగులేటి.. షాతో చర్చలు??

9 Jan, 2023 11:39 IST|Sakshi

సాక్షి, ఖమ్మం: ఉమ్మడి జిల్లాల్లో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. తీవ్ర అసంతృప్తిలో ఉన్న బీఆర్‌ఎస్‌(భారత రాష్ట్ర సమితి) నేతలు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. సంక్రాంతి తర్వాత ఇందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఈ క్రమంలో.. 

జిల్లా మాజీ ఎంపీ  పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీలో చేరనున్నారనే ప్రచారం తాజాగా తెర మీదకు వచ్చింది. పార్టీలో ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారన్నది తాజాగా ఆయన చేసిన కామెంట్లను బట్టి అర్థమవుతోంది. అయితే.. ఆయన పార్టీ మారతానని నేరుగా మాత్రం ప్రకటించలేదు. కానీ, తెర వెనుక బీజేపీ అధిష్టానం నేరుగా ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

బీజేపీ జాతీయస్థాయి నేత.. కేంద్ర మంత్రి అయిన అమిత్‌ షాతోనే పొంగులేటి భేటీ అవుతారనే సమాచారం అందుతోంది. అతిత్వరలోనే ఈ భేటీ ఉంటుందని..  పార్టీ తరపున అధిష్టానం స్పష్టమైన హామీ అందిన తర్వాతనే ఆయన కాషాయం కండువా కప్పుకోవచ్చని స్పష్టమవుతోంది. అంతేకాదు..  ఆత్మీయ సమావేశంలో పొంగులేటి మాట్లాడుతూ నాలుగేళ్లుగా అవమానాలే ఎదురవుతున్నాయని వ్యాఖ్యానించారు.  రాబోయే రోజుల్లో ప్రజలు ఏది కోరుకుంటున్నారో అదే జరగడం ఖాయమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు.. పార్టీ మార్పు దిశగా సంకేతాలు అందిస్తోంది. వచ్చే ఎన్నికల కురుక్షేత్రానికి శీనన్న సిద్ధమంటూ ప్రకటించుకున్నారు కూడా ఆయన. అదే సమయంలో ఆయన భద్రతను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అయితే.. 

పొంగులేటి వర్గం ఈ ప్రచారంపై స్పష్టత ఇవ్వలేదు. కానీ, ఉమ్మడి జిల్లాలోని పది నిజయోకవర్గాల్లో ఉన్న తన అనుచరులతో ఆయన వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. మంగళవారం పినపాకలోనూ సమావేశం అవుతారని తెలుస్తోంది. మరోవైపు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం పార్టీ మార్పు పై త్వరలో నిర్ణయం తీసుకుంటారని ఆయన వర్గీయులు చర్చించుకుంటున్నారు. అయితే ఆయన అడుగులు ఎటువైపు అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

మరిన్ని వార్తలు