ఫ్యాషన్‌ డిజైనర్‌గా పని చేశా: పూనమ్ ‌కౌర్‌

27 Jul, 2020 08:41 IST|Sakshi

రైతులు, చేనేతలు.. దేశానికి వెన్నెముక

సాక్షి, చౌటుప్పల్‌: రైతులు, చేనేతలు.. దేశానికి వెన్నెముకలాంటివారని ప్రముఖ సినీనటి పూనమ్‌కౌర్‌ అన్నారు. కరోనాతో ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న చౌటుప్పల్, నారాయణపురం మండలాల్లోని 220 మంది  చేనేత కార్మికులకు హైదరాబాద్‌లోని నాస్కామ్‌ ఫౌండేషన్, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లోని ఎస్‌సీఎస్‌సీ సంస్థల సౌజన్యంతో సమకూర్చిన నిత్యావసర సరుకులను ఆదివారం చౌటుప్పల్‌లోని పద్మావతి ఫంక్షన్‌హాల్‌లో పంపిణీ చేసి మాట్లాడారు. ఈ రెండురగాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. స్వాతంత్య్రానికి పూర్వమే చేనేత వస్త్రాలు విదేశాలకు ఎగుమతి అవ్వేవని తెలిపారు. నేతన్నల కళా నైపుణ్యం ఎంతో గొప్పదని కొనియాడారు. పర్యావరణానికి అనుగుణంగా చేనేత వస్త్రాలు ఉంటాయన్నారు.

మాట్లాడుతున్న ప్రముఖ సినీనటి పూనమ్‌కౌర్‌

తమ తండ్రి 30ఏళ్ల క్రితం హైదరాబాద్‌ వచ్చి చీరల వ్యాపారం ప్రారంభించారన్నారు. తాను సైతం ఫ్యాషన్‌ డిజైనర్‌గా పని చేశానన్నారు. చేనేత కార్మికుల ఇండ్లకు వెళ్లి వారి స్థితిగతులను తెలుసుకున్నానని, మగ్గం సైతం నేసానని తెలిపారు. కరోనా సమయంలో ప్రభుత్వాలు చేనేత, వ్యవసాయ రంగాలకు చేయూతనివ్వాలని కోరారు. అనంతరం చేనేత సంఘంలోని వస్త్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక చేనేత సంఘం అధ్యక్షుడు  కందగట్ల భిక్షపతి, యర్రమాద వెంకన్న, బడుగు మాణిక్యం, గోశిక స్వామి, గుర్రం నర్సింహ్మ, గోశిక ధనుంజయ, నల్ల నర్సింహ్మ తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు