Hyderabad MMTS Trains: అంతా తల్లకిందులు.. ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ఎంఎంటీఎస్‌ రైళ్లు

3 Oct, 2022 13:08 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో : ఎంఎంటీఎస్‌ రైళ్లు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి.  ఈ రైళ్ల కోసం ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తుంది. ట్రైన్‌ ఎక్కిన తరువాత కూడా ఏ సమయానికి గమ్యం చేరుకుంటారో  తెలియని పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు సమయపాలనలో నెంబర్‌ వన్‌గా నిలిచిన ఎంఎంటీఎస్‌ రైళ్లు ఇప్పుడు అట్టర్‌ప్లాప్‌ అయ్యాయి. మరోవైపు  సరీ్వసుల సంఖ్యను సైతం భారీగా తగ్గించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధాన రైళ్ల నిర్వహణ కోసం ఎంఎంటీఎస్‌  రైళ్లను నిలిపివేస్తున్నారు. దీంతో ఈ సరీ్వసుల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది.  

ప్రతి సర్వీసు ఆలస్యమే... 
‘రాజధాని ఎక్స్‌ప్రెస్‌ కంటే  ఎంఎంటీఎస్‌కే అత్యధిక ప్రాధాన్యతనివ్వాలనే’ లక్ష్యంతో ప్రారంభించిన ఈ లోకల్‌  రైళ్ల సేవలు క్రమంగా మసకబారుతున్నాయి. కోవిడ్‌ ప్రభావంతో కుదేలైన ఎంఎంటీఎస్‌ వ్యవస్థను పునరుద్ధరించి ఏడాది దాటినా ఇప్పటికీ ఈ రైళ్ల నిర్వహణ పట్టాలెక్కకపోవడం గమనార్హం. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. కానీ  ప్రతి సరీ్వసు  అరగంట నుంచి  గంట వరకు ఆలస్యంగా నడుస్తున్నట్లు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగంలో పని చేసే ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్‌ నిపుణులు ఎంఎంటీఎస్‌ను నమ్ముకొని ప్రయాణం చేశారు.

ఇప్పుడు ఉద్యోగ వర్గాలకు చెందిన వేలాది మంది ఈ సరీ్వసులకు దూరమయ్యారు. కేవలం సమయపాలన లేకపోవడం వల్లనే  ఎంఎంటీఎస్‌లో ప్రయాణించలేకపోతున్నట్లు బాలకిషన్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి తెలిపారు.‘మధ్యాహ్నం 3 గంటలకు  ఒక ట్రైన్‌ లింగంపల్లి నుంచి ఫలక్‌నుమాకు  బయలుదేరితే  సాయంత్రం 4.30 వరకు మరో ట్రైన్‌ అందుబాటులో ఉండదు. పైగా ఏ రైలు ఎక్కడ ఆగిపోతుందో తెలియదు.’ అని శేఖర్‌ అనే మరో  ప్రయాణికుడు  తెలిపారు.ఏదో ఒక విధంగా  బేగంపేట్‌ వరకు చేరినా అక్కడి నుంచి సికింద్రాబాద్‌కు రావడానికే అరగంట కంటే ఎక్కువ సమయం పడుతుంది. దీంతో లింగంపల్లి నుంచి సికింద్రాబాద్‌కు గంటలో చేరుకోవలసి ఉండగా ఒక్కోసారి గంటన్నర నుంచి రెండు గంటల సమయం పడుతుంది.  

భారీగా ట్రిప్పుల రద్దు.. 
కోవిడ్‌కు ముందుకు ప్రతి రోజు 121 సరీ్వసులు నడిచాయి. ఫలక్‌నుమా–సికింద్రాబాద్‌–లింగంపల్లి, ఫలక్‌నుమా–నాంపల్లి–లింగంపల్లి మధ్య  ప్రతి రోజు 1.6 లక్షల మంది ప్రయాణం చేశారు. కోవిడ్‌ అనంతరం 75 నుంచి 100 సర్వీసులను పునరుద్ధరించారు. కానీ నిర్వహణలో నిర్లక్ష్యం, సరైన సమయపాలన లేకపోవడం వల్ల ఈ రైళ్లపైన ప్రయాణికులు నమ్మకం కోల్పోయారు. దీంతో  రైళ్ల సంఖ్య తగ్గింది. శని, ఆదివారాల్లో గంటకు ఒక రైలు కూడా అందుబాటులో ఉండడం లేదు. ప్రతి వారం 34 రైళ్లను రద్దు చేస్తున్నట్లు చెబుతున్నారు. కానీ  అందుబాటులో ఉండే రైళ్ల సంఖ్య చాలా తక్కువ.  

సికింద్రాబాద్‌పై ఒత్తిడి.. 
మరోవైపు  ఎంఎంటీఎస్‌కు ప్రత్యేక లైన్‌ లేకపోవడం వల్ల ప్రధాన రైళ్ల రాకపోకలతో ఈ రైళ్లకు బ్రేకులు పడుతున్నాయి. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్‌లలో పండుగ రద్దీ కారణంగా రెండు రోజులుగా ప్లాట్‌ఫామ్‌లపై ఒత్తిడి పెరిగింది. దీంతో ఎంఎంటీఎస్‌లు నిలిపేందుకు అవకాశం లేకపోవడంతో తీవ్రమైన జాప్యం నెలకొంటుందని  రైల్వే అధికారి ఒకరు తెలిపారు.

మరిన్ని వార్తలు