ఈ రోడ్డుపై నీళ్లు నిలవవు!

26 Jun, 2022 02:21 IST|Sakshi
నిట్‌లో ‘పోరస్‌ ఆస్ఫాల్ట్‌ ’ శాంపిల్‌ 

వరంగల్‌ నిట్‌లో  ‘పోరస్‌ ఆస్ఫాల్ట్‌’ రోడ్లపై పరిశోధన ∙లోతట్టు, ముంపు ప్రాంతాల్లో ప్రయోజనం 

కాజీపేట అర్బన్‌: ఏ చిన్నపాటి వాన కురిసినా రోడ్లపై నీళ్లు నిలుస్తాయి. వచ్చిపోయే వాహనాలతోపాటు పాదచారులకూ నరకమే. అదే భారీ వర్షాలు కురిస్తే రోడ్లపై నీళ్లతోపాటు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతుంటాయి. ఇలాంటి పరిస్థితికి చెక్‌ పెట్టేందుకు తోడ్పడే ‘పోరస్‌ ఆస్ఫాల్ట్‌’ రోడ్లు, పేవ్‌మెంట్ల నిర్మాణంపై వరంగల్‌ నిట్‌ నిపుణులు పరిశోధన చేస్తున్నారు. నీరు నిలవకుండా ఎప్పటికప్పుడు ఇంకిపోయే ఈ తరహా రోడ్లను.. విదేశాల్లో పలుచోట్ల పార్కింగ్‌ స్థలాలు, ఉద్యానవనాలు వంటి చోట్ల ఇప్పటికే వినియోగిస్తున్నారు.

దీనిని మన పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి చేయడంపై నిట్‌ సివిల్‌ విభాగం ట్రాన్స్‌పోర్ట్‌ డివిజన్‌ ప్రొఫెసర్‌ ఎస్‌.శంకర్, పీహెచ్‌డీ స్కాలర్‌ గుమ్మడి చిరంజీవి పరిశోధన చేస్తున్నారు. ‘పోరస్‌ ఆస్ఫాల్ట్‌’ రోడ్లు/పేవ్‌మెంట్లతో నీరు నిల్వ ఉండకపోవడం వల్ల దోమలు, ఇతర కీటకాలు వృద్ధి చెందవని.. రోగాలు ప్రబలకుండా ఉంటాయని వారు చెప్తున్నారు.

ఎప్పటికప్పుడు నీటిని పీల్చేసుకుని..
సురక్షితమైన ప్రయాణానికి వీలు కల్పించే తారు, సీసీ రోడ్డు మాదిరిగానే ‘పోరస్‌ ఆస్ఫాల్ట్‌’ రోడ్డు ఉంటుంది. సాధారణంగా తారు, సీసీ రోడ్లను నాలుగు దశల్లో మట్టి, కంకర, తారు లేదా సిమెంట్‌ వినియోగించి నిర్మిస్తారు. ఇవి పూర్తిగా గట్టి పొరలా ఉండిపోయి.. లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలుస్తాయి. 

‘పోరస్‌ ఆస్ఫాల్ట్‌’ పేవ్‌మెంట్‌/రోడ్డును 16 దశల్లో వేర్వేరుగా నిర్మిస్తారు. వివిధ పరిమాణాల్లో ఉన్న కంకరను వినియోగిస్తారు. రోడ్డు దృఢంగా ఉంటూనే.. పెద్ద సంఖ్యలో చిన్నచిన్న రంధ్రాలు ఏర్పడేలా చూస్తారు. నీటి ప్రవాహానికి తగినట్టుగా రంధ్రాలు ఉండేలా చూస్తారు. 

వర్షాలు పడినప్పుడు ఈ రోడ్లు నీటిని పీల్చుకుని భూగర్భంలోకి పంపేస్తాయి. వెంట వెంటనే నీళ్లు ఇంకిపోవడం వల్ల నిల్వ ఉండటం, ముంపునకు కారణం కావడం వంటివి ఉండవు. 

పట్టణాల్లో ఇలాంటి రోడ్లు/పేవ్‌మెంట్లను నిర్మించినప్పుడు వాటి దిగువ నుంచి నీళ్లు డ్రైనేజీల్లోకి వెళ్లిపోయేలా ఏర్పాట్లు చేస్తారు. దానితో ఎంతగా వానపడ్డా నీళ్లు నిలవవు. 

ముంపు నివారణ కోసం.. 
నిట్‌ వరంగల్‌ క్యాంపస్‌లో తొలుత పోరస్‌ ఆస్ఫాల్‌ రోడ్డును 50 మీటర్ల మేర ఏర్పాటు చేయనున్నాం. దానిని పరిశీలించి అవసరమైన మార్పులు చేస్తాం. గ్రేటర్‌ వరంగల్‌లో వాన ముంపును నివారించేందుకు ఈ విధానాన్ని అందజేస్తాం. సైడ్‌ డ్రెయిన్స్‌ లేని ప్రాంతాల్లో, ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో ఈ రోడ్లను వేయడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది.
– శంకర్, ప్రొఫెసర్, సివిల్‌ విభాగం 

మరిన్ని వార్తలు