-

Post Covid 19: ఎముకలపైనా కరోనా దెబ్బ 

3 Aug, 2021 08:35 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పటుత్వం కోల్పోతున్నాయంటున్న వైద్య నిపుణులు

రక్తప్రసారం తగ్గి సూక్ష్మ ఫ్రాక్చర్లతో జాయింట్లు దెబ్బతినే ప్రమాదం 

అధిక మోతాదు లేదా అనవసర ఔషధాల వినియోగమే కారణం

నడుం, వెన్నెముక, భుజం నొప్పులు ప్రాథమిక లక్షణాలు 

వృద్ధులతో పాటు యువత కూడా ఏవీఎన్‌కు గురయ్యే అవకాశం

ఒవైసీ ఆస్పత్రి వైద్యుల అధ్యయనంలో వెల్లడి 

కరోనా సెకండ్‌వేవ్‌ తీవ్రత ప్రభావాలు, పరిణామాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా.. దీనితో ముడిపడిన అనారోగ్య సమస్యలు మాత్రం పెరుగుతున్నాయి. కరోనా రోగులు ఏ స్థాయిలో దాని బారిన పడ్డారన్న దానిపై వారు పూర్తిగా కోలుకునే కాలం ఆధారపడి ఉంటుందని వైద్య నిపుణులు, పరిశోధకులు ఇదివరకే తేల్చారు. స్వల్ప, ఒక మోస్తరు, తీవ్ర లక్షణాలు, ఆసుపత్రిలో చేరడం, ఐసీయూ, వెంటిలేటర్‌పైకి వెళ్లడం, స్టెరాయిడ్స్‌ స్థాయిల వినియోగం వంటి వాటిని బట్టి కోవిడ్‌ నుంచి పూర్తిస్థాయిలో కోలుకునేందుకు నెల నుంచి ఆరు నెలలకు పైగా సమయం పడుతుందని అంచనా వేశారు. కీళ్లు, కండరాలు, నరాల వ్యవస్థలపై కోవిడ్‌ అనంతరం ప్రభావాలు తీవ్రంగా ఉన్నట్టు ఇప్పటికే తేలింది. తాజాగా కోవిడ్‌ రోగులు ఎముకల్లో పటుత్వాన్ని కోల్పోతున్నారని (బోన్‌ డెత్‌– అవాసు్క్యలర్‌ నెక్రోసిస్‌ (ఏవీఎన్‌)) హైదరాబాద్‌లోని ఒవైసీ ఆస్పత్రి, రీసెర్చి క్యాంపస్‌ వైద్య పరిశోధకులు డాక్టర్‌ ఆబిద్‌ అలీఖాన్, డాక్టర్‌ మజారుద్దీన్‌ అలీఖాన్‌లు వెల్లడించారు.  
– సాక్షి, హైదరాబాద్‌

కరోనా నుంచి కోలుకునే క్రమంలో ఎముకలకు రక్తప్రసారం తగ్గి సూక్ష్మ ఫ్రాక్చర్లతో (ఎముకలు చిట్లడం) కీళ్లు దెబ్బతినే ప్రమాదం ఉన్నట్టుగా తమ అధ్యయనంలో తేలిందని వైద్యులు తెలిపారు. తగిన చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే దుష్పరిణామాలు సంభవిస్తాయని వారు హెచ్చరిస్తున్నారు. మ్యుకార్‌ మైక్రోసిస్‌ మాదిరిగానే, కరోనా చికిత్సలో భాగంగా మందులు, ఔషధాలు వంటివి ఎక్కువ మోతాదులో తీసుకోవడం లేదా అవసరం లేకపోయినా ఉపయోగించడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నాయని వారు పేర్కొన్నారు.

రాబోయే రోజుల్లో ఈ రకం కేసులు మరింత పెరిగే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యలు వృద్ధులు, వయసు పైబడిన వారిలోనే కాకుండా ఎక్కువ మోతాదులో స్టెరాయిడ్స్‌ ఉపయోగించిన యువతలోనూ బయటపడొచ్చునంటున్నారు. కోవిడ్‌ చికిత్స అనంతరం 50, 60 రోజుల్లో ఏవీఎన్‌ కొందరిలో బయటపడొచ్చని, మరికొందరిలో కనిపించడానికి ఆరు నెలల నుంచి ఏడాది కూడా పట్టొచ్చునని డాక్టర్‌ ఆబిద్‌ అలీఖాన్, డాక్టర్‌ మజారుద్దీన్‌ అలీఖాన్‌ వెల్లడించారు.  

నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం 
ఏవీఎన్‌కు సంబంధించిన లక్షణాలు తొలుత ఎమ్మారై పరీక్షల్లో బయటపడతాయని, తదనంతర పరిస్థితుల్లో ఎక్స్‌రే రేడియోగ్రాఫ్‌లోనూ గుర్తించొచ్చునని చెప్పారు. దీని మొదటిదశ లక్షణాల్లో భాగంగా నడుం, గజ్జలు, వెన్నెముక, భుజం నొప్పులు కనిపించొచ్చునని, వీటిని నిర్లక్ష్యం చేస్తే సమస్య తీవ్రమై జాయింట్లు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంటుందని తెలిపారు. అందువల్ల తొలిదశలోనే దీనిని గుర్తించి అప్రమత్తమైతే అది తీవ్రస్థాయికి చేరకుండా అరికట్టొచ్చుని స్పష్టం చేశారు. ఎముకల జాయింట్ల నొప్పులు పెరుగుతున్నప్పుడు, ఈ నొప్పులు ఆగకుండా కొనసాగుతున్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా ఆర్థోపెడిక్‌ డాక్డర్లను సంప్రదించి సరైన చికిత్స చేయించుకోవాలని డాక్టర్‌ ఆబిద్‌ అలీఖాన్, డాక్టర్‌ మజారుద్దీన్‌ అలీఖాన్‌ సూచించారు.   
 

మరిన్ని వార్తలు