పోస్ట్‌ కోవిడ్‌ సమస్యలు.. ఫిజియోథెరపీతో దూరం

25 May, 2021 11:00 IST|Sakshi

బ్రీతింగ్‌ వ్యాయామాలతో ఆక్సిజన్‌ శాచురేషన్‌ పెంపు

 చెస్ట్‌ ఫిజియోథెరపీతో శ్వాస సంబంధ రుగ్మతలకు చెక్‌

 చిన్న చిన్న ఎక్సర్‌సైజులతో కండరాలు తిరిగి బలోపేతం

 ఆస్పత్రిలో చేరినా, చేరకున్నా ఈ జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు 

గాంధీ ఆస్పత్రి/ఖైరతాబాద్‌:  కరోనా సెకండ్‌ వేవ్‌లో ఊపిరితిత్తులతోపాటు ఇతర అవయవాలు దెబ్బతినడానికీ కారణం అవుతోంది. కోలుకున్నాక కూడా రక్తం గడ్డకట్టడం సహా పలు సమస్యలు తలెత్తుతున్నాయి. దీనివల్ల గుండె, ఇతర అవయవాలకు రక్తం సరిగా సరఫరాగాక, వాటి పనితీరులో తేడా వస్తోంది. పక్షవాతం, గుండెపోటు వంటి ప్రమాదకర పరిణామాలకూ దారితీస్తోంది. ఇటువంటి సమయంలో ఫిజియోథెరపీతో లాభం ఉంటుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. చెస్ట్‌ ఫిజియోథెరపీ, బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌లతో కరోనాకు ముందు, తర్వాత పేషెంట్ల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని స్పష్టం చేస్తున్నారు. ప్రోనింగ్‌ పొజిషన్, పర్స్‌డ్‌ లిప్, డయాఫర్మేటిక్, సెగ్మెంటల్‌ బ్రీతింగ్, స్పెరోమెట్రీ ఎక్సర్‌సైజ్‌లు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని ఫిజియోథెరపిస్ట్‌లు సూచిస్తున్నారు. 

3 నెలల వరకు అప్రమత్తంగా ఉండాలి 
పోస్ట్‌ కోవిడ్‌ కేర్‌ చాలా ముఖ్యం. కరోనా బారినపడి కోలుకున్న తర్వాత మూడు నెలల వరకు మరింత అప్రమత్తంగా ఉండాలి. బ్రీతింగ్, స్పెరో మెట్రీ ఎక్సర్‌సైజ్‌లతోపాటు శారీరక వ్యాయామం, వాకింగ్‌ వంటివి చేయాలి. స్పెరోమీటర్‌ పరికరం అందుబాటు ధరలోనే దొరుకుతుంది. ఈ పరికరంలో మూడు రంగుల బాల్స్‌ ఉంటాయి. పైపు ద్వారా గాలి ఊదుతూ ఆ బాల్స్‌ను పైకి లేపాలి. ఇలా ప్రతి రెండు గంటలకు పదిసార్లు చేయాలి. యూరిక్‌ పంప్, యాక్టివ్‌ ఆర్‌ఓఎం ఎక్సర్‌సైజ్‌లు చేస్తే శరీరంలోని అన్నిభాగాలకు రక్త ప్రసరణ సక్రమంగా జరిగి రక్తం గడ్డలు కట్టే ప్రమాదం తగ్గుతుంది. అవసరమైన బాధితులకు ఆన్‌లైన్‌ ద్వారా ఫిజియోథెరపీ టెక్నిక్‌ వివరిస్తున్నాం. 
–రమేశ్‌ పల్లాటి, ఫిజియోథెరపిస్ట్, గాంధీ ఆస్పత్రి 


ఊపిరితిత్తుల సామర్థ్యం పెంచుకోవాలి 
ఫిజియోథెరపీ టెక్నిక్స్‌తో కరోనా మహమ్మారిని నియంత్రించవచ్చు. యూ ట్యూబ్‌ చానెల్‌ ద్వారా ఆయా అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నాం. కరోనా బారినపడి నెగెటివ్‌ వచ్చిన తర్వాత తప్పనిసరిగా బ్రీతింగ్, స్పెరోమెట్రీ ఎక్సర్‌సైజ్‌లు చేయాలి. దీంతో ఊపిరితిత్తుల సామర్థ్యం పెరగడంతోపాటు ఇతర రుగ్మతలు తిరిగి దరిచేరవు. మానసిక ప్రశాంతత, బలవర్ధకమైన ఆహారం అవసరం. ఫిజియోథెరపీ టెక్నిక్స్, బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌లపై చైతన్య పర్చేందుకు ఎనిమిది నెలలక్రితం ‘డాక్టర్‌ కుమార్‌’పేరిట యూట్యూబ్‌ చానెల్‌ను అందుబాటులోకి తెచ్చాం. ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ కూడా నిర్వహిస్తున్నాం. 
– ఎన్‌.శివజ్యోతి, కార్డియో పల్మనరీ స్పెషలిస్టు, దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ 
కాలేజీ ఆఫ్‌ ఫిజియోథెరపీ 

ఆస్పత్రిలో చేరకున్నా ఫిజియోథెరపీ 
కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నా, హోం ఐసోలేషన్‌లో ఉన్నా కూడా ఫిజియోథెరపీ తీసుకోవడం మంచిది. శరీరం పరిస్థితి యుద్ధంలో గెలిచినా అలసిపోయిన సైనికుడిలా అవుతుంది. ఊపిరితిత్తుల చుట్టూ ఉండే డయాఫ్రం, ఇతర కండరాలు బలహీనం అవుతాయి. వాటికి తిరిగి బలం చేకూర్చేందుకు ఫిజియోథెరపీ ఉపయోగపడుతుంది. ఆస్పత్రిలో ఆక్సిజన్, వెంటిలేటర్‌పై చికిత్స తీసుకున్నవారు మరింత బలహీనంగా అవుతారు. వారు మొదట కొద్దిరోజులు విశ్రాంతి, మంచి పోషకాహారం తీసుకోవాలి. తర్వాత ఫిజియోథెరపీ, వ్యాయామాలు మొదలుపెట్టాలి. వీటిని ఇంట్లోనే చేసుకోవచ్చు. రోజూ 10–15 నిమిషాలు చేస్తే సరిపోతుంది. రెండు, మూడు నెలలు కంటిన్యూ చేస్తే కండరాలు బలోపేతం అవుతాయి. అయితే ఏదైనా డాక్టర్లు, నిపుణుల సూచనల మేరకే చేయాలి. 
– కన్సల్టెంట్‌ ఆర్థోపెడిక్‌ సర్జన్‌ మురళీధర్‌ సాగి, గ్లెనిగల్స్‌ గ్లోబల్‌ హాస్పిటల్స్‌ 

మరిన్ని వార్తలు