Hyderabad Metro: మెట్రో పిల్లర్లపై పోస్టర్లు అంటిస్తే జైలుకే..  మెట్రో ఎండీ హెచ్చరిక

23 Sep, 2022 14:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మెట్రో పిల్లర్స్‌పై ఇష్టానుసారంగా పోస్టర్లు అంటించిన వారిపై సెంట్రల్‌ మెట్రో యాక్ట్‌ ప్రకారం ఆరు నెలల జైలు శిక్ష విధించే చట్టాన్ని పకడ్బందీగా అమలుచేస్తామని హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్వీఎస్‌ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యంగా గల్లీ స్థాయి నాయకులు పోస్టర్లు అంటించి సుందరంగా ఉన్న నగరాన్ని అపరిశుభ్రంగా తయారుచేస్తున్నారని, ఇక మీదట దీనిపై ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు. మెట్రోరైల్‌ స్టేషన్‌ నుంచి ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చే కనెక్టివిటీలో భాగంగా ఒక మిలియన్‌ రైడ్స్‌ మైల్‌స్టోన్‌ను చేరుకున్న సందర్భంగా స్విదా మొబిలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో గురువారం బేగంపేటలోని తాజ్‌వివంతా హోటల్‌లో వేడుకలను నిర్వహించారు.

ఈ సందర్భంగా మరోసారి హైదరాబాద్‌ మెట్రోరైల్, స్విదా సంస్థలు ఎంఓయూ (మెమోరాండం ఆఫ్‌ అండర్‌స్టాండింగ్‌) కుదుర్చుకుని పరస్పరం పత్రాలను మార్చుకున్నాయి. ఈ సందర్భంగా ఎన్వీఎస్‌ రెడ్డి మాట్లాడుతూ.. మెట్రో పిల్లర్స్‌కు ఏర్పాటు చేసిన ప్రకటన బోర్డుల ద్వారా తమ ప్రచార కార్యకలాపాలను కొనసాగించుకోవచ్చని, అందుకోసం ప్రకటన ఏజెన్సీలను ఆశ్రయించాలన్నారు.ఎవరికి వారు పోస్టర్లు అంటిస్తే చర్యలు తప్పవన్నారు. స్విదా మొబిలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ జిగ్నేష్‌ పి. బెల్లని,  ఎల్‌ అండ్‌ టీ మెట్రోరైల్‌ లిమిటెడ్‌ ఎండీ, సీఈఓ కేవీబీ రెడ్డి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు