షాకింగ్‌ ఘటన: చనిపోయిన ఉద్యోగికి పదోన్నత కల్పిస్తూ పోస్టింగ్‌! హాట్‌టాపిక్‌గా డిస్కంలోని హెచ్‌ఆర్‌ పనితీరు

4 Feb, 2023 08:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పదవీ విరమణ చేసిన ఓ ఇంజనీర్‌కు ఏకంగా ఎనిమిదేళ్ల పాటు డబుల్‌ శాలరీ ఇచ్చిన అంశాన్ని ఇంకా పూర్తిగా మరిచిపోక ముందే...తాజాగా చనిపోయిన మరో ఇంజనీర్‌కు ఏకంగా పదోన్నతి కల్పించడంతో పాటు పోస్టింగ్‌ కూడా ఇచ్చిన ఉదంతం వెలుగు చూసింది. దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ హెచ్‌ఆర్‌ విభాగంలోని అధికారుల తప్పిదాలకు సంస్థ ఆర్థికంగా నష్టపోవడంతో పాటు ప్రజల్లో అభాసుపాలవుతోంది.  

రెండేళ్ల క్రితమే చనిపోయిన మల్లయ్య.. 
పి.మల్లయ్య (ఐడీ నంబర్‌ 1077222) మొదట్లో మెట్రోజోన్‌ పరిధిలోని డీఈ కేబుల్‌ ఆఫీసులో సబ్‌ ఇంజనీర్‌గా పనిచేశారు. అటు నుంచి బంజారాహిల్స్‌కు సబ్‌ఇంజనీర్‌గా బదిలీపై వెళ్లారు. అనారోగ్య కారణాల వల్ల ఆయన సుమారు రెండేళ్ల క్రితమే మృతి చెందారు. డిస్కం ఉన్నతాధికారులు చనిపోయిన మల్లయ్య స్థానంలో కారుణ్య నియామకం కింద ఆయన కుమార్తెకు సబ్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం ఇప్పించారు. ప్రస్తుతం ఆమె సైబర్‌సిటీ సర్కిల్‌ ఆఫీసులోని కమర్షియల్‌ సబ్‌ ఇంజనీర్‌గా పని చేస్తోంది. 

రెండు రోజుల క్రితం పదోన్నతి 
రెండు రోజుల క్రితం 49 మంది సబ్‌ ఇంజనీర్లకు డిస్కం ఏఈలుగా పదోన్నతులు కల్పించింది. వీరిలో ఆ మేరకు పదోన్నతులు పొందిన వారి పేర్లతో సహా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే డిస్కం జారీ చేసిన ఈ జాబితాలో చనిపోయిన మల్లయ్య పేరు ఉండటమే కాకుండా ఆయనకు సబ్‌ ఇంజనీర్‌ నుంచి ఏఈగా పదోన్నతి కల్పించారు. ఏకంగా ఆయనకు వికారాబాద్‌లో పోస్టింగ్‌ కూడా ఇచ్చేశారు. ఏఈల జాబితాలో చనిపోయిన మల్లయ్య పేరు ఉండటాన్ని చూసి తోటి ఇంజనీర్లు ఆశ్చర్యపోయారు. అదేమిటని సంబంధిత సెక్షన్‌ అధికారులను, హెచ్‌ఆర్‌ డైరెక్టర్‌ను నిలదీశారు. దీంతో చేసిన తప్పిదాన్ని ఆ తర్వాత సరిదిద్దుకున్నారు. 

(చదవండి: ఖాతాలు, మనుషులే.. పారసైట్‌లు!)

మరిన్ని వార్తలు