అంధకారంలో లోతట్టు ప్రాంతాలు 

14 Oct, 2020 03:21 IST|Sakshi

గ్రేటర్‌ హైదరాబాద్‌లోని సబ్‌స్టేషన్లలోకి చేరిన నీరు

పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

మల్లాపూర్‌లో కరెంట్‌ తీగలు తెగిపడి వ్యక్తి మృతి..  

సాక్షి, హైదరాబాద్‌/మల్లాపూర్‌: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని పలు సబ్‌స్టేషన్లలోకి మంగళవారం వరద నీరు చేరింది. ఫలితంగా ఆయా ఫీడర్ల పరిధిలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, అపార్ట్‌మెంట్ల సెల్లార్లలోకి భారీగా వరద నీరు చేరటంతో జనం బిక్కుబిక్కుమంటున్నారు. మల్లాపూర్‌లో కరెంట్‌ తీగలు తెగిపడి తెనాలికి చెందిన ఫణికుమార్‌ (35) అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు నాచారంలోని లిక్కర్స్‌ ఇండియాలో పనిచేస్తున్నాడు. ఓల్డ్‌సిటీ అంతా అంధకారంలో ఉండిపోయింది.

నిమ్స్, మెహిదీపట్నంతో పాటు సుమారు వంద ఫీడర్ల పరిధిలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొన్నిచోట్ల చెట్ల కొమ్మలు విరిగి వైర్లపై పడగా మరికొన్ని చోట్ల జంపర్‌లు తెగిపడ్డాయి. ఇన్స్‌లేటర్లు ఫెయిలయ్యాయి, విద్యుత్‌ స్తంభాలు నేలకూలడంతో వైర్లు తెగిపోయాయి. పలు కాలనీలన్నీ రోజంతా అంధకారంలో మగ్గిపోయాయి. కొన్నిచోట్ల వెంటనే సరఫరాను పునరుద్ధరించినప్పటికీ చాలా ప్రాంతాలు చీకట్లోనే ఉండిపోయాయి. వీధుల్లో వరదకు తోడు స్ట్రీట్‌ లైట్లు కూడా వెలగకపోవడంతో వాహనదారులకు ఇబ్బంది ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోని నివాసాల్లోకి వరద నీరు వచ్చి చేరటంతో ఆయా ప్రాంతాల్లో అధికారులు ముందు జాగ్రత్తగా విద్యుత్‌ సరఫరాను నిలిపేశారు. హయత్‌నగర్‌ పరిధిలో 12 సబ్‌స్టేషన్లలో విద్యుత్‌ సరఫరాను నిలిపేశారు. రాజేంద్రనగర్, కోఠి ప్రాంతాల్లోనూ విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. 

>
మరిన్ని వార్తలు