కేఏ పాల్‌ గృహ నిర్బంధం

4 May, 2022 01:12 IST|Sakshi

సనత్‌నగర్‌: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ను పోలీసులు మంగళవారం గృహ నిర్బంధం చేశారు. రాజన్న సిరిసిల్లా జిల్లా తంగళ్లపల్లి మండంలోని బస్వాపూర్‌ రైతులను పరామర్శించేందుకు ఆయన వెళ్తుండగా శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో మీడియాతో మాట్లాడుతుండగా తనపై టీఆర్‌ఎస్‌ కార్యకర్త దాడి చేసిన విషయమై ఫిర్యాదు చేసేందుకు మంగళవారం డీజీపీ కార్యాలయానికి వెళ్లాలని పాల్‌ భావించారు.

సమాచారం అందుకున్న పోలీసులు అమీర్‌పేట అపరాజిత కాలనీలోని ఆయన పార్టీ కార్యాలయం వద్ద భారీగా మోహరించారు. డీజీపీ కార్యాలయం వద్ద ధర్నా చేస్తారన్న సమాచారం మేరకు పోలీసులు ఆయనను గృహనిర్బంధం చేసినట్లు తెలుస్తోంది. గృహనిర్బంధంలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై దాడిని తెలంగాణ చరిత్రలో చీకటి రోజుగా అభివర్ణించారు.  ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా కేసీఆర్‌ గూండాయిజం చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 28 సీట్లు కూడా రావని పాల్‌ జోస్యం చెప్పారు. ‘మళ్లీ సిరిసిల్లకు వస్తున్నా. దమ్ముంటే నన్ను ఆపండి. ’అంటూ సవాల్‌ విసిరారు. తనపై దాడి ఘటనలో సిరిసిల్ల ఎస్పీ, డీఎస్పీ, సీఐలను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు