-

ప్రకృతి వనం... ఆక్సి‘జనం’ 

31 Jan, 2023 01:04 IST|Sakshi
మేడ్చల్‌ – మల్కాజిగిరి జిల్లా కచవాని సింగారంలోని ప్రకృతి వనం

కాలుష్య నియంత్రణ కోసం నగర శివారులో సరికొత్త ప్రయోగం 

వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి నుంచి ఉపశమనం 

శివారుల్లో 1,541 పట్టణ, పల్లె ప్రకృతి వనాలు  

అర ఎకరం నుంచి 4 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు 

సాక్షి, మేడ్చల్‌ జిల్లా: నగరీకరణ శరవేగంగా పెరుగుతోంది. దీంతోపాటే కాలుష్యమూ పెచ్చుమీరుతోంది. దీంతో తలెత్తుతున్న అనారోగ్య సమస్యలతోపాటు ఉద్యోగ, వ్యాపారాల్లో ఎదురవుతున్న మానసిక ఒత్తిళ్లు సరేసరి. వీటితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగరవాసులకు చక్కటి సాంత్వన కల్పిస్తున్నాయి ప్రకృతి వనం, లంగ్స్‌ స్పేస్‌.

హరితహారంలో భాగంగా ఆహ్లాదం, ఆరోగ్యాన్ని పంచేందుకు ప్రభుత్వం సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. గ్రేటర్‌తోసహా శివారు పట్టణాలు, సెమీఅర్బన్‌ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే లక్షలాది మొక్కలు నాటిన సర్కారు పల్లె, పట్టణ ప్రకృతి వనాలను పెంచుతోంది. వీటిలో వాకింగ్‌ పాత్‌లు, చిల్ట్రన్‌ కార్నర్స్‌ ఏర్పాటుచేయడంతోపాటు ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు ప్రత్యేక ఏర్పాటుచేస్తోంది.  

80 లక్షల వాహనాలు... ఎన్నో పరిశ్రమలు 
గ్రేటర్‌ పరిధిలో అత్యంత రద్దీగా ఉండే ప్రధాన కూడళ్లలో వాయు కాలుష్యం అవధులు దాటుతోంది. సుమారు 80 లక్షల మేర ఉన్న వాహనాలు వెదజల్లుతున్న పొగతో ‘సిటీ’జన్ల ముక్కుపుటాలు, శ్వాసకోశాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. పలుప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో చెత్తను తగలబెట్టడంతో కాలుష్య తీవ్రత మరింత పెరుగుతోంది.

వీటికితోడు పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యంతో సమీప ప్రాంతాలు పొగచూరుతున్నాయి. ఫలితంగా పీల్చే గాలిలో సూక్ష్మధూళికణాలు చేరి సమీప ప్రాంతాల్లోని ప్రజల ఊపిరితిత్తుల్లోకి చేరుతున్నాయి. ఘనపు మీటరు గాలిలో సూక్ష్మధూళికణాల (పీఎం2.5) మోతాదు 40 మైక్రోగ్రాములకు మించరాదు. కానీ పలు కూడళ్లలో అంతకు రెట్టింపు స్థాయిలో ధూళికాలుష్యం నమోదవుతోంది.

పుర, పంచాయతీల్లో వనాలు 
పుర, పంచాయతీల్లో అర ఎకరం నుంచి 4 ఎకరాల పరిధిలో ప్రకృతి వనాలను ఏర్పాటుచేశారు. గ్రేటర్‌ శివారు (మేడ్చల్‌ జిల్లా + రంగారెడ్డి జిల్లా)లోని 29 పురపాలక సంఘాల్లో 595 పట్టణ ప్రకృతి వనాలున్నాయి. వీటిని పురపాలక సంఘాలు నిర్వహిస్తున్నాయి. అలాగే, 619 పంచాయతీల పరిధిలో 946 పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. ఉపాధి హామీ పథకం నిధులు వెచ్చించి ఎకరాకు 2,500 మొక్కల చొప్పున పెంచారు.  

లంగ్స్‌ స్పేస్‌ ఎక్కడెక్కడ? 
హైదరాబాద్‌ శివారుల్లో ఏడు అర్బన్‌ లంగ్స్‌ స్పేస్‌లున్నాయి.  
►మేడిపల్లి ఫారెస్టు బ్లాకులో 100 ఎకరాల్లో శాంతివనం 
►దూలపల్లి ఫారెస్టు బ్లాకులోని ప్రశాంత వనం 
►నారపల్లిలోని భాగ్యనగరం నందన వనం 
►బహుదూర్‌పల్లి ఫారెస్టు బ్లాకులోని 50 ఎకరాల్లో 
►నాగారం ఫారెస్టు బ్లాకులోని 70 ఎకరాల్లో..  
►నారపల్లి–పర్వతాపూర్‌ ఫారెస్టు బ్లాకులోని 60 ఎకరాల్లో.. 
►కండ్లకోయలోని ఆక్సిజన్‌ పార్కు 

హైదరాబాద్‌లో ఏడాదికి సగం రోజులకుపైగా 
కాలుష్యం నమోదవుతున్న ప్రాంతాలు  
►బాలానగర్, ఉప్పల్, జూబ్లీహిల్స్, చార్మినార్, ప్యారడైజ్, జూపార్క్, పంజగుట్ట, కూకట్‌పల్లి, చిక్కడపల్లి, ఎంజీబీఎస్‌  

మరిన్ని అభివృద్ధి చేస్తాం
నగర శివారుల్లో పల్లె, పట్టణ ప్రకృతి వనాలు, లంగ్స్‌ స్పేస్‌లను మరింత అభివృద్ధి పరుస్తాం. ఇందుకోసం ప్రభుత్వ భూములను కూడా గుర్తిస్తున్నాం. పెరుగుతున్న జనాభా, నగరీకరణ నేపథ్యంలో వీటి అవసరం ఎంతో ఉంది. పెరుగుతున్న కాలుష్యం కట్టడికి ఇవి ఎంతగానో దోహదపడుతున్నాయి. 
– డా.ఎస్‌. హరీశ్, మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ 

స్వచ్ఛమైన గాలి..
ప్రకృతి వనాలు, లంగ్‌ స్పేస్‌లు స్వచ్ఛమైన గాలిని అందిస్తున్నాయి. కాలుష్యం బారి నుంచి రక్షిస్తున్నాయి. సెలవు రోజుల్లో కుటుంబ సభ్యులతో కలిసి వెళుతున్నాం. రోజంతా అక్కడే ఉండాలనిపిస్తుంది. 
– కె. ఆంజనేయులు, పోచారం 

గొప్ప ఉపశమనం..
నారపల్లి–పర్వతాపూర్‌లోని 60 ఎకరాల్లో ఉన్న అర్బన్‌ లంగ్స్‌ స్పేస్‌ పిల్లలతోపాటు పెద్దలనూ ఆహ్లాదపరుస్తోంది. నగరానికి సమీపంలో ఉండటం వల్ల ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో పెద్ద సంఖ్యలో మహిళలు, వృద్ధులు వస్తారు. ఆటపాటలతో అందరూ ఆనందంలో మునిగితేలుతారు.    
–పి. రవికిరణ్, పీర్జాదిగూడ  

మరిన్ని వార్తలు