4వ వారంలో పీఆర్సీ..!

17 Jan, 2021 02:37 IST|Sakshi

ఈనెల 21 తర్వాత ఎప్పుడైనా ప్రకటన

21, 22 తేదీల్లో ‘సీఎస్‌’ కమిటీ భేటీ!

ఆ వెంటనే సీఎంకు పీఆర్సీపై నివేదిక

తర్వాత ఫిట్‌మెంట్‌ను ప్రకటించనున్న సీఎం  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈనెల 4వ వారంలో వేతన సవరణ కమిటీ (పీఆర్సీ) ఫిట్‌మెంట్‌ శాతంతోపాటు పదవీ విరమణ వయసు పెంపుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కీలక ప్రకటన చేసే అవకాశముంది. ఈ నెల 21 తర్వాత ఎప్పుడైనా ఈ ప్రకటన రావచ్చని ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సీఆర్‌ బిస్వాల్‌ నేతృత్వంలోని తొలి తెలంగాణ వేతన సవరణ కమిటీ గత నెల 31న బీఆర్‌కేఆర్‌ భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌కు పీఆర్సీ నివేదిక సమర్పించింది. పీఆర్సీ నివేదికపై అధ్యయనం కోసం సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ నేతృత్వంలో ఆర్థిక, నీటిపారుదల శాఖల ముఖ్య కార్యదర్శులు కె.రామకృష్ణారావు, రజత్‌కుమార్‌తో సీఎం కేసీఆర్‌ త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

పీఆర్సీ నివేదికపై అధ్యయనం, ఉద్యోగ సంఘాలతో సంప్రదింపుల ప్రక్రియలను జనవరి తొలి వారంలోనే పూర్తి చేసి, రెండో వారంలోగా ఈ కమిటీ తనకు నివేదిక సమర్పించనుందని, మూడో వారంలో తాను స్వయంగా పీఆర్సీ ప్రకటిస్తానని గత నెల 31న ప్రగతి భవన్‌లో ఉద్యోగ సంఘాల నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఉద్యోగులకు పదోన్నతులపై భారీఎత్తున కసరత్తు జరుగుతుండటం, కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయాల్సి రావడంతో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ గత రెండు వారాలుగా తీరిక లేకుండా గడపాల్సి వచ్చింది. దీంతో ఇప్పటివరకు ఆయన నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ అధికారికంగా సమావేశం కాలేదు. ఈ నెల 18న కేంద్ర పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ రాష్ట్ర పర్యటనకు రానుంది. అదే విధంగా 19న రాష్ట్ర కేడర్‌ ఐఏఎస్‌ అధికారులకు పదోన్నతుల కల్పన అంశంపై డిపార్ట్‌మెంటల్‌ ప్రమోషన్స్‌ కమిటీ (డీపీసీ) నిర్వహించాల్సి ఉంది. ఈ నెల 19 వరకు సీఎస్‌ తీరిక లేకుండా అధికారిక సమావేశాలు, కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

గురుగోవింద్‌సింగ్‌ జయంతి కావడంతో 20న సెలవు. దీంతో 21 లేదా 22 తేదీల్లో సీఎస్‌ నేతృత్వంలోని కమిటీ సమావేశమై పీఆర్సీ నివేదికపై అధ్యయనం జరిపే అవకాశాలున్నాయి. ఆ వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదిక సమర్పించనుందని ఉన్నత స్థాయి ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నివేదిక అందిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉద్యోగ సంఘాల సమక్షంలో పీఆర్సీ ఫిట్‌మెంట్‌ శాతంతో పాటు, 61 ఏళ్లకు పదవీ విరమణ వయసు పెంపుపై కీలక ప్రకటనలు చేయవచ్చని తెలుస్తోంది. ఉద్యోగ సంఘాలకు ఇప్పటికే ఇచ్చిన మాట ప్రకారం జనవరి మూడో వారంలోనే పీఆర్సీ ఫిట్‌మెంట్‌ను ప్రకటించాలని భావిస్తే, ఈ నెల 21న ముఖ్యమంత్రి ప్రకటన చేయవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.

రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరి తొలి వారంలో కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ప్రకటించే అవకాశముంది. ఆ వెంటనే నాగార్జునసాగర్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ రానుంది. ఈ రెండు నోటిఫికేషన్లు వచ్చే నెల తొలివారంలో ఒకేసారి రావచ్చు అని కూడా ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎన్నికల ప్రకటన వచ్చిన తర్వాత దాదాపు 40 రోజులపాటు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితిల్లో ఈనెల 4వ వారంలోనే పీఆర్సీని ప్రకటించే అవకాశాలున్నాయి. 

మమ్మల్ని చర్చలకు పిలవాలి: ఉద్యోగ సంఘాలు
పీఆర్సీతో పాటు ఉద్యోగులకు సంబంధించిన ఇతర సమస్యలపై తమను చర్చలకు పిలవాలని ఉద్యోగ సంఘాలు కోరుకుంటున్నాయి. గుర్తింపు పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ఏర్పడిన జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ ప్రతినిధులతో సీఎస్‌ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ చర్చలు జరపాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. ఇప్పటికే ఆలస్యం కావడంతో చర్చలకు వెళ్లకుండా నేరుగా సీఎంకు నివేదిక సమర్పించాలని త్రిసభ్య కమిటీ భావిస్తున్న నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతలు ఈ డిమాండ్‌ను తెరపైకి తెచ్చినట్టు తెలిసింది.

మరిన్ని వార్తలు